హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు పూర్తయింది. చివరి రోజు 500 మందికి పైగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అయితే చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు పోటీ నుండి తప్పుకోవడానికి నిరాకరించారు. అన్ని పార్టీలకు రెబల్ అభ్యర్థుల బెడద ఉంది. 150 డివిజన్లకు 4,069 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 189 నామినేషన్లను చెల్లుబాటు కానివిగా ఎన్నికల అధికారులు తేల్చారు.
బీఫామ్ల విషయంలో చివరి నిమిషంలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలు ముందుగా ఒకరి పేరును ప్రకటించి బీఫామ్లు మరొకరికి ఇవ్వడంతో.. టికెట్ దక్కని వారు పార్టీ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. పలు డివిజన్లలో టీడీపీ, బీజేపీల పొత్తు వికటించింది. కొన్ని చోట్ల అభ్యర్థులకు రెండు పార్టీలూ బీఫాంలు ఇచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు కాంగ్రెస్ పార్టీ పలువురు అభ్యర్థులను మార్చింది. అధికార పార్టీ టీఆర్ఎస్కు కూడా రెబల్ అభ్యర్థుల బెడద తప్పలేదు.