చింతపల్లి పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి..
చింతపల్లి/సాక్షి, వికారాబాద్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ మంగళవారం తలపెట్టిన జలదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేపట్టేందుకు అనుమతి లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నల్లగొండ జిల్లాలో టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను, కొడంగల్‌లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, పరిగిలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.
ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తుండగా..: నల్లగొండ జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పరిశీ లించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలను పోలీసులు నిలువరించారు. మొదటగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చింతపల్లి మండల పరిధిలో ని మాల్ పట్టణానికి చేరుకోగానే అప్పటికే పంప్‌హౌస్ వద్ద ఉన్న పోలీసులు ఆయన కారును బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఆయన హైదరాబాద్–నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై బైఠాయించడం తో వాహనాల రాకపోకలకు గంటపాటు అం తరాయం ఏర్పడింది. కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో రహదారిపై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు ఆయన్ను అరె స్టు చేసి మాల్ పంప్‌హౌస్‌కు తరలించారు. అనంతరం ఉత్తమ్, జానారెడ్డి వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు.. వారినీ మాల్ వద్దే అడ్డుకొని మాల్ పంప్‌హౌస్ వద్దకు తరలించారు. సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉంచడంతో పార్టీ శ్రేణులు పంప్‌హౌస్‌కు తరలివచ్చారు. దీంతో ముగ్గురు నేతల ను చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి గంటపాటు స్టేషన్‌లోనే ఉంచారు. ఇందుకు అభ్యంతరం తెలుపుతూ కార్యకర్తలు స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించగా 5 గంటలకు నేతలను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది..
పోలీసుస్టేషన్ నుంచి విడుదలైన అనంతరం పంప్‌హౌస్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచేందుకు ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీ ఓ నంబర్ 203ని రద్దు చేసే వరకు పోరాడతామన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలపై మా ట్లాడకుండా ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని విమర్శించారు. సొంత జిల్లా కు తమను వెళ్లనీయకుండా సీఎం కేసీఆర్ అ వమానపర్చారని మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, జిల్లాపై పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల జిల్లాలోని ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదముందన్నారు. కుర్చీ వేసుకొని ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఎన్నికల సభలో చెప్పిన కేసీఆర్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ మేధావిగా చెప్పుకుంటున్నా ఆయన ఒక నియంత అని దుయ్యబట్టారు.
కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ ప్రారంభానికి వేల మంది హాజరైనప్పుడు అడ్డుకోని ప్రభుత్వం జలదీక్షను భగ్నం చేసేలా వ్యవహరించడం ఏమిటని నిలదీశారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, మధ్యలో నిలిచిపోయి న వాటికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో జలదీక్ష చేపట్టాలనుకున్న రేవంత్‌రెడ్డిని పోలీసులు మంగళవారం కొడంగల్‌లో హౌస్‌అరెస్ట్ చేశారు. ఆయ న ఇంటి వద్దే దీక్షకు పూనుకోగా అదుపులోకి తీసుకొని కుల్కచర్ల పోలీస్టేషన్‌కు తరలించా రు. అరెస్టుకు ముందుకు రేవంత్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నియంతలా వ్య వహరిస్తున్నారన్నారు. పాలమూరు–రంగారె డ్డి ప్రాజెక్టుకు నిధులు విడుదలచేసి వెంటనే పూర్తి చేయాలని, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 10 టీఎంసీలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాగా, పరిగిలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment