
కేసీఆర్‌వి మాటలే.. చేతల్లేవ్!
కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి
సైదాబాద్: సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప కూడా దాటడం లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం సైదాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ మాయ మాటలతో మభ్యపెడుతున్నారన్నారు. రెండేళ్లలో అభివృద్ధి చేయని వారు వచ్చే మూడేళ్లలో ఏం చేస్తారని ప్రశ్నించారు. మహానగరం ప్రగతి బాటలో పయనించాలంటే మంచి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో కృషి చేస్తోందన్నారు.
హడ్కో పథకం కింద తెలంగాణకు కేంద్రం రూ.3 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. నగరంలో విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, ఉపాధి కల్పన కార్యాలయాలకు ఇప్పటికే వందల కోట్లు ప్రకటించిందని పేర్కొన్నారు. కేంద్ర సహకారం లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. ఎన్‌డీఏతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, సైదాబాద్ డివిజన్ బీజేపీ అభ్యర్థి శైలజ సురేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె బైక్ ర్యాలీ ప్రారంభించి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్‌జీ, సంరెడ్డి సుదర్శన్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ముద్దం శ్రీకాంత్‌రెడ్డి, జీవన్, అరవింద్‌కుమార్‌గౌడ్, బండారి నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.