తట్టెడు మట్టి.. లొట్టెడు నీళ్లు.!
అమరావతికి ప్రధాని తెచ్చింది ఇదే..
హైదరాబాద్‌కు కాదు..అమరావతికి నిధులు తెచ్చుకోండి
కేంద్రం నిధుల విషయంపై లోకేష్‌కు కేటీఆర్ కౌంటర్
కేపీహెచ్‌బీ కాలనీ: అమరావతి నగర నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధాని నరేంద్రమోదీ తట్టెడు మట్టి, లొట్టెడు నీళ్లు మాత్రమే తెచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నగరాభివృద్ధి గురించి ఆలోచించే బదులు అమరావతి నగర నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని నారా లోకేష్‌కు చురకలంటించారు. గ్రేటర్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. దీనిపై కేటీఆర్.. లోకేష్‌కు పైవిధంగా కౌంటర్ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామంటే నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదన్నారు.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దమ్ము, ధైర్యం ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్‌లో ఆయన బుధవారం ఎన్నికల సమావేశంలో ప్రసంగించారు. నగరవాసులు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని కోరారు. ‘గాడిదలకు గడ్డివేసి.. ఆవును పాలు ఇమ్మంటే ఇస్తదా?’ అని ప్రజలను ప్రశ్నించారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కాదని ప్రతిపక్షాలకు ఓటేస్తే అభివృద్ధి తీరు కూడా అలాగే ఉంటుందన్నారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌లకు ఓటేస్తే ఉపయోగం ఉండదని.. సమస్య పరిష్కారానికి, సమగ్రాభివృద్ధికి అధికార పార్టీకే ఓటేయాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలకు ఓటేసి వాళ్ల చేత మళ్లీ మళ్లీ ఇబ్బందులకు గురయ్యేకంటే.. గులాబి కండువాను మెడలో వేసుకోవాలని అన్నారు. హైదర్‌నగర్ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి జానకి రామరాజును గెలిపిస్తే హైదర్‌నగర్‌ను దత్తత తీసుకుంటానని మాటిచ్చారు. ఈ సందర్భంగా హైదర్‌నగర్, మియాపూర్ డివిజన్లకు చెందిన పలువరు టీడీపీ నాయకులు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, మాధవరం కృష్ణారావు, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
‘రేవంత్.. దమ్ముంటే రాజీనామా చేస్తావా’
టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని కోరుతున్న రేవంత్‌రెడ్డికి... దమ్ముంటే టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని ఆరోపిస్తున్న రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేందుకు అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. టీడీపీ నేతల తీరును ఎండగట్టారు.