అందుకే గెజిటెడ్ అధికారులను అధీకృత అధికారులుగా నియమించాలని ఐజీ కోరారు
ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది
దీనివల్ల నారా లోకేశ్‌కు వచ్చిన నష్టం ఏంటి?
హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
తదుపరి విచారణ 19కి వాయిదా
సాక్షి, అమరావతి: పలు సంస్థలు, కంపెనీలు ప్రభుత్వ ఆదాయానికి భారీ స్థాయిలో గండి కొడుతున్నాయని, ఇలాంటి వాటి విషయంలో తగిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టామని, అందులో భాగంగానే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారిపై చర్యలు ఉంటాయంటే.. లోకేశ్‌కు వచ్చిన నష్టం ఏంటని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు.. వేలూరి మహేశ్వరరెడ్డి, చింతల సుమన్ ప్రశ్నించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేసే గెజిటెడ్ అధికారులను అధీకృత అధికారులుగా నియమించాలని విజిలెన్స్ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ వల్ల తాను ఏ విధంగా ప్రభావితమవుతున్నారో లోకేశ్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
వ్యాపారవేత్తల పేరు చెప్పి లోకేశ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని తెలిపారు. రఘురామిరెడ్డి లేఖ వల్ల ప్రభావితమయ్యే వ్యాపారవేత్తలు ఉంటే వారు కోర్టును ఆశ్రయించవచ్చన్నారు. రాజకీయ పార్టీ ఎలా పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రశ్నించారు. రఘురామిరెడ్డి లేఖ కేవలం ప్రతిపాదన మాత్రమేనన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా తమపై కక్ష సాధించేందుకే కొల్లి రఘురామిరెడ్డి లేఖ రాశారని లోకేశ్ ఆరోపిస్తున్నారని తెలిపారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని గుర్తు చేశారు.
ఈ విషయం తెలుసుకోకుండానే లోకేశ్ వాదనలు వినిపిస్తున్నారన్నారు. ప్రభుత్వ న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ లేఖ వల్ల లోకేశ్ ఏ విధంగా ప్రభావితమవుతున్నారని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం, నిధుల వృథా, ప్రభుత్వ సంపదకు, సహజ వనరులకు నష్టం కలిగించడం వంటి విషయాల్లో ఏ సంస్థల్లోకైనా వెళ్లేందుకు, సోదాలు చేసేందుకు, సమాచారం సేకరించేందుకు, రికార్డులను పరిశీలించేందుకు, జప్తు చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేసేలా గెజిటెడ్ అధికారులందరినీ అధీకృత అధికారులుగా నియమించాలని కోరుతూ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ హోదాలో కొల్లి రఘురామిరెడ్డి గత నెల 5న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment