
మారాలి మన నగరి!
‘మనది గ్రేటర్ సిటీ.. గ్రేట్ సిటీ. నిజమే.. కానీ మన లైఫ్ మాత్రం అంత ఈజీగా లేదీ నగరంలో. అందుకే ఈ నగరం మారాలి. మార్పు తేవాలి’ అంటున్నారు నగర యువత. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నగర జీవనం, వసతులు, ఇక్కడి పరిస్థితులపై బేగంపేటలో ‘సాక్షి’
ఓపెన్ డిబేట్ నిర్వహించింది. ఈవ్ టీజింగ్, ట్రాఫిక్, రోడ్లు, పర్యావరణ సమస్యలతో నగరవాసులు సతమతమవుతున్నారని, వీటి పరిష్కారానికి కృషి చేసేవారికే పట్టం కడతామన్నారు. - సోమాజిగూడ
ట్రాఫిక్.. టెర్రిఫిక్
నగరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ట్రాఫిక్ అని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ జామ్‌లు, తద్వారా వచ్చే కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కారులో రావడం స్టేటస్ సింబల్‌గా భావించడం మానుకోవాలి, బస్, ఎంఎంటీఎస్ సౌకర్యం మరింత పెంచాలి. కార్ పూలింగ్‌ను ప్రోత్సహించాలి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ విస్తరించాలి. మెట్రోరైల్ వేగంగా పూర్తిచేస్తే కొంతట్రాఫిక్ తగ్గుతుంది. ‘ట్రాఫిక్ ఫ్రీ హైదరాబాద్’ నా స్వప్నం. ఈ దిశగా ఆలోచించే వారికి ఓటెయ్యాలి.
- గిరీష్మా పట్నాయక్, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ
ఈజీగా ఇండస్ట్రీ పాలసీ..
కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేందుకు నిబంధనలు సరళతరం చేయాలి. ఐటీ రంగం సహా ఫ్యాషన్ పరిశ్రమను ప్రోత్సహించాలి. దేశానికే కాదు ప్రపంచంలోనే హైదరాబాద్‌ను ఉద్యోగాల కల్పనలో మేటిగా నిలపాలి. పదవ తరగతి, ఇంటర్ పాసైన వారిలో కూడా నైపుణ్యం పెంచే శిక్షణ ఇవ్వాలి. ప్రతిఒక్కరికి ఉద్యోగం, ఉపాధి లభించాలనేదే నా డ్రీమ్. పార్టీల ఎజెండాల్లో పై అంశాలకు స్థానం కల్పించాలి.
- స్వప్న, మేనేజర్, హామ్స్‌టెక్ ఇనిస్టిట్యూట్
డీజిల్ వెహికిల్స్‌ను నిషేధించాలి
అభివృద్ది పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం నగరం ఎదుర్కుంటున్న పెద్ద సమస్య. కాలుష్యం వెదజల్లుతున్న ఆటోలను, ఇతర వాహనాలను నిషేధించాలి. ఢిల్లీ నగరం మాదిరిగా మన సిటీలోనూ డీజిల్ కార్లపై నిషేధం విధించాలి. ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్, పాఠశాల, కార్యాలయం సహా ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ మొక్కలు పెంచాలి. ప్రతి ఒక్కరు ఒక మొక్క పెంచేలా చట్టాలను కఠినతరం చేయాలి. నాయకులు ఆదిశగా ఆలోచించరు. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించే వారికే పట్టం కట్టాలి. - దీపిక అరుమళ్ల, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
బాబోయ్ రోడ్లు...
నగరంలో రోడ్లు గుంతలతో దారుణంగా ఉన్నాయి. వీటి వల్ల వాహనాలపై వెళ్తున్నవారు కిందపడి తీవ్ర గాయాలపాలు కావడం చూశాను. హైవేలు నిర్మించినట్లే సిటీరోడ్ల రూపురేఖలు మార్చాలి. శుభ్రమైన, విశాలమైన రహాదారులతో నగరం వెలిగిపోవాలనేది నా డ్రీమ్ హైదరాబాద్. ఫ్యామిలీస్ ఉంటున్న ఏరియాల్లో వైన్స్, బార్లను తొలగించాలి. గ్రేటర్ బరిలో నిలిచే నాయకులు ఈ దిశగా ఆలోచించాలి. - నిహారికరెడ్డి, ఫ్యాషన్ డిజైనర్