నేడే తేలేది..
- నేడే తేలేది..
- బరిలో మిగిలేదెవరో.. తప్పుకునేదెవరో!
- ఊపందుకున్న బుజ్జగింపులు
- ప్రచారాస్త్రాలతో సమరాంగణంలోకి..
- వ్యూహ ప్రతివ్యూహాలకు పదును
సాక్షి, సిటీబ్యూరో: వాడివేడి వ్యూహాలు.. బుజ్జగింపులు..బేరసారాలు.. సిద్ధమైన ప్రచారాస్త్రాలు.. గ్రేటర్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. హోరాహోరీ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు అభ్యర్థులంతా నేటి నుంచి సమరాంగణంలోకి దూకనున్నారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఆయా పార్టీల నుంచి రెబల్స్‌గా బరిలో దిగిన వారిని బుజ్జగించే యత్నాలు జోరందుకున్నాయి.
రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకోకుంటే ఎన్నికల బ్యాలెట్‌లో వారి పేరుంటుంది. దీన్ని నివారించేందుకు ఆయా పార్టీల ప్రధాన అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పలుచోట్ల పోటీ నుంచి తప్పుకునేందుకు రెబల్స్ ససేమిరా అంటున్నారు. వెనక్కి తగ్గబోమని తెగేసి చెబుతున్నారు. ఈ పరిణామాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి.
పోటాపోటీగా ప్రచార సన్నాహాలు
తుదిగా బరిలో ఎవరెవరు ఉంటారో నేడు తేలిపోనుంది. ప్రత్యర్థులెవరో దాదాపు తెలిసిపోయింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాస్త్రాలకు పదును పెడుతున్నారు. హంగు ఆర్భాటాలు, అనుచరగణంతో జనంలోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచార కార్యక్రమాల్ని ఆయా పార్టీల ముఖ్య నాయకులు ప్రారంభించనుండటం ఆసక్తి కలిగిస్తోంది. వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకురాలు వైఎస్ షర్మిల, టీడీపీ, టీఆర్‌ఎస్ అధినేతలు చంద్రబాబు, కేసీఆర్ గ్రేటర్ వ్యాప్తంగా రోడ్‌షోలు, ర్యాలీలు, బహిరంగసభలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాలకు భారీగా జనాన్ని తరలించేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతల రాక తమకు అనుకూలంగా మారుతుందని, కార్యకర్తల్లో ఊపు తెస్తుందని వారంతా భావిస్తున్నారు.
అధికారులకు ఈవీఎంల బెడద
నామినేషన్ల ఉపసంహరణకు శనివారం చివరి రోజు కావడంతో, చివరకు బరిలో ఎందరు మిగులుతారనే దానిపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టారు. పోలింగ్‌కు వినియోగించే ఈవీఎంలలో మొత్తం 16 బటన్లుండగా, వీటిలో ఒకటి ‘నోటా’కు పోను 15 పార్టీ చిహ్నాల డిస్‌ప్లేకు వీలుంటుంది. అంతకుమించి రంగంలో మిగిలితే మరో ఈవీఎంను అదనంగా వాడాల్సిందే. శనివారం ఈ విషయంలో స్పష్టత ఏర్పడనుంది.
కొందరు దారిలో.. ఇంకొందరు బరిలోనే..
శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి, హఫీజ్‌పేట కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్.. ప్రజల మద్దతున్న తాను పోటీలోనే ఉంటానని చెబుతున్నారు. పలు బస్తీలవాసులు ఆయనను కలిసి అండగా నిలుస్తున్నారు. దీంతో ఆయన మనసు మారే పరిస్థితి కనిపించట్లేదు. ఆయన పోటీలో ఉంటే అది లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతుందని భావిస్తున్న చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి, ఆయన తల్లి సబితా ఇంద్రారెడ్డి జగదీశ్వర్‌గౌడ్‌ను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది
శేరిలింగంపల్లిలో టీడీపీకీ రెబల్ పోటు తప్పేలా లేదు. మొవ్వా సత్యనారాయణ పట్టు వీడేది లేదని చెబుతున్నారు. గడువులోగా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే
ఎల్‌బీనగర్ నుంచి టీడీపీ తిరుగుబాటు అభ్యర్థి సామ రంగారెడ్డి పోటీలో ఉంటాననే చెబుతున్నారు
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ రెబల్స్‌గా బరిలో ఉన్న పీఎల్ శ్రీనివాస్, బద్రినాథ్, ఏడుకొండ లు ఆంతర్యం పార్టీ వర్గాలకు అంతుబట్టడం లేదు
గోషామహల్‌లో పార్టీ అభ్యర్థికి సవాల్ విసురుతున్న గోవింద్‌రాఠి, నందకిశోర్‌వ్యాస్, రామస్వామిలను బుజ్జగించడంలో బీజేపీ అధిష్ఠానం కొంతమేర సఫలమైనట్లు తెలుస్తోంది
ముషీరాబాద్‌లో కాంగ్రెస్ రెబల్స్ సునీతాప్రకాశ్, బీసీ సెల్ చైర్మన్ నగేష్‌ముదిరాజ్‌లను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పార్టీ అభ్యర్థి డాక్టర్ వినయ్‌కుమార్ సునీతా ప్రకాశ్ ఇంటికి వెళ్లి సహకరించాలని కోరడంతో ఆమె మెత్తబడ్డట్లు సమాచారం. నగేశ్ ముదిరాజ్‌ను దారిలోకి తెచ్చుకునే పనిలో పీసీసీ ఉన్నట్టు తెలుస్తోంది