సాక్షి, అమరావతి: సమస్యలు సృష్టిస్తున్నారనుకుంటే యువగళం యాత్రకు అనుమతులు రద్దుచేయండని హైకోర్టు పేర్కొంది. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రజలపై దాడులు చేయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మంగళవారం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద జరిగిన ఘటనపై ముదివేడు పోలీసులు తమపై నమోదు చేసిన కేసుల్లో, అలాగే పుంగనూరు ఘటనలో పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ నేతలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. పశ్చిమ గోదావరి జిల్లా యువగళం యాత్రలో భాగంగా మందలపర్రు గ్రామంలో లోకేశ్ చర్చి వైపు వేలు చూపిస్తూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని, దీంతో ఆ పార్టీ కార్యకర్తలు వెళ్లి చర్చిలో ప్రార్థనలు చేస్తున్న వారిపై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారని చెప్పారు. లోకేశ్ బహిరంగంగానే టీడీపీ శ్రేణులను దాడులకు ఉసిగొల్పుతున్నారని తెలిపారు. కనీసం 12 నుంచి 20 కేసులున్న కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించే బాధ్యత తనదంటూ లోకేశ్ ప్రతి సభలోను బహిరంగంగా చెబుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను సైతం చూడవచ్చన్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులోను చంద్రబాబునాయుడు ఇదే రీతిలో టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి పోలీసులపై దాడులు చేయించి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. అందుకే పుంగనూరు ఘటనలో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ నేతలు పెట్టుకున్న పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకించామని, ముందస్తు బెయిల్ ఇస్తే ఇలాంటి ఘటనలు పునరావృత్తం చేస్తూ ఉంటారని ఆ రోజు మొత్తుకున్నామని చెప్పారు. ఆ రోజున తాము వ్యక్తం చేసిన ఆందోళన ఈ రోజు నిజమైందన్నారు. పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఆ రోజున టీడీపీ నేతల అరాచకాలు ఎలా ఉంటాయో స్పష్టంగా వివరించామని తెలిపారు. కేసులు పెడితే వెంటనే హైకోర్టుకు వస్తున్నారన్నారు. అదే వారి ధైర్యమని చెప్పారు.
ఈ సమయంలో న్యాయస్థానం స్పందిస్తూ.. సమస్యలు సృష్టిస్తున్నారనుకుంటే యువగళం యాత్రకు అనుమతులు రద్దుచేయండని స్పష్టం చేసింది. ‘మీరు (ప్రభుత్వం) ఇచ్చిన అనుమతితోనే కదా యాత్ర చేస్తున్నది. అలాంటప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? అనుమతులు రద్దుచేయవచ్చు కదా?’ అని ఏఏజీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. లోకేశ్ పాదయాత్ర గురించి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతున్నప్పుడు టీడీపీ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పెద్దగా అరుస్తూ.. ప్రస్తుత కేసులతో లోకేశ్ పాదయాత్రకు ఎలాంటి సంబంధం లేదని, యువగళం ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ నాయకులే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. టీడీపీ న్యాయవాదులు గొంతు పెద్దదిగా చేసి మాట్లాడుతుండటంతో న్యాయస్థానం వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? లేక కోర్టు అనుకుంటున్నారా? అంటూ వారిని మందలించింది. ఏఏజీ వాదనలు వినిపిస్తున్నప్పుడు మధ్యలో ఇలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించింది. ఆయన వాదనలకు సమాధానం ఇచ్చేందుకు మీకు అవకాశం వచ్చినప్పుడు అన్నీ చెప్పుకోవాలే తప్ప ఇలా చేపల మార్కెట్‌లో అరిచినట్లు అరవడం ఏమిటంటూ అసహనం వ్యక్తం చేసింది.
ఏ రకమైన ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదు
గతంలో ఇతర నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇచ్చిన ఉత్తర్వులను తాజా వ్యాజ్యాల్లోనూ ఇస్తూ ఆ వ్యాజ్యాలను పరిష్కరించాలని టీడీపీ న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు, ఎం.లక్ష్మీనారాయణ, పుల్లగూర నాగరాజు తదితరులు కోరారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు అలా చేయడం సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కనీసం కఠిన చర్యలేవీ తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని వారు అభ్యర్థించారు. అలాంటి ఉత్తర్వులేవీ ఇవ్వడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో విచారణను ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
వేర్వేరు పిటిషన్లు వేసిన టీడీపీ నేతలు
అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద జరిగిన ఘటనపై ముదివేడు పోలీసులు తమపై నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ టీడీపీ నేతలు భూమిరెడ్డి రాంభూపాల్‌రెడ్డి, గంటా నరహరి, షాజహాన్ బాషా,దొమ్మాలపాటి రమేష్, శ్రీరామ్ చినబాబు, ఎం.రాంప్రసాద్‌రెడ్డి తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే చిత్తూరు జిల్లా పుంగనూరు ఘటనలో పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయా లంటూ టీడీపీ నేతలు వి.చంద్రశేఖర్, ఎం.రాంప్రసాద్‌రెడ్డివేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా విచారణ సబబు కాదు
అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో టీడీపీ నేతలు దేవినేని ఉమా, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, పులివర్తి నాని, చల్లా బాబు తదితరులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము సుప్రీంకోర్టులో సవాలు చేశామని సుధాకర్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కోర్టు జారీచేసిన ఉత్తర్వుల్లోని పలు అంశాలను తాము సుప్రీంకోర్టు ముందు లేవనెత్తామన్నారు. టీడీపీ నేతల తీరుపై ఆందోళనతోనే వారికిచ్చిన ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేసినట్లు చెప్పారు.
తమ పిటిషన్లకు సుప్రీంకోర్టులో డైరీ నంబర్ కూడా జారీ అయిందని, అయితే ఎప్పుడు విచారణకు వస్తాయో నిర్దిష్టంగా చెప్పలేమని తెలిపారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొందరు టీడీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను వాయిదా వేయడం సబబుగా ఉంటుందని కోర్టు భావిస్తే, అలాగే వాయిదా వేయచ్చన్నారు. న్యాయస్థానం స్పందిస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు అదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై తాము విచారించడం సబబుగా ఉండదని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment