సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేసింది తామేనని, తాము చేసిన అభివృద్ధి కారణంగానే హైదరాబాద్‌కు ఈ గుర్తింపు వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ హయాంలో హైద రాబాద్‌లో అభివృద్ధి జరగలేదన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఆదివారం గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ్ మాట్లాడారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న సీఎం తనయుడు కేటీఆర్‌కు సూటు, బూటు వేసుకుని విదేశాలకు తిరగడమే సరిపోతోందని, కానీ తండ్రి కొడుకుల ప్రచారం మాత్రం తారాస్థాయిలో ఉందని ఎద్దేవా చేశారు.
కేంద్రానికి చెంచాగిరీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కేసీఆర్ చెంచాగిరీ చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఆంధ్ర ప్రజలను హైదరాబాద్ నుంచి తరిమికొడతామన్న కేసీఆర్ మాటలను ఇక్కడ నివసిస్తున్న ఆంధ్రులు మర్చిపోలేదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారందరూ కాంగ్రెస్‌కు సమానమేనని అన్నారు. ఆంధ్ర నుంచి వచ్చిన వారికి పార్టీలో, సీట్ల కేటాయింపులో సముచిత స్థానం కేటాయిస్తాయని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పాతబస్తీలోని అన్ని సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని, 2019 ఎన్నికల్లో తామే గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. మోదీని ఓడించి రాహుల్‌కు ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, టీఆర్‌ఎస్, బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న ఎంఐఎంకు ఓటు వేయవద్దని హైదరాబాద్ నగర ప్రజలకు పిలుపునిచ్చారు. కొత్తగా నగర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అంజన్ కుమార్ అన్ని వర్గాలను కలుపుకుని పనిచేయాలని సూచించారు. త్వరలో నగరంలోని అన్ని డివిజన్లలో పోలింగ్ బూత్‌స్థాయిలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
‘సేవ్ హైదరాబాద్’: భట్టి
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హైదరాబాద్ నిర్మాణానికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందన్నారు. ఇప్పుడు మెట్రో రైలు గురించి గొప్పగా మాట్లాడుతున్న కేసీఆర్.. మెట్రోను కాంగ్రెస్ మొదలుపెట్టినప్పుడు వ్యతిరేకించారని గుర్తు చేశారు. నియంతృత్వ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేవ్ హైదరాబాద్ నినాదంతో కాంగ్రెస్ శ్రేణులు ముందుకెళ్లాలని సూచించారు. అంజన్ కుమార్ మాట్లాడుతూ.. నగర కాంగ్రె స్‌ను బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మండలిలో ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, బండ కార్తీకరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అంజన్ ప్రమాణ స్వీకారానికి గుర్రాలు, ఒంటెలు, కళాకారులతో నాంపల్లి రెడ్‌రోజ్ ఫంక్షన్‌హాల్ నుంచి గాంధీభవన్ వరకు కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది.
టీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు: జానారెడ్డి
నేడు హైదరాబాద్ ప్రజలు అనుభవిస్తున్న విద్య, ఉపాధి సౌకర్యాల కల్పన కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. నగరంలో కోటిమందికి తాగునీరు కూడా కాంగ్రెస్ చలవేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నియంతృత్వ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీతో కేసీఆర్ చేస్తున్న స్నేహం అక్రమ సంబంధమని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విమర్శించారు. మోదీ అంటే కేసీఆర్‌కు ప్రేమ, భయం ఉన్నాయని, తెలంగాణ ఇచ్చిన సోనియాపై మాత్రం కృతజ్ఞతా భావం లేదని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ శ్రేణులు కలసికట్టుగా పనిచేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment