బీజేపీతో ఎంఐఎం కుమ్మక్కు
అమిత్‌షాతో అక్బరుద్దీన్ రహస్య భేటీ..రూ.400 కోట్ల ముడుపులు
⇒ కాంగ్రెస్ జన ఆవేదన సమ్మేళనం ప్రారంభ సభలో దిగ్విజయ్‌సింగ్
⇒ కేసీఆర్ పాలనకు కౌంట్‌డౌన్ షురూ అయింది: ఉత్తమ్ కుమార్‌రెడ్డి
⇒ ప్రశ్నించిన ప్రజాసంఘాలపై కేసీఆర్ దబాయింపులా?: జానారెడ్డి
సాక్షి, నిజామాబాద్: బీజేపీతో ఎంఐఎం పార్టీ కుమ్మక్కైందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ముస్లింలను రెచ్చగొట్టి వారి ఓట్లలో చీలిక తెచ్చేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ముస్లింలు ఎంఐఎం ఉచ్చులో పడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన జన ఆవేదన సమ్మేళన సభ ఆదివారం నిజామాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ బిహార్‌లో అర్ధరాత్రి మూడు గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాను కలసి రూ.400 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.
వైఎస్‌ఆర్ హయాంలో అభివృద్ధి పనులు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని దిగ్విజయ్‌సింగ్ పేర్కొ న్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అయినప్పటికీ లాభపడింది మాత్రం టీఆర్‌ఎస్ అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీ ఆర్ తీరుపైన విమర్శలు చేసిన దిగ్విజయ్‌సింగ్ కేసీఆర్‌కు తన కుటుంబ సభ్యుల ప్రయోజనాలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల సంక్షేమంపై చూపడం లేదని అన్నారు.
పెద్దనోట్ల రద్దుపై మాట మార్చిన కేసీఆర్..
పెద్ద నోట్ల చలామణిని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా వ్యతి రేకించిన సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీని కలిశాక మాటమార్చారని దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. ముందు వ్యతిరేకించి, తర్వాత మాట మార్చడం వెనుక ఏం జరిగిందని ఆయన ప్రశ్నించారు. పెద్ద నోట్ల చలామణి రద్దు నిర్ణయంతో సామాన్యులు బ్యాంకు క్యూలైన్లలో ఇబ్బందులు పడితే, బ్యాంకు మేనేజర్లు బడాబాబుల ఇండ్లకు వెళ్లి కొత్త నోట్ల కట్టలు ఇచ్చి వచ్చారని దుయ్యబట్టారు. ఈ నిర్ణయంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు తీవ్ర నష్టం కలిగితే.. పేటీఎం, వీసా, మాస్టర్ కార్డుల యాజమాన్యాలకు ఎంతో ప్రయోజనం కలిగిందన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీలను విస్మరించారని విమర్శించారు.
అంతర్జాతీయ కార్డు మాఫియాకు ప్రయోజనం: ఆర్సీ కుంతియా
పెద్ద నోట్ల చలామణి రద్దు నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులను గురిచేయగా, పేటీఎం వంటి అంతర్జాతీయ కార్డు మాఫియాకు మాత్రం ఎంతో ప్రయోజనం చేకూర్చిందని ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా ఆరోపించారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 150 మంది నిరుపేదలు చనిపోయారని, దేశ జాతీయ ఉత్పత్తి నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయిందని విమర్శించారు. టూరిజం, టెక్స్‌టైల్ వంటి రంగాలపై కొలుకోలేని దెబ్బపడిందన్నారు.
సీఎం నేనంటే.. నేనంటున్నరు: వీహెచ్
కాంగ్రెస్ పార్టీలో తమ నేతల మధ్య ఉన్న విభేదాలను కూర్చుండి పరిష్కరించుకుందా మని మాజీ ఎంపీ వి.హనుమంతరావు పేర్కొ న్నారు. టీపీసీసీ సమన్వయ కమిటీని వెంటనే సమావేశ పరచాలని వీహెచ్ ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కోరారు. గత ఆరు నెలలుగా ఈ కమిటీ సమావేశం కాలేదని, చివరి సారిగా ఆదిలాబాద్‌లో ఈ సమావేశం జరిగిందన్నారు. ‘‘నేను సీఎం అంటే.. నేను సీఎం అని అంటున్నరు.. ముఖ్యమంత్రిని ప్రజలు చేస్తారు..’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కులాలను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, బీసీలు గొర్లు కాయాలి.. చేపలు పట్టాలి.. మీరు మాత్రం రాజ్యం ఏలుతారా? అని ప్రశ్నించారు. బీసీలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. నిజామాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్ష తన జరిగిన ఈ బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర నేతలు పొన్నాల లక్ష్మయ్య, పి.సుదర్శన్ రెడ్డి, కేఆర్.సురేశ్‌రెడ్డి, వి.హనుమంతరావు, మధు యాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఈరవత్రి అనిల్, శనిగరం సంతోశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భ్రష్ట తెలంగాణగా మార్చుతున్నారు: జానారెడ్డి
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అహంకార పూరిత ధోరణితో పాలన సాగిస్తోందని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఫల్యాలను ప్రశ్నించిన ప్రజాసంఘాలపై దబా యింపులకు పాల్పడుతున్నారన్నారు. బంగారు తెలంగాణ పేరు తో భ్రష్టుపట్టిన తెలంగాణగా మార్చేదిశగా పాలన ఉందన్నారు.
రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి: ఉత్తమ్
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పాలనకు కౌంట్‌డౌన్ షురూ అయిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్ సర్కారుకు రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరిస్తున్నారని అన్నారు.