బల్దియా బరిలో... శ్రీమంతులు | Srimantulu in the Baldiya ring | Sakshi
Sakshi News home page

బల్దియా బరిలో... శ్రీమంతులు

Published Sun, Jan 24 2016 2:54 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

బల్దియా బరిలో... శ్రీమంతులు - Sakshi

బల్దియా బరిలో... శ్రీమంతులు

♦ కో..అంటే కోట్లే..
♦ ఓట్ల కోసం జనం వద్దకు కోటీశ్వరుల క్యూ...
♦ ప్రమాణ పత్రాల్ల్లో భారీగా ఆస్తులు చూపిన అభ్యర్థులు
 
 బల్దియా బరిలో కోటీశ్వరులు రంగంలోకి దిగారు. ప్రధాన రాజకీయ పక్షాలు ‘శ్రీమంతులకే’ ప్రాధాన్యం ఇచ్చి టిక్కెట్లు పంపిణీ చేశాయి. జెండా..ఎజెండా వేరైనా..సామాజికన్యాయంతో సంబంధం లేకుండా మహా నగరపాలక సంస్థ ఎన్నికల్లో అర్థబలం..అంగబలం ఉన్నవారికే అన్ని పార్టీలూ అవకాశం కల్పించాయి. ఈసారి ‘మహా’ సమరంలో నిలిచిన పలువురు బడా లీడర్లు, వారి వారసులు, మాజీ కార్పొరేటర్లు నామినేషన్ పత్రాలతోపాటే తమ ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు. కోట్లాది రూపాయల ఆస్తుల వివరాలను వెల్లడించారు. హైటెక్ నగరంలో రూ.కోట్లు లేనిదే రాజకీయం చేయలేమనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
 - సాక్షి, సిటీబ్యూరో
 
 గ్రేటర్ ఎన్నికల బరిలో కోట్లకు పడగలెత్తిన నేతలే అధికంగా ఉన్నారు. ఎన్నికల సంఘానికి ఆయా పార్టీల అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలోని ఆస్తుల వివరాల ఆధారంగా ఈ విషయం స్పష్టమైంది. ఇక అభ్యర్థులకు విధించిన వ్యయపరిమితి మాటెలా ఉన్నా..కోట్లాది రూపాయలు ఆస్తులుగా చూపిన అభ్యర్థులకు ఇపుడు ప్రచారపర్వంలో ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటోంది. అభ్యర్థుల ఆస్తుల చిట్టా చూసి ఓటర్లు ఔరా అంటుండగా.. పాతనగరం సహా కొన్ని డివిజన్లలో అభ్యర్థులు ఇప్పటికీ తాము లక్షాధికారులమేనని, కోట్లకు పడగలెత్తలేదని ప్రమాణ పత్రాలు సమర్పించడం గమనార్హం. మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్, బండ కార్తీకరెడ్డి తదితరులు తాము ఇప్పటికీ లక్షాధికారులమేనని ప్రమాణ పత్రం సమర్పించడం విశే షం. పలు డివిజన్ల నుంచి పోటీచేస్తున్న ప్రముఖ అభ్యర్థులు చూపిన ఆస్తుల వివరాలిలా ఉన్నాయి.
 
 జిట్టా రాజశేఖర్‌రెడ్డి: రూ.21.02 కోట్లు
 వనస్థలిపురం డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి తనకు స్థిర, చర ఆస్తుల విలువ రూ.21.02 కోట్ల మేర ఉన్నట్లు ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు.  అంతేకాకుండా రూ.29 లక్షల విలువ చేసే 1.10 కిలోల బంగారు ఆభరణాలున్నట్లు తెలిపారు.
 
 కేకే కూతురు విజయలక్ష్మి: రూ.1.02 కోట్లు
 టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులుకె.కేశవరావు కుమార్తె విజయలక్ష్మి..బంజారాహిల్స్(93) డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెకు రూ. 93 లక్షల విలువైన స్థిర చరాస్తులు ఉన్నాయి. రూ. 9 లక్షల విలువ చేసే బంగారు అభరణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ లెక్కన విజయలక్ష్మి ఆస్తులు రూ.కోటీ రెండు లక్షలు.

 పీజేఆర్ కూతురు విజయారెడ్డి: రూ.11.17 కోట్లు
 ఖైరతాబాద్(91) డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటిచేస్తున్న విజయారెడ్డి దివంగత కాంగ్రెస్ నేత, మాజీ శాసనసభా పక్ష నాయకుడిగా పని చేసిన పి.జనార్ధన్‌రెడి(పీజేఆర్) కూతురు.  విజయారెడ్డి పేరిట  రూ. 11.17 కోట్ల  విలువ చేసే స్థిర చరాస్తులు, బంగారు అభరణాలు ఉన్నాయి. భర్త పేరిట రూ. 5.28 కోట్ల విలువ చేసే స్థిర చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
 
 మాజీ మేయర్ మాజిద్ లక్షాధికారే..!
 నాంపల్లి నియోజకవర్గంలోని మెహిదీపట్నం డివిజన్ నుంచి మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. నగర ప్రజలకు ఆయన సుపరిచితుడు. ఆయన ఆఫిడవిట్ పరిశీలిస్తే ఆయన లక్షాధికారేనని స్పష్టమవుతోంది. ఆయన పేరిట స్థిర-చర ఆస్తులు రూ.లక్షా 95 వేల 357 లు ఉండగా..భార్య పేరున రూ. 6 లక్షల 31 వేల 522లు మాత్రమే ఉన్నాయి. భార్యపేరున రూ. 5.25 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కల్గి ఉన్నారు. వ్యవసాయ, వాణిజ్య భూములు లేవు. రూ. లక్ష ఎల్‌ఐసీ పాలసీ ఉంది. చేతిలో సొంత ఖర్చుల కోసం రూ. 40 వేలు, భార్యపేరున రూ.15 వేలు మాత్రమే ఉన్నాయి.
 
 మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఆస్తులు రూ.69.75 లక్షలు
 మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి తనకు, తన భర్తకు కలిపి రూ.69 లక్షల 75 వేల స్థిర, చరాస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నగదు రూ.50 వేలు, ఆభరణాలు 250 గ్రాములు, ఒక కారు విలువ రూ.2.75 లక్షలుగా చూపించారు. తార్నాకలోని గోకుల్‌నగర్‌లో అపార్టుమెంట్‌లో ఫ్లాట్ (909 చ.అ.) విలువ రూ.18 లక్షలు, కొంగరలో భర్త పేరుతో రూ.30 లక్షల విలువైన 6.10 ఎకరాల వ్యవసాయ భూమి, యాదగిరిగుట్టలో రూ.1.50 లక్షల విలువైన  35 గుంటల వ్యవసాయేతర భూమితో పాటు సుందరం ఫైనాన్స్‌లో భర్త పేరుతో రూ.50 లక్షల అప్పు ఉన్నట్లు చూపించారు.
 
 హోంమంత్రి నాయిని అల్లుడి ఆస్తుల వివరాలివీ...
  హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి రామ్‌నగర్ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.  ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం స్థిర,చరాస్తులు కలిపి తన పేరిట రూ. 90 లక్షలు, భార్య సమత పేరిట రూ. లక్షా 71 వేల 35 వేలు, తన  మీద ఆధార పడ్డ తల్లి పేరిట రూ. 5 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరిట ఈదులపల్లి గ్రామంలో 9 ఎకరాల వ్యవసాయ భూమిని చూపారు.
 
 తలసాని మేనల్లుడు నవీన్ రూ.11.12 కోట్లు
  రహమత్‌నగర్(102) డివిజన్ నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్‌యాదవ్ పేరిట రూ.11.12 కోట్ల స్తిరచరాస్తులు ఉన్నాయి. ఈయనకు రూ.1.75 లక్షల విలువ చేసే బంగారు అభరణాలు ఉండగా, భార్య పేరిట రూ. 30 లక్షల విలువ చేసే 1.2 కిలోల బంగారు అభరణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు నవీన్‌యాదవ్ స్వయాన మేనల్లుడు.
 
 కొప్పుల విఠల్‌రెడ్డి రూ.6.23 కోట్లు
 మన్సూరాబాద్ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కొప్పుల విఠల్‌రెడ్డి తనకు రూ.6.23 కోట్లు, ఆయన సతీమణి పేరిట రూ.6.37 కోట్ల ఆస్తులున్నట్లు ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. ఇందులో స్థిర, చర ఆస్తులున్నాయి.
 
 నాగేందర్ యాదవ్ రూ.17.07 కోట్లు
 శేరిలింగంపల్లి-106 డివిజన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున బరిలో నిలిచిన ఆర్.నాగేందర్‌యాదవ్‌కు రూ. 17.07 కోట్లువిలువ చేసే ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. స్థిరాస్థుల విలువ రూ.16,32,65,000(వ్యసాయ భూమి, నివాస గహం, పాట్ల) తో పాటు  బ్యాంకు డిపాజిట్లు, బంగారు ఆభరణాలు, వాహనాలు వంటి చరాస్థుల విలువ రూ.75 లక్షలు ఉన్నట్లు ప్రకటించారు. రూ.3.80 కోట్లు అప్పున్నట్లు పేర్కొన్నారు.
 
 జగదీశ్వర్ రూ.10 కోట్లు
 మాదాపూర్-107 డివిజన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున బరిలో ఉన్న జగదీశ్వర్‌కు రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు. వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్స్‌లో ప్లాట్లు, వ్యవసాయ భూములు వంటి స్థిర ఆస్తుల విలువ రూ.10 కోట్లు ఉండగా, బంగారు ఆభరణాలు, డిపాజిట్స్, వాహనాలు వంటి చరాస్థుల విలువ
 రూ. 52,50,000 ఉన్నట్లు చూపారు.
 
 తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి రూ.4.87 కోట్లు
 మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కోడలు టి.అనితారెడ్డి ఆర్.కె.పురం డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థినిగా పోటీచేస్తున్నారు. ఆమెతోపాటు భర్తపేరిట రూ.4.87 కోట్ల స్థిర, చర ఆస్తులున్నట్లు లెక్కచూపారు. తమ వద్ద రూ.18 లక్షలు విలువచేసే 600 గ్రాముల బంగారం ఉన్నట్లు ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. ఇక నగదు రూ.12 లక్షలు మాత్రమే చేతిలో ఉన్నట్లు చూపారు.
 
 ఆలె లలిత రూ. 4 కోట్లు
 గౌలిపురా బీజేపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి దివంగత ఆలె నరేంద్ర సతీమణి ఆలె లలిత తనకు రూ.4 కోట్ల విలువ గల స్థిర, చరాస్తులు, రూ. 2.44 లక్షల విలువ గల వ్యవసాయ భూములు, రూ. 35 లక్షల అప్పు ఉన్నట్లు వెల్లడించారు.
 
 మరికొందరు కోటీశ్వరులు...

► కొండాపూర్-104 డివిజన్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న షేక్ హమీద్ పటేల్ ఆస్తుల విలువ రూ.4 కోట్ల 65 లక్షల 94 వేల 750 ఉన్నట్లు ప్రకటించారు.
► మైలార్‌దేవ్‌పల్లి నుంచి స్థానిక సిట్టింగ్ కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్ గౌడ్  టీడీపీ తరపున తిరిగి పోటీ చేస్తున్నారు. ఆయన పేరు మీద రూ.12.50 కోట్లు ఆస్తులు ఉన్నాయి.
► ఎల్భీనగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్ సతీమణి లక్ష్మీప్రసన్న బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ నుంచి పోటీచేస్తున్నారు. స్థిర,చర ఆస్తుల విషయానికి వస్తే..ఆమె పేరిట రూ.1.38 కోట్లు, ఆమె భర్త పేరిట రూ.3.79 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు.
► జీడిమెట్ల డివిజన్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ డీసీసీ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్ నేత కె.ప్రతాప్ సతీమణి కూన పద్మ 2014-15 ఆదాయం రూ.8 లక్షలు కాగా, స్థిరాస్తులు రూ.1.40 కోట్లు, చరాస్తుల విలువ రూ. 47.87 లక్షలున్నట్లు చూపారు.
► రంగారెడ్డినగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్న మున్సిపల్ మాజీ ఛైర్మన్ బి.లింగంగౌడ్ కుమారుడు విజయశేఖర్‌గౌడ్ స్థిరాస్తులు రూ.4.53 కోట్లుగా,  చరాస్తులు రూ.1.13 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
► మల్కాజిగిరి ఎమ్మెల్యే చింత కనకారెడ్డి కోడలు అల్వాల్ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఆమె తన స్థిర, చర ఆస్తుల విలువ రూ.58,81,245.
► గన్‌ఫౌండ్రీ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూతురు నాగారం శిల్ప తన వద్ద రూ. 50 వేల నగదు, (కేజీ బంగారం, 25 కేజీ వెండి) రూ. 33.50 లక్షల విలువ గల బంగారు, వెండి ఆభరణాలు ఉన్నట్లు  అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
► గుడిమల్కాపూర్  టీఆర్‌ఎస్ అభ్యర్థి బంగారి ప్రకాశ్  పేరున రూ.4.30 కోట్లు స్థిర,చర ఆస్తులు ఉన్నాయి.

 ఆస్తి కంటే అప్పు ఎక్కువ
 ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ముద్దం నర్సింహాగౌడ్ రూ. 92.90 లక్షల స్థిర, చర ఆస్తి కలిగి ఉన్నారు. వివిధ బ్యాంకుల్లో రూ. 94.55 లక్షల రుణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement