ముస్లింలను మరోసారి వంచిస్తున్న కేసీఆర్
► బీజేపీకి మద్దతుపై పునరాలోచించుకోవాలన్న ఉత్తమ్
► రామ్‌నాథ్ రాష్ట్రపతి పదవికి అనర్హుడని వ్యాఖ్య
► పేద ముస్లింలకు రంజాన్ సామగ్రి పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్ల విషయంలో ముస్లింలను మోసగించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా మరోసారి మోసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని పేద ముస్లింలకు ఆదివారం గాంధీభవన్‌లో పండుగ సామాగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
మతసామరస్యాన్ని దెబ్బతీసే మత తత్వ పార్టీ అయిన బీజేపీకి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా లౌకికవాదాన్ని కాపాడాల్సిన అత్యున్నత స్థానంలో ఉండే రాష్ట్రపతి పదవికి రామ్‌నాథ్ కోవింద్ అనే మతతత్వ వ్యక్తిని బీజేపీ నిలబెట్టిందని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా కేసీఆర్ కూడా మతవాదానికి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతంగా ఉండేవారు నిర్వహించాల్సిన రాష్ట్రపతి పదవికి రామ్‌నాథ్ అర్హుడు కాదన్నారు.
బీజేపీకి మద్దతు ఇచ్చే అంశంలో సీఎం కేసీఆర్ పునరాలోచించుకోవాలని సూచించారు. రాష్ట్రపతి పదవికి మీరాకుమార్‌కు అన్ని రకాల అర్హతలున్నాయన్నారు. లోక్‌సభ స్పీకరుగా మీరాకుమార్ చేసిన కృషి వల్లే తెలంగాణ బిల్లు నెగ్గిందని, కేసీఆర్ సీఎం పదవిలో కూర్చున్నాడన్నారు. 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన సీఎం కేసీఆర్‌ను ముస్లింలు క్షమించబోరని షబ్బీర్ అలీ హెచ్చరించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంఐఎం వైఖరిని ప్రకటించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
యూత్ కాంగ్రెస్ 10కె రన్
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆశయాలను, స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకుపోవాలని పార్టీ కార్యకర్తలకు ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద 10కే, 5కే, 2కే రన్‌ను ఆదివారం నిర్వహించారు. దేశాన్ని ఐక్యంగా నిలబెట్టడానికి ఇందిరాగాంధీ చేసిన కృషి మరువలేనిదని ఉత్తమ్ కొనియాడారు. భారత్ పటిష్టమైన దేశంగా అవతరించడానికి, ప్రపంచ దేశాలకు వస్తువులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎగుమతి చేయగలుగుతుందంటే ఖచ్చితంగా ఇందిరమ్మ చేసిన ఘనతేనని పేర్కొన్నారు.
ఉక్కుమనిషి ఇందిర: రాజ్‌బబ్బర్
దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబెట్టడానికి, ఐక్యంగా నిలబెట్టడానికి ఉక్కుమనిషిగా ఇందిరాగాంధీ వ్యవహరించారని ఉత్తరప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ అన్నారు. ఇందిరమ్మ ఆశయాల సాధన ఈ దేశానికి ఎంతో ఉపయోగమన్నారు.