సంక్రాంతికీ జీతాలు డౌటే
నిలిచిన రూ.130కోట్ల చెల్లింపులు
విభజన ప్రభావం.. ఉద్యోగులకు శాపం
వారం గడిచినా అందని జీతభత్యాలు
గగ్గోలు పెడుతున్న కింది స్థాయి ఉద్యోగులు
కొత్త సంవత్సరం వచ్చి వారం దాటిపోయింది. మరోపక్క సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. ఇంటిలో అవీ ఇవీ కొనాలంటూ కుటుంబ సభ్యుల ఒత్తిడి పెరుగుతోంది... కానీ జేబులో చిల్లిగవ్వలేదు..అకౌంట్‌లో జీతాలు పడలేదు. సంక్రాంతి లోపు జీతాలు అందుకోగలమో లేదో తెలియక గెజిటెడ్ ఆఫీసర్ల నుంచి క్లాస్-4 ఉద్యోగుల వరకు అందరూ ఆందోళన చెందుతున్నారు.
అప్పటి నుంచి జాప్యం జరగడంలేదు. ఒకటవ తేదీనే నేరుగా అకౌంట్లకు జీతాలు జమవుతున్నాయి. కొత్త సంవత్సరం ఆరంభమై తొమ్మిది రోజులు గడిచిపోయినా డిసెంబర్ జీతభత్యాలు 85 శాతం మందికి జమకాలేదు. దీంతో ఏం జరిగిందో..ఎందుకు జాప్యమైందో తెలియక క్లాస్-4 ఉద్యోగుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.
నాటి నిర్లక్ష్య ఫలితం..:గతేడాది జూన్-2వ తేదీన రాష్ర్ట విభజన అమలులోకి వచ్చింది. అంతకు ముందు జారీ చేసిన బిల్లులకు జూన్-2 తర్వాత జరిగిన చెల్లింపులన్నీ విభజన నిష్పత్తి ప్రకారం(ఏపీ-52శాతం, తెలంగాణాః 48శాతం) జరిగాయా లేదా అనేది నిర్ధారిస్తూ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. మెడికల్ రీయింబర్సుమెంట్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇలా వివిధ రకాల బిల్లులకు జరిగిన చెల్లింపులను పై నిష్పత్తి ప్రకారం ఉమ్మడి రాష్ర్ట అకౌంట్ ప్రకారం జరగాలి. ఈ విధంగా జూన్-2వ తేదీ నుంచి అక్టోబర్ -31 వరకు జరిగిన చెల్లింపులకు ధ్రువీకరణ పత్రాలను ఉప ఖజనా కార్యాలయానికి గతనెల 24వ తేదీలోగా సమర్పించాలని ఆదేశాలు జారీ అయినా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన డ్రాయింగ్ ఆఫీసర్లు, డిస్బర్సింగ్ ఆఫీసర్స్ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. కలెక్టరేట్‌తో సహా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు డిసెంబర్-31 వరకు ఎలాంటి సర్టిఫికేషన్(ధ్రువీకరణ పత్రాలు) సమర్పించిన దాఖలాలు లేవు.
అన్ని శాఖల్లోనూ ఇదే తీరు:జిల్లాలో ఏ ఒక్క శాఖలోనూ ఏ ఒక్కరికీ జనవరి ఒకటిన జీత భత్యాలు జమకాని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సిబ్బంది ఎక్కువగా ఉండే రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ, మెడికల్ కళాశాలలు, జుడీషియల్, కమర్షియల్ టాక్స్, ఆడిటింగ్ ఇలా దాదాపు అన్నిశాఖలకు చెల్లింపులు నిలిచిపోయాయి.
ఎందుకు రాలేదని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. దీంతో వారం రోజులుగా పైన పేర్కొన్న బిల్లులకు ధ్రువీకరణపత్రాల తయారీ, సమర్పణలో దాదాపు అన్ని శాఖలు తలమునకలయ్యాయి. 10 నుంచి 50 మంది లోపు సిబ్బంది ఉండే చిన్న చిన్న డిపార్టుమెంట్లు త్వరిగతిన పత్రాలు సమర్పించడంతో వారి జీతభత్యాలు మొదటి వారంలో జమయ్యాయి. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్నతాధికారులతో పాటు సుమారు ఐదువేలలోపు సిబ్బందికి రూ.20 కోట్ల వరకు జీతభత్యాలు జమకాగా, రూ.130కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీతభత్యాల్లేక సంక్రాంతిపండుగకు ఎక్కడ దూరం కావాల్సి వస్తుందోననే భయంతో మిగిలిన శాఖలు కూడా ఆదరా బదరాగా నాటి ఖర్చులకు సంబంధించిన పత్రాలు సమర్పించాయి. దీంతో శాఖల వారీగా జీతభత్యాల బిల్లులను క్లియర్ చేస్తున్నారు. గడిచినవారం రోజుల్లో సుమారు రూ.60 కోట్ల వరకు క్లియిర్ అయిన జీతభత్యాల బిల్లులు బ్యాంకులకు చేరాయే తప్ప ఇంకా వ్యక్తిగత ఖాతాలకు జమకాలేదు. పత్రాలు సమర్పించిన శాఖలకు బిల్లులను క్లియర్ చేసే పనిలో జిల్లా ట్రెజరీ శాఖ నిమగ్నమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి లోగా జీతభత్యాలు అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ట్రెజరీ శాఖాధికారులు చెబుతున్నారు.