గ్రేటర్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జాప్యం
సాక్షి, హైదరాబాద్: ఖైదీలకు మళ్లీ ఎదురుచూపులు తప్పడంలేదు. క్షమాభిక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం(జనవరి 26) రోజున విడుదల చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఖైదీల క్షమాభిక్షపై ఏర్పాటైన జైలు సూపరింటెండెంట్ల కమిటీ ఒక జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ఆ ప్రక్రియ జరగలేదు. ప్రస్తుత ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెలువరించే పరిస్థితి లేదు.
నిర్ణయాన్ని ప్రకటించాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి అవసరం. ఇప్పటికిప్పుడు ఈసీ నుంచి అనుమతి తీసుకున్నా ఖైదీల క్షమాభిక్ష జనవరి 26 నాటికి పూర్తయ్యే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉంది. క్షమాభిక్షపై నిషేధాన్ని తొలగిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. కొన్ని మార్గదర్శకాలను సూచించింది. తీర్పు ప్రతులు ప్రభుత్వానికి, జైళ్లశాఖకు అందాయి. న్యాయస్థానం తీర్పును అనుసరించి నియమ నిబంధనలు రూపొందించాలని రాష్ట్ర జైళ్ల శాఖను ప్రభుత్వం ఆదేశించింది.
అందుకు అనుగుణంగా అన్ని జైళ్ల సూపరింటెండెంట్లను సభ్యులుగా నియమిస్తూ జైళ్లశాఖ ఒక కమిటీని వేసింది. క్షమాభిక్షకు అర్హత కలిగిన ఖైదీలను కమిటీ ఎంపిక చేసింది. ఈ మేరకు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి గత నెలలో అందజేసింది. తెలంగాణలోని అన్ని జైళ్లలో శిక్షపడిన ఖైదీలు 18 వందల మంది వరకు ఉండగా వీరిలో దాదాపు 300 మంది ఖైదీలు క్షమాభిక్షకు అర్హత కలిగి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
ఖైదీల క్షమాభిక్షపై నీలినీడలు!
Published Wed, Jan 13 2016 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM
Advertisement