ఐదేళ్లలో అద్దంలా తీర్చిదిద్దుతాం
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కేటీఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్: త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటువేసి ఐదేళ్ల సమయమిస్తే.. మహానగరాన్ని దశలవారీగా అద్దంలా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అంబర్‌పేట నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎంతసేపూ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నా రు. విమర్శలుమాని ఢిల్లీ బాట పట్టి తెలంగాణకు నిధులు సాధించే పని పెట్టుకోవాలని హితవు పలికారు.
కిషన్‌రెడ్డికి దమ్ముంటే జీహెచ్‌ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ రూ.లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించేలా కృషి చేయాలని సవాల్ విసిరారు. దేశంలో ఎన్నికలు జరిగే ప్రతిచోటుకూ వెళ్లి ప్యాకేజీలు ప్రకటించడాన్ని మోదీ అలవాటు చేసుకున్నారన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ స్వచ్ఛ భారత్ పేరిట ఎవరి చీపురు వారికిచ్చి ఊడ్చుకొమ్మని.. ఎవరి డబ్బుతో వారు బ్యాంక్ ఖాతా తె రుచుకోవాలని చెప్పిందే తప్ప పేదలకు లబ్ధి చేకూర్చే ఒక్క సంక్షేమ పథకాన్నీ ప్రవేశపెట్టలేదన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల అమలులో దళారులు డబ్బులు అడిగితే చెప్పుతో కోట్టాలని కేటీఆర్ పేదలకు సూచించారు.