
మాటలే..చేతల్లేవ్
రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు...
- గ్రేటర్ ఎన్నికల కోసమే స్వచ్ఛ హైదరాబాద్....
- టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరు అధ్వానం
- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజం
ఆర్‌కేపురం: రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి స్వచ్ఛహైదరాబాద్ పేరుతో తమ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారని విమర్శించారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్‌కేపురం, సరూర్‌నగర్ డివిజన్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం సోమవారం ఆర్‌కేపురంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు సెటిలర్లను, సినిమా వాళ్లను ఇష్టమొచ్చినట్లు తిట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారికి వత్తాసు పలుకుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని, తెలంగాణ తెచ్చింది తామేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సెటిలర్లకు రక్షణగా ఉంటుందని అన్నారు. ముస్లింల ఓట్ల కోసం 12 శాతం రిజర్వేషన్ చేస్తామన్నారని, ఇంత వరకు దాని ఊసెత్తలేదన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో 900 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ముఖ్యమంత్రి ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి చెందిందన్నారు. ఎయిర్‌పోర్టు, మెట్రోరైలు, పీవీ నర్సింహారావు హైవే, ఔటర్ రింగురోడ్డు, కృష్ణా నీటి మూడవ ఫేజ్ పైపులైన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టేనని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని అన్నారు కాంగ్రెస్ కార్యకర్తలంతా ఐక్యంగా ఉండి వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు టి.నాగయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, బండి నర్సింహాగౌడ్, కార్తీక్‌రెడ్డి, బడంగ్‌పేట మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, జంగారెడ్డి, హనుమంత్‌రెడ్డి, సాంబయాదవ్, లావణ్య, ఎస్.సుధీర్‌రెడ్డి, పున్న గణేష్, మహేందర్‌యాదవ్, సాజీద్, కొండల్‌రెడ్డి, ప్రభాకర్, శ్రీలక్ష్మి, దేవేందర్, శివ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉత్తమ్‌తోపాటు ఇతర నాయకులు ఘనంగా సత్కరించారు.