సాక్షి, హైదరాబాద్ : మక్కా మసీదు పేలుళ్ల కేసులో అందరూ నిర్దోషులే అయితే.. దోషులు ఎవరు అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దేశంలో న్యాయవ్యవస్థ ఉందా? లేదా? ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.
ప్రధాన మంత్రి మోదీని సీఎం కేసీఆర్ కలిసినప్పుడు రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ముస్లిం విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ అందడం లేదని, షాదీ ముబారక్ అప్లికేషన్లు వేల సంఖ్యలో పెండింగ్ ఉన్నాయని విమర్శించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు బీజేపీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ముస్లింలు టీఆర్‌ఎస్, ఎంఐఎంకు ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్లేనన్నారు. బీజేపీని ఓడించాలంటే ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఏఐసీసీ మైనారిటీ విభాగం చీఫ్ నదీమ్ జావేద్ మాట్లాడుతూ.. సోనియా, యూపీఏ వల్ల మాత్రమే తెలంగాణ వచ్చిందన్నారు. కేసీఆర్ కేంద్రంలో మోదీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ బయటకు మాత్రం బీజేపీపై పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు.
షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. సోనియా గాంధీ కాళ్లుపట్టుకున్న కేటీఆర్ ఇప్పుడు ఆమెపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. సిరిసిల్లలో కేటీఆర్, నిజామాబాద్‌లో కవిత ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment