ఎక్కడికక్కడ అరెస్టులు | House arrest of Congress Party top leaders including Uttamkumar Reddy | Sakshi
Sakshi News home page

ఎక్కడికక్కడ అరెస్టులు

Published Sun, Jun 14 2020 3:29 AM | Last Updated on Sun, Jun 14 2020 8:10 AM

House arrest of Congress Party top leaders including Uttamkumar Reddy - Sakshi

హౌస్‌ అరెస్ట్‌ సందర్భంగా పోలీసులతో ఉత్తమ్‌ వాగ్వివాదం. చిత్రంలో షబ్బీర్‌ అలీ, జగ్గారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్:‌ రాష్ట్రంలో గోదావరి నదిపై ఉన్న పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కోసం కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన ‘గోదావరి జలదీక్ష’ను సైతం పోలీసులు భగ్నం చేశారు. పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపిస్తూ ప్రాజెక్టుల సందర్శనకు ఆ పార్టీ నేతలు శనివారం సిద్ధమవగా జలదీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సహా ముఖ్య నేతలందరినీ హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించి సాయంత్రం విడిచిపెట్టారు. గత నెల రోజుల వ్యవధిలో వివిధ సందర్భాల్లో కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకోవడం ఇది నాలుగోసారి. ఇప్పటికే కృష్ణా, మంజీరా ప్రాజెక్టుల సందర్శన, ‘చలో సెక్రటేరియట్‌’నిరసన కార్యక్రమాలను పోలీసులు భగ్నం చేశారు. 

ఎక్కడికక్కడ నిర్బంధం... 
హైదరాబాద్‌లో ఉన్న ఉత్తమ్‌తోపాటు ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జలదీక్ష కు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా వారిని ఇళ్ల నుంచి పోలీసులు బయటకు రానివ్వలేదు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు సిద్ధమైన భట్టి విక్రమార్కను ఖమ్మం జిల్లా వైరాలోని ఆయన ఇంట్లోనే నిర్బంధించారు. శాంతియుతంగా ప్రాజెక్టుల సందర్శన చేపడితే ప్రభుత్వానికి నష్టమేముందని, వెంటనే తమను అనుమతించాలని పోలీసులను కోరినా పట్టించుకోలేదని భట్టి మండిపడ్డారు. మరోవైపు సిరిసిల్ల పార్టీ కార్యాలయంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ను కట్టడి చేశారు. దీంతో కార్యకర్తలతో కలసి పొన్నం రాస్తారోకో చేయగా ఆయన్ను వ్యాన్‌లో తంగళ్లపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ ఎగువ మానేరుకు గోదావరి జలాలను ఎందుకు మళ్లించలేదని ప్రశ్నించారు. సిరిసిల్లను ఎండబెట్టి సిద్దిపేటకు నీళ్లు తీసుకెళ్లారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జలదీక్షకు పూనుకుంటే నియంతృత్వంగా అడ్డుకోవడం సరికాదన్నారు. ఎగువ మానేరును నింపి రైతాంగానికి సాగును అందించాలని డిమాండ్‌ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలంటూ గౌరవెల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి సాయంత్రం విడిచిపెట్టారు.

ఈ సందర్భంగా సంపత్‌ మాట్లాడుతూ తాము ప్రాజెక్టుల వద్దకు వెళ్తుంటే తండ్రీ కొడుకులకు (కేసీఆర్, కేటీఆర్‌లను ఉద్దేశించి) చెమటలు పట్టి భయపడుతున్నారన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రాజెక్టులను పూర్తి చేస్తే భయమెందుకని ప్రశ్నించారు. వేములవాడలో ఆది శ్రీనివాస్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌ సందర్శన కోసం భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లిలోని ఇల్లెందు చేరుకున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను శుక్రవారం అర్ధరాత్రే పోలీసులు అదుపులోకి తీసుకొని శనివారం భద్రాచలంలో దైవ దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్‌ పంపారు. 

రాష్ట్రంలో దుర్మార్గ పాలన 
రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన కొనసాగుతోందని, అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తే గత ఆరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా ఆ వెలుగులు కనిపించట్లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ నేతలు షబ్బీర్‌ అలీ, జగ్గారెడ్డి, మల్లు రవితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలు, నిరుద్యోగులు టీఆర్‌ఎస్‌ ఆరేళ్ల పాలనపై అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ కేసీఆర్‌ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు.

సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఇవే అబద్ధాలు చెబుతున్నాడని, అసలు కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలపాలని ప్రాజెక్టులను సందర్శించాలనుకున్నామని, కానీ పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జూన్‌ 2న కృష్ణా పరివాహక ప్రాజెక్టుల వద్దకు వెళ్తుంటే అరెస్ట్‌ చేశారని, నల్లగొండలోని ఎస్సెల్బీసీ ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. మంజీరా డ్యాంను పరిశీలించేందుకు వెళ్తుంటే అరెస్ట్‌చేసి కేసులు పెట్టారని, కరెంటు బిల్లులపై మంత్రులను, అధికారులను కలవాలనుకుంటే వెళ్లనివ్వలేదని చెప్పారు. 

ఐపీఎస్‌లు కాదు.. కేపీఎస్‌లు 
‘ప్రాజెక్టులు సందర్శిస్తున్నామని డీజీపీకి లేఖ రాసీనా సమాధానం లేదు. సీఎం కేసీఆర్‌కు కొందరు పోలీసు అధికారులు తొత్తులుగా మారారు. ప్రతిపక్షాన్ని తొక్కేయాలని అనుకుంటున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందనుకోలేదు. రాష్ట్రంలో కొందరు అధికారులు ఐపీఎస్‌లుగా కాకుండా కేపీఎస్‌లుగా పనిచేస్తున్నారు’అని ఉత్తమ్‌ విమర్శించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, ఇతర మంత్రులకు, టీఆర్‌ఎస్‌ నేతలకు లేని కరోనా ఆంక్షలు కాంగ్రెస్‌ నేతలకే ఎందుకని ప్రశ్నించారు. మీటింగ్‌లు పెట్టి కాంగ్రెస్‌ పార్టీ నేతలపై విమర్శలు చేసేందుకు మాత్రం మంత్రి కేటీఆర్‌కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. తమ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా రోజూ వందల మందితో మీటింగ్‌లు పెడుతున్నాడని చెప్పారు.

కరోనా వ్యాప్తి నివారణ కోసమంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను పోలీసులు చూపెడుతున్నారని, ఆ నోటిఫికేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకే వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. దీనిపై డీజీపీ మహేందర్‌రెడ్డితో మాట్లాడాలంటే నోరు మెదపడం లేదని, ఫోన్‌ కూడా ఎత్తడం లేదని ఉత్తమ్‌ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల వాయిస్‌ను వినిపిస్తామని, ఇది తమ హక్కని, ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎదుర్కొని తీరుతామని చెప్పారు. కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని, కాంగ్రెస్‌ నేతలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్‌ను కలుస్తామని, కేంద్ర పెద్దలను కలుస్తామని, న్యాయ పోరాటం కూడా చేయబోతున్నామని ఉత్తమ్‌ వెల్లడించారు. 

సొంత జిల్లాకే నీళ్లివ్వలేదు 
మండలిలో ప్రతిపక్ష మాజీ నేత షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం సిద్దిపేట–గజ్వేల్‌–సిరిసిల్లకు మాత్రమేనా? అని ప్రశ్నించారు. కామారెడ్డి–నిజామాబాద్‌ జిల్లాలకు నీళ్ల కోసం కేవలం రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని చెప్పారు. అలా ఖర్చు చేయడం ద్వారా 3 లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయి కానీ ప్రాజెక్టు కట్టడం లేదన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు కేసీఆర్‌ ప్రైవేట్‌ ఆర్మీలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి సీఎం అయినా సంగారెడ్డి జిల్లాకు నీళ్లు లేవని సొంత జిల్లాకే నీళ్లివ్వని కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు నీళ్లెలా ఇస్తారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement