లోకేష్ డల్.. కేటీఆర్ ఫుల్! | Nara Lokesh weak and ktr farward in politics | Sakshi
Sakshi News home page

లోకేష్ డల్.. కేటీఆర్ ఫుల్!

Published Thu, Jan 7 2016 8:05 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

లోకేష్ డల్.. కేటీఆర్ ఫుల్! - Sakshi

లోకేష్ డల్.. కేటీఆర్ ఫుల్!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నారా లోకేష్, కేటీ రామారావు (కేటీఆర్) మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు కుమారుడు, మంత్రి కేటీఆర్ రాజకీయంగా దూసుకుపోతున్నారనీ... ఆయనతో పోల్చితే ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాగా వెనకబడిపోయారన్న అంశం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి కుమారుడే కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ కేటీఆర్‌కు వచ్చినంత ప్రచారం తనకు ఎందుకు దక్కడం లేదని లోకేష్ ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. తెలంగాణలో కేటీఆర్ కన్నా ఏపీలో తానే ఎక్కువ అధికారాలు చెలాయిస్తున్నప్పటికీ తనకు అంతగా ప్రాధాన్యం లభించకపోవడంపై లోకేష్ తెగ మథనపడిపోతున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

గత సాధారణ ఎన్నికల తర్వాత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని భావించిన నారా లోకేష్ టీడీపీ కార్యకర్తల సంక్షేమ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ కొద్ది నెలల కిందట పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని తీసుకున్నారు. టీడీపీ అధికారం చేపట్టి దాదాపు రెండేళ్లకు దగ్గర పడుతుండగా, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వ్యవహారాల్లోనూ తన నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేలా చేసుకున్నారు. పార్టీ నేతలనే కాకుండా మంత్రులను సైతం తన వద్దకు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ప్రభుత్వపరమైన అనేక నిర్ణయాల్లో లోకేష్ ప్రమేయం లేకుండా జరగదన్న ప్రచారం కూడా ఉంది. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం లోకేష్ సలహాలు సూచనల మేరకే నిర్ణయాలు తీసుకుంటారన్న విషయాన్ని ఉన్నతాధికారులు సైతం తమ ప్రైవేటు సంభాషణల్లో చెబుతుంటారు.

అయితే ఇంత చేస్తున్నప్పటికీ తనకు తగిన ఫాలోయర్స్ లేకపోవడమేంటన్న ప్రశ్నకు సమాధానం దొరక్క లోకేష్ సన్నిహితుల మధ్య చర్చ మొదలైంది. లోకేష్‌ను రాజకీయాల్లో ఒక నాయకుడిగా చిత్రీకరించడానికి ఏం చేయాలన్న తర్జనభర్జన మొదలైంది.  తెలంగాణలో కేటీఆర్‌కు వస్తున్న స్థాయిలో ప్రచారం తనకు రాకపోవడమేంటి.. ఎందుకు ఇలా జరుగుతోంది... అనే అంశాలపై ఇటీవలి కాలంలో లోకేష్ తన సన్నిహితులతో సమాలోచనలు జరిపారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కొంతకాలంగా చురుకైన పాత్ర పోషించడం, దానిపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంపై ఆయన ఆరా తీశారు. కేటీఆర్ పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రసంగించడం, ఐటీ దిగ్గజాల సమావేశంలో మాట్లాడటం వంటి అనేక వేదికల్లో పాల్గొంటున్న వివరాలను లోకేష్ పరిశీలించారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ పాల్గొంటున్న సభలకు కూడా మీడియాలో విశేష కవరేజీ వస్తున్న విషయాన్ని ఆయన సన్నిహితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను గమనించిన తర్వాత కేటీఆర్ రాజకీయంగా దూసుకుపోతుంటే... తాను బాగా వెనుకబడి పోతుండటంపై తనకు అత్యంత సన్నిహితులైన వారి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఏదోరకంగా మనం కూడా దూసుకుపోవాలని, అందుకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలని వారిని కోరారు. ఇకనుంచి మీడియాలో విస్తృతంగా కనిపించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. మీడియా ప్రచారం వచ్చే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కేటీఆర్‌కు రాష్ట్ర స్థాయిలో ప్రచారం జరిగితే మనకు జాతీయ స్థాయిలో మీడియాలో ప్రచారం వచ్చేలా ప్లాన్లు తయారు చేయాలని చెప్పినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. జాతీయ స్థాయిలో ప్రచారం  చేసుకోవడంపై లోకేష్ ఇటీవలే ఢిల్లీలో ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తప్పించిన ఒక అధికారిని ఢిల్లీ కేంద్రంగా జాతీయ మీడియా మేనేజ్‌మెంట్ వ్యవహారాలు పర్యవేక్షించాలని కోరినట్టు తెలిసింది. భారీ మొత్తాల్లో వెచ్చిస్తూ అప్పుడప్పుడు సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నా నారా వారి అబ్బాయి టీడీపీలో చరిష్మా ఉన్న నాయకుడిగా, చంద్రబాబు రాజకీయ వారసుడిగా ఎదుగుతాడన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లో కనిపించడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement