సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాము రైతుల కోసం ఆలోచిస్తుంటే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం ఆలోచిస్తోందని విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు.
దీనిపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తమ్మిడిహెట్టికి ఓకే చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆస్తులు సంపాదించాం.. పేదలను బానిసలుగా చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదన్నారు. టీఆర్‌ఎస్ నేతల మాదిరిగా తాము చిల్లర మాటలు మాట్లాడలేమని, మంత్రి హరీశ్‌రావు హిట్లర్ కేబినెట్‌లో గోబెల్స్ లాంటి వాడని విమర్శించారు. ప్రజలను టూరిజం ట్రిప్‌కు తీసుకెళ్లాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు కాదని, తమ్మిడిహెట్టి, సిరిసిల్ల దళితుల వద్దకు అని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా తాము 75 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు.
వారితో పోటీపడుతున్నారు...
కేసీఆర్ కుటుంబం అంబానీ, ఆదానీలతో పోటీ పడుతోందని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. దేశంలోని ఏ సీఎం కూడా ఇంత అవినీతికి పాల్పడటం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గ్లోబల్ టెండర్లను ఎందుకు పిలవలేదని, టెండర్ల వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇంట్లో కూర్చుని వేల కోట్ల రూపాయల పనులను సింగిల్ టెండర్లతో ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు.
ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించాలి..
హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో పేదలకు ఉచిత వైద్యం అందించాలని, ఆస్పత్రిని ప్రభుత్వం నుంచి వేరు చేయడం తగదని ఉత్తమ్ అన్నారు. బుధవారం ఆస్పత్రికి చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గాంధీభవన్‌లో ఆయనను కలిశారు.
ఇటీవల జరిగిన ఆస్పత్రి జనరల్ బాడీ సమావేశంలో ఆస్పత్రికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే ప్రతిపాదన తెచ్చారని, దీనివల్ల పేదలకు వైద్యం అందకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలా జరగకుండా చూడాలని సంఘాల ప్రతినిధులు ఉత్తమ్‌కు వినతిపత్రం అందజేశారు. పేదలకు ఉచిత వైద్యం విషయంలో ప్రభుత్వం ఎలాంటి వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా తాము అడ్డుకుంటామని ఉత్తమ్ చెప్పారు. సమావేశంలో మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పాల్గొన్నారు.
కోర్టులు నిషేధిత సంస్థలా?
ప్రభుత్వ కార్యక్రమాల వల్ల తమకు నష్టం జరుగుతోందని కొందరు ప్రజలు కోర్టులను ఆశ్రయిస్తే ప్రభుత్వం చిలువలు పలువలు చేస్తోందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. తమ భూములు లాక్కుంటున్నారని నిరుపేదలు, దళితులు, ఎస్టీలు కోర్టులకు వెళితే తప్పేంటని ప్రశ్నించారు.
కేసీఆర్ కూడా తన నిరాహార దీక్షను ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు కోర్టును ఆశ్రయించిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. కోర్టులేమైనా నిషేధిత సంస్థలా అని ప్రశ్నించారు. కోర్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని విచారించాలని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment