సాక్షి, నెల్లూరు: వేర్పాటువాదానికి వ్యతిరేకంగా సింహపురిలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. చినుకు..చినుకు కలిసి మహాసముద్రమైనట్టు సమైక్య పోరు రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి గెజిటెడ్ ఆఫీసర్లు నిరవధిక సమ్మెకు దిగుతుండటంతో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించనుంది. మరోవైపు శుక్రవారం జిల్లా నలుమూలాల నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. సమైక్య ఉద్యమంలో 24వ రోజూ అదే హోరు, అదే జోరు కనిపించింది.
రాజీవ్ విద్యామిషన్ స్టేట్‌ప్రాజెక్ట్ డెరైక్టర్ ఉషారాణి హైదరాబాద్ నుంచి నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌ను కలెక్టరేట్‌లో ఏపీ ఎన్జీఓ నాయకులు అడ్డుకున్నారు. కాన్ఫరెన్స్ హాలులోనికి చొచ్చుకెళ్లి ఆర్వీఎం అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంటే కాన్ఫరెన్స్ ఎలా నిర్వహిస్తారని లైవ్‌లో ఉన్న ఉషారాణిని నాయకులు ప్రశ్నించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో దీక్షలో ఉన్నవారికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మకూరు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, గాంధీ బొమ్మ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు.
విజయమ్మ దీక్షకు మద్దతుగా అయ్యప్పగుడి నుంచి వేదాయపాళెం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం రాస్తారోకో చేశారు. డైకస్‌రోడ్డు సెంటర్లో మాజీ కార్పొరేటర్ ఆనం జయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్ హైస్కూలు మైదానంలో మానవహారం నిర్వహించారు. విద్యుత్, వాణిజ్యపన్నుల శాఖ అధికారుల దీక్షలు కొనసాగాయి. నిరవధిక సమ్మెకు సంబంధించిన నోటీసును కలెక్టర్ శ్రీకాంత్‌కు గెజిటెడ్ అధికారులు అందజేశారు.
కావలిలోని పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్‌లో సమైక్యాంధ్ర జేఏసీ, ఏరియా వైద్యశాల వద్ద సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఆర్టీసీ సెంటర్లో ఉద్యోగ జేఏసీ, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాలు, ఆ ర్డీఓ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ, మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వేర్వేరుగా రిలే దీక్షలు చేపట్టారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్, వైద్యులు ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి బైక్ ర్యాలీ చేశారు. బోగోలులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి.
గూడూరులోని టవర్‌క్లాక్ కూడలిలో విద్యార్థి జేఏసీ చేస్తున్న నిరాహారదీక్షలకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మద్దతు పలికారు. రాజావీధిలో స్థానిక మహిళలు రోడ్డుపై వంటావార్పు చేశారు. విద్యార్థులు, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు శరీరానికి వేపమండలు కట్టుకుని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఉద్యమానికి వాకాడు ఆర్టీసీ డిపో మేనేజర్ సహకరించడం లేదంటూ విద్యార్థులు సెల్‌టవర్ ఎక్కారు.
వైఎస్సార్‌సీపీ సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముత్తుకూరులో భారీ ర్యాలీ, బస్టాండ్ సెంటర్‌లో వంటావా ర్పు చేశారు. ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు మనుబోలు వద్ద జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. వెంకటాచలంలోని సర్వేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఉపాధ్యాయులు మానహారం నిర్వహించారు. పొదలకూరులో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్షలు చేపట్టారు.
సూళ్లూరుపేటలో ఆటో కార్మికులు, విద్యార్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. వారికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య సంఘీభావం తెలిపారు. నాయుడుపేటలో యువకులు చే పట్టిన ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో, అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ నేతల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.
తడలోనూ రిలేనిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన ఐటీఐ విద్యార్థులకు కిలివేటి సంజీవయ్య మద్దతు ప్రకటించారు. అక్కంపేట వాసులు రాస్తారోకో నిర్వహించి, కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఇందూరు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ బస్టాండ్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రిలేదీక్షలు చేపట్టారు. వెంకటగిరిలో జేఏసీ, టీడీపీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది.
ఉదయగిరిలో ఆర్టీసీ డిపో ఎదుట ఎన్‌ఎంయూ కార్యకర్తలు ఆసనాలతో నిరసన తెలిపారు. పంచాయతీ బస్టాండ్ ఆవరణలో తిరుమలాపురం పంచాయతీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. కొండాపురంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. వింజమూరు మండలంలోని చాకలికొండలో ఆర్‌కే హైస్కూల్ విద్యార్థులు, గ్రామస్తులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
పోరు హోరు
Published Sat, Aug 24 2013 3:15 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement