
రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమం
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి పనిచేసిందని ఉత్తమ్ అన్నారు. ప్రస్తుత పాలకులు రాజ్యాంగాన్ని గౌరవించకుండా, ప్రజాస్వామ్య విలువలు పాటించకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. దళిత విద్యార్థి ఆత్మహత్యకు చేసుకుంటే పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధ పాలనతో ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీలను గ్రేటర్ ఎన్నికల్లో ఓడించాలని కోరారు. కార్యక్రమంలో కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్, ముఖ్యనేతలు ఉద్దెమర్రి నర్సింహా రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ కార్యాలయంలో....
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జి కృష్ణదాస్, బీజేపీ శాసనసభాపక్షం నాయకుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, నేతలు చింతల రామచంద్రారెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.