నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో పూర్తి
- మూడు గంటల వరకే సమయం
- జెడ్పీ నామినేషన్లు 422
- తిరస్కరణకు గురైనవి 52
- ఉపసంహరణలు 20
- ఎంపీటీసీ నామినేషన్లు 4,820
- తిరస్కరణకు గురైనవి 204
- ఉపసంహరణలు 329
- ప్రధాన అభ్యర్థుల గుండెల్లో మోగుతున్న రె‘బెల్స్’
జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణకు సోమవారంతో గడువు ముగియనుంది. రె‘బెల్స్’ బెడద ఉన్నచోట్ల వారిని పోటీనుంచి తప్పించేందుకు ప్రధాన అభ్యర్థులు తమ యత్నాలు ముమ్మరం చేశారు. వారి నామినేషన్లు ఉపసంహరింపజేయకపోతే తమ ఓటుబ్యాంకు చీలుతుందనే భయం వారిని వెన్నాడుతోంది.
మచిలీపట్నం న్యూస్‌లైన్ : జెడ్‌పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ల ఉపసంహరణ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. జిల్లాలోని 49 జెడ్పీటీసీ స్థానాలకు 422 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 52 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 826 ఎంపీటీసీ స్థానాలకు 4,820 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 204 తిరస్కరించారు. ఆదివారం జెడ్పీటీసీ అభ్యర్థులు 20 మంది తమ నామినేషన్లు ఉపసంహరించారు. ఎంపీటీసీ సభ్యులు 329 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఐదు కౌంటర్ల ద్వారా నామినేషన్లు స్వీకరించగా ఈ కౌంటర్ల ద్వారానే నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం నడుస్తోంది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
తొలగని రెబల్స్ బెడద...
అనేకచోట్ల ప్రధాన అభ్యర్థులకు రెబల్స్ బెడద ఇంకా తొలగలేదు. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన అభ్యర్థులు బుజ్జగించో.. ప్రలోభ పెట్టో.. పోటీనుంచి వారిని తప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమ ఓట్లు చీలకుండా చూసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే నేతలు పలువురు రెబల్ అభ్యర్థులను బుజ్జగించి ఉపసంహరింపజేయగా, మిగిలినవారు మాత్రం పట్టుదల వీడకపోవడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏదేమైనా సోమవారం అధిక సంఖ్యలో నామినేషన్ల ఉపసంహరణ ఉండే అవకాశముంది.
ఉపసంహరణలు ఇలా...
జెడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసి ఉపసంహరించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీలో నెరుసు షర్మిల (గన్నవరం), కారుమంచి రమేష్, కారుమంచి శ్రీనివాసరావు (గూడూరు), నరసారెడ్డి దనుకొండ, చెరకు నరసారెడ్డి, శీలం కృష్ణారెడ్డి, చావా వెంకటేశ్వరరావు (గంపలగూడెం), బోయిన వేణుగోపాల్ (కోడూరు), కటికోల ప్రమీలారాణి (జగ్గయ్యపేట) తమ నామినేషన్లు ఉపసంహరించారు. టీడీపీలో అమ్మనబోయిన రూతు (జగ్గయ్యపేట), కోగంటి శివనాగమల్లేశ్వరి (కంచికచర్ల), భూపతి శ్రీనివాసరావు (పెడన), అబ్బూరి హేమలత, కలపాల రజని (బాపులపాడు), కావిటి కృష్ణకుమారి (ఎ.కొండూరు), పాలంకి విజయలక్ష్మి (రెడ్డిగూడెం), తురకా తిరుపతమ్మ (వీరులపాడు), తాతా సుస్మిత (మొవ్వ), బొడ్డు నాగమ్మ (ముదినేపల్లి) తమ నామినేషన్లు ఉపసంహరించిన వారిలో ఉన్నారు. రేపల్లె సీతారామాంజనేయులు (మోపిదేవి) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి ఉపసంహరించుకున్నారు.
ఎంపీటీసీల వివరాలు ఇలా ఉన్నాయి...
జిల్లాలో సోమవారం ఎంపీటీసీ స్థానాలకు 329 మంది అభ్యర్థులు తమ నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ 121, టీడీపీ 170, కాంగ్రెస్ 11, సీపీఎం 1, సీపీఐ 4, ఇండిపెండెంట్లు 22 మంది అభ్యర్థులు ఉన్నారు.