బీజేపీ ఓడాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలి | Uttamkumar Reddy call to the Muslims | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వాక్‌ ఫర్‌ 12% ముస్లిం రిజర్వేషన్స్‌ 

Published Tue, Jul 3 2018 12:55 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Uttamkumar Reddy call to the Muslims - Sakshi

సోమవారం గాంధీభవన్‌ నుంచి ప్రారంభమైన ‘వాక్‌ ఫర్‌ 12 % ముస్లిం రిజర్వేషన్స్‌’ ర్యాలీలో ఏఐసీసీ మైనార్టీ సెల్‌ చైర్మన్‌ జావీద్, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్, వీహెచ్, సర్వే తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, ఏఐసీసీ మైనార్టీ విభాగం చైర్మన్‌ జావీద్‌ నేతృత్వంలో సోమవారం గాంధీభవన్‌ నుంచి అబిడ్స్‌ జనరల్‌ పోస్టాఫీస్‌ వరకు కొనసాగింది. ‘వాక్‌ ఫర్‌ 12% ముస్లిం రిజర్వేషన్స్‌’పేరుతో నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది ముస్లింలు స్వచ్చంధంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లక్షల సంఖ్యలో పోస్టుకార్డులు పంపారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ...ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు పొందేందుకే రిజర్వేషన్ల అంశాన్ని కేసీఆర్‌ తెరపైకి తెచ్చారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ముస్లిం రిజర్వేషన్లను ఇస్తామన్న కేసీఆర్‌ నాలుగేళ్లు గడిచినా ఇవ్వకపోవటం దారుణమన్నారు. కేసీఆర్‌ తమను మోసం చేసిన విషయాన్ని ముస్లిం ప్రజానీకం అర్థం చేసుకుందని వ్యా ఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు వారు సిద్ధం కావాలని  పిలుపునిచ్చారు.  ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్, మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, రాష్ట్ర మైనార్టీ సెల్‌ నాయకులు ఫక్రుద్దీన్, సోహైల్‌ తదితరులు పాల్గొన్నారు.   


సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ఓడిపోవాలంటే ముస్లింలంతా కాంగ్రెస్‌కు ఓటేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు, ప్రధాని మోదీకి రహస్య ఒప్పందాలున్నాయని, బీజేపీ చెప్పినట్లే ఎంఐఎం నడుచుకుంటుందని ఆరోపించారు. ఆ రెండు పార్టీ ల్లో దేనికి ఓటేసినా బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు. సోమవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ‘వాక్‌ ఫర్‌ 12% ముస్లిం రిజర్వేషన్స్‌’నిర్వహించిన అనంతరం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తమిళనాడు తరహాలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ముస్లింలను కేసీఆర్‌ నిండా ముంచారని, మోసం చేసి పూట గడుపుకుంటున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ హయాంలో ముస్లింలు అడగకుండానే 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని, కానీ కేసీఆర్‌ హామీ ఇచ్చి, అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. ముస్లింల విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తులను కాపాడతామని, వక్ఫ్‌కు జ్యుడీషియల్‌ హోదా కల్పిస్తామని చెప్పిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా వక్ఫ్‌బోర్డుకు చెందిన గజం భూమి కూడా స్వాధీనం చేసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఉర్దూ భాష విషయంలో కేసీఆర్‌ చెప్పిందేంటీ.. జరుగుతుందేంటని ప్రశ్నించారు. ఉర్దూను రెండో అధికార భాష చేస్తామని చెప్పి ఆ విషయాన్ని మర్చిపోయారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదట్లోనే ఆలేరులో నలుగురు ముస్లిం యువకులను ఎన్‌కౌంటర్‌ చేశారని, ఆ విషయంలో ఇంతవరకు కనీసం విచారణ కూడా జరపలేదని విమర్శించారు. మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా కోర్టు ఎవరినీ గుర్తించలేదని, అంటే అక్కడ బాంబు పేలింది నిజం కాదా అని ప్రశ్నించారు. 

ఖర్చు లెక్కలివిగో.. 
ఈ నాలుగేళ్లలో ముస్లింల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను ఖర్చు పెట్టడంలో కూడా టీఆర్‌ఎస్‌ప్రభుత్వం విఫలమైందని ఉత్తమ్‌ మండిపడ్డారు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో మైనార్టీ సంక్షేమానికి రూ.1,030 కోట్లు కేటాయించి రూ.307 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, 2015–16లో కేటాయించింది రూ.1,130 కోట్లయితే ఖర్చు చేసింది మాత్రం రూ.490 కోట్లని, 2016–17లో రూ.1,204 కేటాయింపులు చేసి రూ.850 కోట్లు వ్యయం చేశారని, 2017–18లో రూ.1,249 కోట్లకు రూ.690 కోట్లే ఖర్చు పెట్టారని చెప్పారు. ఈ ఏడాది కేటాయించిన రూ.2 వేల కోట్లలో సగం కూడా ఖర్చయ్యే పరిస్థితుల్లేవని పేర్కొన్నారు. ముస్లింలు, మైనార్టీల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ లెక్కలే సాక్ష్యమని చెప్పారు. నాలుగేళ్లలో పెట్టిన రూ.6.5 లక్షల కోట్ల బడ్జెట్‌లో ముస్లింల సంక్షేమానికి ఒక్క శాతం నిధులు కేటాయించి అందులోనూ సగం కూడా ఖర్చు పెట్టలేకపోయారని పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్‌లో 1.01 శాతం కేటాయించి రూ.0.46 శాతం ఖర్చు చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు.  

కాంగ్రెస్‌ హయాంలోనే న్యాయం.. 
ముస్లింలకు కాంగ్రెస్‌ హయాంలోనే న్యాయం జరుగుతుందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. ముస్లింల ఓట్లు కాంగ్రెస్‌కు రాకుండా అడ్డుకొని బీజేపీకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే దేశంలోని అనేక చోట్ల ఎంఐఎం అభ్యర్థులను నిలబెడుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేయడం ద్వారానే లౌకికవాదాన్ని కాపాడుకోవాలని కోరారు. పాతబస్తీలో ఈసారి ఎంఐఎంను దీటుగా ఎదుర్కొంటామని, గట్టి అభ్యర్థులను నిలబెట్టి షాక్‌ ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ముస్లింలంతా కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా మాట్లాడుతూ కేసీఆర్, ఎంఐఎంలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్‌ను ఎంఐఎం ఎందుకు నిలదీయట్లేదని, ఎంఐఎం ముస్లింల వైపో, కేసీఆర్‌ వైపో తేల్చుకోవాలని హితవు పలికారు. ఏఐసీసీ మైనార్టీ సెల్‌ చైర్మన్‌ నదీమ్‌జావేద్‌ మాట్లాడుతూ కేసీఆర్, మోదీలిద్దరూ ఒకటేనని పేర్కొన్నారు. 

జానెడు లేవు.. సోనియాను అంటావా: షబ్బీర్‌
‘జానెడు లేవు నువ్వు.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని అమ్మా.. బొమ్మా అని నిందిస్తావా.. తెలంగాణ ఇవ్వగానే మీ మూడు తరాలంతా కలసి వెళ్లి సోనియా కాళ్లు మొక్కిన విషయాన్ని మర్చిపోయావా’అని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ సోనియా ఇవ్వకపోతే ఆమె కాళ్లు ఎందుకు మొక్కారు. ఆమెను విమర్శించే మొనగాడివి కాదు.. నోరు జాగ్రత్తగా పెట్టుకో’అని హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చింది సోనియా కాదన్న వాళ్లు మూర్ఖులన్న ముఖ్యమంత్రి  కేసీఆర్‌  చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి కేటీఆర్‌ మాట్లాడుతున్నాడని షబ్బీర్‌ మండిపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement