Gazetted Officers
-
ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే సంస్థలపైన చర్యలొద్దా?
సాక్షి, అమరావతి: పలు సంస్థలు, కంపెనీలు ప్రభుత్వ ఆదాయానికి భారీ స్థాయిలో గండి కొడుతున్నాయని, ఇలాంటి వాటి విషయంలో తగిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టామని, అందులో భాగంగానే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారిపై చర్యలు ఉంటాయంటే.. లోకేశ్‌కు వచ్చిన నష్టం ఏంటని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు.. వేలూరి మహేశ్వరరెడ్డి, చింతల సుమన్ ప్రశ్నించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసే గెజిటెడ్ అధికారులను అధీకృత అధికారులుగా నియమించాలని విజిలెన్స్ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ వల్ల తాను ఏ విధంగా ప్రభావితమవుతున్నారో లోకేశ్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపారవేత్తల పేరు చెప్పి లోకేశ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని తెలిపారు. రఘురామిరెడ్డి లేఖ వల్ల ప్రభావితమయ్యే వ్యాపారవేత్తలు ఉంటే వారు కోర్టును ఆశ్రయించవచ్చన్నారు. రాజకీయ పార్టీ ఎలా పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రశ్నించారు. రఘురామిరెడ్డి లేఖ కేవలం ప్రతిపాదన మాత్రమేనన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా తమపై కక్ష సాధించేందుకే కొల్లి రఘురామిరెడ్డి లేఖ రాశారని లోకేశ్ ఆరోపిస్తున్నారని తెలిపారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని గుర్తు చేశారు. ఈ విషయం తెలుసుకోకుండానే లోకేశ్ వాదనలు వినిపిస్తున్నారన్నారు. ప్రభుత్వ న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ లేఖ వల్ల లోకేశ్ ఏ విధంగా ప్రభావితమవుతున్నారని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం, నిధుల వృథా, ప్రభుత్వ సంపదకు, సహజ వనరులకు నష్టం కలిగించడం వంటి విషయాల్లో ఏ సంస్థల్లోకైనా వెళ్లేందుకు, సోదాలు చేసేందుకు, సమాచారం సేకరించేందుకు, రికార్డులను పరిశీలించేందుకు, జప్తు చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసేలా గెజిటెడ్ అధికారులందరినీ అధీకృత అధికారులుగా నియమించాలని కోరుతూ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ హోదాలో కొల్లి రఘురామిరెడ్డి గత నెల 5న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
ఏపీపీఎస్సీ గెజిటెడ్ ఉద్యోగాలు.. ఆన్లైన్లో అప్లై చేయండి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)... వివిధ విభాగాల్లో గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 25 ► పోస్టుల వివరాలు: ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్(ఏపీ ఫిషరీస్ సర్వీస్)–11, సెరీకల్చర్ ఆఫీసర్(ఏపీ సెరీకల్చర్ సర్వీస్)–01, అగ్రికల్చర్ ఆఫీసర్(ఏపీ అగ్రికల్చర్ సర్వీస్)–06, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(ఏపీ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్)–02, టెక్నికల్ అసిస్టెంట్(ఏపీ పోలీస్ సర్వీస్)–01, అసిస్టెంట్ కమిషనర్(ఏపీ ఎండోమెంట్స్ సర్వీస్)–03, అసిస్టెంట్ డైరెక్టర్(ఏపీ హార్టికల్చర్ సర్వీస్)–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ► వయసు: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు 21–28 ఏళ్లు, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు 28–42 ఏళ్లు, మిగతా పోస్టులకు 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.29,760 నుంచి రూ.93,780 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రారంభ తేది: 08.12.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 28.12.2021 ► వెబ్సైట్: https://psc.ap.gov.in -
జీహెచ్ఎంలకు బదిలీ ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, గ్రేడ్–2 హెచ్ఎంల బదిలీల ప్రక్రియ ముగిసింది. బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆప్షన్లు ఇచ్చుకున్న జీహెచ్ఎంలకు విద్యాశాఖ శుక్రవారం బదిలీ స్థానాలను కేటాయించింది. బదిలీ పొందిన వారు తక్షణమే విధుల నుంచి రిలీవ్ అయి, వారికి కేటాయించిన స్థానాల్లో చేరాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు వెబ్సైట్లో వివరాలను పొందుపర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2,193 మంది జీహెచ్ఎంలు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా.. 2,182 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఈ ప్రక్రియలో 541 మంది తప్పనిసరి బదిలీ కానుంది. విద్యాశాఖ విడుదల చేసిన జీహెచ్‌ఎంల బదిలీ జాబితాలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న మొత్తం 2,182 మందికీ బదిలీ కావడం గమనార్హం. దీంతో సగానికి పైగా జీహెచ్ఎంలు శుక్రవారమే రిలీవ్ కాగా.. అందులో మెజార్టీ టీచర్లు సాయంత్రమే కొత్త స్థానాల్లో జాయిన్ అయ్యారు. పొరపాటు సరిదిద్ది.. జీహెచ్‌ఎంల బదిలీ ప్రక్రియలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరికి ఒకే పాఠశాల కేటాయించారు. ఈ పరిస్థితి కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఆ ఉపాధ్యాయులు విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది. జీహెచ్ఎం ఖాళీలు సంతృప్తికర స్థాయిలో ఉండటం.. జాబితాలో వరుస క్రమంలోని టీచర్ల మధ్య అంతరం ఉండటంతో వేర్వేరు స్థానాలను కేటాయించారు. ఈ ప్రక్రియలో బదిలీ జాబితాలో పెద్దగా మార్పులు చోటుచేసుకోకపోవడంతో జీహెచ్ఎంలంతా ఊపిరి పీల్చుకున్నారు. జీహెచ్ఎంలకు బదిలీ స్థానాల కేటాయింపుల్లో తలెత్తిన పొరపాట్లను స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ), ఎస్జీటీల బదిలీ కేటాయింపుల్లో తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాబితాను ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాతే విడుదల చేయాలని విద్యాఖాఖ నిర్ణయించింది. దీంతో శుక్రవారమే స్కూల్ అసిస్టెంట్ల బదిలీ జాబితా విడుదల కావాల్సి ఉన్నా.. రాత్రి వరకూ కేటాయింపులు పూర్తి కాలేదు. దీంతో జాబితా విడుదల ఆలస్యమైంది. కేటాయింపులు పూర్తయిన తర్వాత జాబితాను పరిశీలించి విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో 31,968 మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా.. 31,483 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరిలో బదిలీ పొందిన టీచర్ల జాబితాను శుక్రవారం అర్ధరాత్రి తర్వాత వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్ల కేటగిరీలో 40,729 మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా.. 39,054 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరి బదిలీ జాబితాను శనివారం విడుదల చేయనున్నట్లు సమాచారం. -
సంక్రాంతికీ జీతాలు డౌటే
నిలిచిన రూ.130కోట్ల చెల్లింపులు విభజన ప్రభావం.. ఉద్యోగులకు శాపం వారం గడిచినా అందని జీతభత్యాలు గగ్గోలు పెడుతున్న కింది స్థాయి ఉద్యోగులు కొత్త సంవత్సరం వచ్చి వారం దాటిపోయింది. మరోపక్క సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. ఇంటిలో అవీ ఇవీ కొనాలంటూ కుటుంబ సభ్యుల ఒత్తిడి పెరుగుతోంది... కానీ జేబులో చిల్లిగవ్వలేదు..అకౌంట్లో జీతాలు పడలేదు. సంక్రాంతి లోపు జీతాలు అందుకోగలమో లేదో తెలియక గెజిటెడ్ ఆఫీసర్ల నుంచి క్లాస్-4 ఉద్యోగుల వరకు అందరూ ఆందోళన చెందుతున్నారు. అప్పటి నుంచి జాప్యం జరగడంలేదు. ఒకటవ తేదీనే నేరుగా అకౌంట్లకు జీతాలు జమవుతున్నాయి. కొత్త సంవత్సరం ఆరంభమై తొమ్మిది రోజులు గడిచిపోయినా డిసెంబర్ జీతభత్యాలు 85 శాతం మందికి జమకాలేదు. దీంతో ఏం జరిగిందో..ఎందుకు జాప్యమైందో తెలియక క్లాస్-4 ఉద్యోగుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. నాటి నిర్లక్ష్య ఫలితం..:గతేడాది జూన్-2వ తేదీన రాష్ర్ట విభజన అమలులోకి వచ్చింది. అంతకు ముందు జారీ చేసిన బిల్లులకు జూన్-2 తర్వాత జరిగిన చెల్లింపులన్నీ విభజన నిష్పత్తి ప్రకారం(ఏపీ-52శాతం, తెలంగాణాః 48శాతం) జరిగాయా లేదా అనేది నిర్ధారిస్తూ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. మెడికల్ రీయింబర్సుమెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలా వివిధ రకాల బిల్లులకు జరిగిన చెల్లింపులను పై నిష్పత్తి ప్రకారం ఉమ్మడి రాష్ర్ట అకౌంట్ ప్రకారం జరగాలి. ఈ విధంగా జూన్-2వ తేదీ నుంచి అక్టోబర్ -31 వరకు జరిగిన చెల్లింపులకు ధ్రువీకరణ పత్రాలను ఉప ఖజనా కార్యాలయానికి గతనెల 24వ తేదీలోగా సమర్పించాలని ఆదేశాలు జారీ అయినా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన డ్రాయింగ్ ఆఫీసర్లు, డిస్బర్సింగ్ ఆఫీసర్స్ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. కలెక్టరేట్‌తో సహా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు డిసెంబర్-31 వరకు ఎలాంటి సర్టిఫికేషన్(ధ్రువీకరణ పత్రాలు) సమర్పించిన దాఖలాలు లేవు. అన్ని శాఖల్లోనూ ఇదే తీరు:జిల్లాలో ఏ ఒక్క శాఖలోనూ ఏ ఒక్కరికీ జనవరి ఒకటిన జీత భత్యాలు జమకాని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సిబ్బంది ఎక్కువగా ఉండే రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ, మెడికల్ కళాశాలలు, జుడీషియల్, కమర్షియల్ టాక్స్, ఆడిటింగ్ ఇలా దాదాపు అన్నిశాఖలకు చెల్లింపులు నిలిచిపోయాయి. ఎందుకు రాలేదని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. దీంతో వారం రోజులుగా పైన పేర్కొన్న బిల్లులకు ధ్రువీకరణపత్రాల తయారీ, సమర్పణలో దాదాపు అన్ని శాఖలు తలమునకలయ్యాయి. 10 నుంచి 50 మంది లోపు సిబ్బంది ఉండే చిన్న చిన్న డిపార్టుమెంట్లు త్వరిగతిన పత్రాలు సమర్పించడంతో వారి జీతభత్యాలు మొదటి వారంలో జమయ్యాయి. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్నతాధికారులతో పాటు సుమారు ఐదువేలలోపు సిబ్బందికి రూ.20 కోట్ల వరకు జీతభత్యాలు జమకాగా, రూ.130కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీతభత్యాల్లేక సంక్రాంతిపండుగకు ఎక్కడ దూరం కావాల్సి వస్తుందోననే భయంతో మిగిలిన శాఖలు కూడా ఆదరా బదరాగా నాటి ఖర్చులకు సంబంధించిన పత్రాలు సమర్పించాయి. దీంతో శాఖల వారీగా జీతభత్యాల బిల్లులను క్లియర్ చేస్తున్నారు. గడిచినవారం రోజుల్లో సుమారు రూ.60 కోట్ల వరకు క్లియిర్ అయిన జీతభత్యాల బిల్లులు బ్యాంకులకు చేరాయే తప్ప ఇంకా వ్యక్తిగత ఖాతాలకు జమకాలేదు. పత్రాలు సమర్పించిన శాఖలకు బిల్లులను క్లియర్ చేసే పనిలో జిల్లా ట్రెజరీ శాఖ నిమగ్నమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి లోగా జీతభత్యాలు అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ట్రెజరీ శాఖాధికారులు చెబుతున్నారు. -
గెజిటెడ్ ఆఫీసర్లు సర్టిఫై చేస్తేనే నమ్మాలా?
మనవాళ్లను మనం నమ్మకపోతే పక్కవాళ్లను నమ్ముతామా అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. పాస్‌పోర్టుల కోసం, ఇంకా వివిధ రకాల పనులకు గెజిటెడ్ అధికారుల వద్ద సంతకాలు చేయించుకునే సంస్కృతికి ఇక కాలం చెల్లాల్సిందేనని అన్నారు. అవతల ఎవరో సర్టిఫై చేస్తేనే మనవాళ్ల నిజాయితీని నమ్మాలా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్యను చాలామంది ఎదుర్కొంటారని, ఇకమీదట అలాంటి సమస్య ఉండబోదని స్పష్టం చేశారు. 125 కోట్ల మంది భారతీయుల మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే గెజిటెడ్ అధికారుల సంతకాల అవసరాన్ని పూర్తిగా తప్పించానని చెప్పారు. -
ఏపీలో బదిలీలకు గేట్లు బార్లా!
గెజిటెడ్ అధికారులకు యథేచ్ఛగా స్థాన చలనం రాజకీయ పైరవీలకు తెరతీసిన సర్కారు రాష్ట్ర స్థాయి కేడర్‌పై కేంద్రం ఆదేశాలు గాలికి వదిలిన సర్కారు అక్టోబర్ 1 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తుంగలోకి తొక్కి మరీ యథేచ్ఛగా ఉద్యోగుల బదిలీలకు అనుమతించటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైరవీలకు తెరతీసింది. గెజిటెడ్ అధికారులను ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా బదిలీ చేసుకోవచ్చంటూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గెజిటెడ్ అధికారులు ఆ పోస్టులో ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారనే అంశంతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా బదిలీ చేయవచ్చని పేర్కొంది. అంటే ఆ పోస్టులోకి వచ్చి కొన్ని నెలలే అయినా టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇష్టం లేకుంటే వేరే చోటకు బదిలీ చేయవచ్చు. ఎన్నికల్లో సహకరించని అధికారులందరినీ బదిలీ చేయాలని ఏకంగా మంత్రివర్గ సమావేశంలోనే రాజకీయ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా బదిలీలపై ఉత్తర్వులు జారీ చేయించింది. బదిలీలపై నిషేధాన్ని సెప్టెంబర్ ఆఖరు వరకు సడలిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లాం ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. బదిలీల నుంచి సచివాలయ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు. కింది స్థాయి ఉద్యోగులు మూడేళ్ల నుంచి ఒకే చోట పని చేస్తుంటే బదిలీ చేయాలని సూచించారు. ఉపాధ్యాయులను మాత్రం కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేస్తారు. కేంద్రం వద్దన్నా వినలేదు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి మరీ ఏపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల బదిలీలకు ఆదేశాలు జారీ చేసింది. బదిలీ నుంచి రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగులకు మినహాయింపు ఇద్దామని, పంపిణీ పూర్తి అయ్యాక చేపడదామని అధికారులు సూచించినా ప్రభుత్వ పెద్దలు అంగీకరించలేదు. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బదిలీ చేయరాదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలున్నాయి. -
సొంత అఫిడవిట్లు చాలు
కేంద్రం నిర్ణయం పౌరులకు భారీ ఉపశమనం న్యూఢిల్లీ: వివిధరకాల డాక్యుమెంట్లకు సంబంధించి పౌరులు ఇకపై సొంత అఫిడవిట్లు ఇస్తే చాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గెజిటెడ్ అధికారుల నుంచి, నోటరీల నుంచి అఫిడవిట్లు సమర్పించాల్సిన బాధ ప్రజలకు తప్పనుంది. ఆయా పనుల నిమిత్తం వ్యక్తుల నుంచి ఇకపై సొంత అఫిడవిట్లు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సమాచారం పంపించింది. ప్రస్తుతం అమలులో అఫిడవిట్ల విధానాన్ని సమీక్షించి ఎక్కడ అవసరమైతే అక్కడ సొంత అఫిడవిట్ల విధానం ప్రవేశపెట్టాలని సూచించింది. ఇప్పటిదాకా వివిధ రకాల డాక్యుమెంట్లతోపాటు, నోటరీ, గెజిటెడ్ ఆఫీసర్లనుంచి అఫిడవిట్లను పౌరులు సమర్పించాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, సొంత అఫిడవిట్లతోనే సరిపెట్టాలని కేంద్రం పేర్కొందని పాలనాసంస్కరణల విభాగం ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అఫిడవిట్లు తీసుకోవాలంటే ప్రజలు కనీసం రూ. వంద నుంచి రూ.150 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి రూ. 10, రూ.20 స్టాంప్ పేపర్లు దొరకక రూ. 50, రూ. 100 పేపర్లపై అఫిడవిట్లు సమర్పించాల్సి వస్తోంది. గ్రామీణుల అవస్థలైతే వర్ణనాతీతం. కేంద్రం తాజా నిర్ణయంతో ఈ ఇక్కట్లు తప్పనున్నాయి. పాలనా సంస్కరణలు ప్రజానుకూలంగా ఉండాలన్న రెండవ పాలనా సంస్కరణల కమిషన్ సిఫారసులకనుగుణంగా కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చిందన్నారు. మార్కుల మెమోలు, పుట్టినతేదీ సర్టిఫికెట్లవంటి వాటికి సొంత అఫిడవిట్లు సరిపోతాయన్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్లను తుదిదశలో సమర్పిస్తే సరిపోతుందన్నారు. -
గెజిటెడ్ అధికారులకు ఒకే వేతన స్కేలు
సాక్షి, హైదరాబాద్: గెజిటెడ్ అధికారులందరికీ ఒకే విధమైన వేతన స్కేలు ఇవ్వాలని పీఆర్సీకి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) విజ్ఞప్తి చేసింది. కొన్ని శాఖల్లో పనిచేస్తున్న ప్రారంభ స్థాయి గెజిటెడ్ అధికారులకు నాన్ గెజిటెడ్ అధికారులతో సమానమైన వేతనాలు ఇస్తున్నారని, దీన్ని మార్చాలని కోరింది. సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో పీఆర్సీ చైర్మన్ పి.కె.అగర్వాల్ మంగళవారం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టీజీవో బృందం పీఆర్సీ చైర్మన్ ముందు పలు డిమాండ్లను వినిపించింది. గెజిటెడ్ అధికారుల కనీస మూల వేతనాన్ని రూ. 16,150 నుంచి రూ. 36,720కు పెంచాలని కోరారు. అలాగే, పదో పీఆర్సీని ఈ ఏడాది జూలై నుంచి అమలు చేయాలని.. 69 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. వెంటనే 47 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇవ్వాలని కోరారు. ఇంటి అద్దె భత్యం(హెచ్ఆర్ఏ) పరిమితిని తొలగించి, జిల్లా కేంద్రాల్లో మూల వేతనంపై 25 శాతం, మిగతా ప్రాంతాల్లో 20 శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. సీసీఏకు ప్రస్తుతం ఉన్న శ్లాబుల విధానాన్ని రద్దు చేసి మూలవేతనంపై 5 శాతం ఇవ్వాలని, యాంత్రిక పదోన్నతుల కాలాన్ని 6-12-18-24 నుంచి 5-10-15-20-25గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వంలా 2 సంవత్సరాలపాటు పిల్లల సంరక్షణ సెలవు కోసం డిమాండ్ చేశారు. అంగవైకల్యం ఉన్న మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా పిల్లల సంరక్షణ అలవెన్స్ ఇవ్వాలని కోరారు. మహిళల సమస్యల పరిష్కారానికి హెచ్వోడీల్లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. -
పోరు హోరు
సాక్షి, నెల్లూరు: వేర్పాటువాదానికి వ్యతిరేకంగా సింహపురిలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. చినుకు..చినుకు కలిసి మహాసముద్రమైనట్టు సమైక్య పోరు రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి గెజిటెడ్ ఆఫీసర్లు నిరవధిక సమ్మెకు దిగుతుండటంతో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించనుంది. మరోవైపు శుక్రవారం జిల్లా నలుమూలాల నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. సమైక్య ఉద్యమంలో 24వ రోజూ అదే హోరు, అదే జోరు కనిపించింది. రాజీవ్ విద్యామిషన్ స్టేట్‌ప్రాజెక్ట్ డెరైక్టర్ ఉషారాణి హైదరాబాద్ నుంచి నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌ను కలెక్టరేట్లో ఏపీ ఎన్జీఓ నాయకులు అడ్డుకున్నారు. కాన్ఫరెన్స్ హాలులోనికి చొచ్చుకెళ్లి ఆర్వీఎం అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంటే కాన్ఫరెన్స్ ఎలా నిర్వహిస్తారని లైవ్‌లో ఉన్న ఉషారాణిని నాయకులు ప్రశ్నించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో దీక్షలో ఉన్నవారికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మకూరు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, గాంధీ బొమ్మ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా అయ్యప్పగుడి నుంచి వేదాయపాళెం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం రాస్తారోకో చేశారు. డైకస్‌రోడ్డు సెంటర్లో మాజీ కార్పొరేటర్ ఆనం జయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్ హైస్కూలు మైదానంలో మానవహారం నిర్వహించారు. విద్యుత్, వాణిజ్యపన్నుల శాఖ అధికారుల దీక్షలు కొనసాగాయి. నిరవధిక సమ్మెకు సంబంధించిన నోటీసును కలెక్టర్ శ్రీకాంత్‌కు గెజిటెడ్ అధికారులు అందజేశారు. కావలిలోని పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ, ఏరియా వైద్యశాల వద్ద సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఆర్టీసీ సెంటర్లో ఉద్యోగ జేఏసీ, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాలు, ఆ ర్డీఓ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ, మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వేర్వేరుగా రిలే దీక్షలు చేపట్టారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్, వైద్యులు ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి బైక్ ర్యాలీ చేశారు. బోగోలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. గూడూరులోని టవర్‌క్లాక్ కూడలిలో విద్యార్థి జేఏసీ చేస్తున్న నిరాహారదీక్షలకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మద్దతు పలికారు. రాజావీధిలో స్థానిక మహిళలు రోడ్డుపై వంటావార్పు చేశారు. విద్యార్థులు, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు శరీరానికి వేపమండలు కట్టుకుని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఉద్యమానికి వాకాడు ఆర్టీసీ డిపో మేనేజర్ సహకరించడం లేదంటూ విద్యార్థులు సెల్‌టవర్ ఎక్కారు. వైఎస్సార్సీపీ సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముత్తుకూరులో భారీ ర్యాలీ, బస్టాండ్ సెంటర్లో వంటావా ర్పు చేశారు. ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు మనుబోలు వద్ద జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. వెంకటాచలంలోని సర్వేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఉపాధ్యాయులు మానహారం నిర్వహించారు. పొదలకూరులో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. సూళ్లూరుపేటలో ఆటో కార్మికులు, విద్యార్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. వారికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య సంఘీభావం తెలిపారు. నాయుడుపేటలో యువకులు చే పట్టిన ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో, అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. తడలోనూ రిలేనిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన ఐటీఐ విద్యార్థులకు కిలివేటి సంజీవయ్య మద్దతు ప్రకటించారు. అక్కంపేట వాసులు రాస్తారోకో నిర్వహించి, కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఇందూరు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రిలేదీక్షలు చేపట్టారు. వెంకటగిరిలో జేఏసీ, టీడీపీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఉదయగిరిలో ఆర్టీసీ డిపో ఎదుట ఎన్ఎంయూ కార్యకర్తలు ఆసనాలతో నిరసన తెలిపారు. పంచాయతీ బస్టాండ్ ఆవరణలో తిరుమలాపురం పంచాయతీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. కొండాపురంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. వింజమూరు మండలంలోని చాకలికొండలో ఆర్కే హైస్కూల్ విద్యార్థులు, గ్రామస్తులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.