Protest programs
-
సోనియా, రాహుల్‌ను అరెస్టు చేస్తే జైల్‌భరో
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో.. మోదీ సర్కారు కక్షసాధింపు చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. సోనియా, రాహుల్‌లను అరెస్టు చేస్తే నేతలు, కార్యకర్తలు జైల్‌భరోకు సిద్ధమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సం బంధించిన అంశాలపై పీసీసీ శుక్రవారం గాంధీభవన్‌లో శ్రేణులకు అవగాహన కల్పిం చింది. కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరైన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు పేరిట సోనియా, రాహుల్‌లపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తోం దని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, ప్రధాని దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక పూర్తిగా కాం గ్రెస్‌కు చెందినదని.. అందులో ఎలాంటి అవినీతి చోటుచేసుకోలేదని అన్నారు. ఎలాంటి నిబంధనల ఉల్లంఘన, అక్రమాలు జరగకున్నా బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వేసిన కేసును ఆ పార్టీ అడ్డుపెట్టుకుని వేధిస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కేసుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన అం శాలపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ శుక్రవారం గాంధీభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా అవగాహన కల్పించారు. పత్రికకు పార్టీ రూ.90 కోట్లు అప్పు రూపంలో ఇవ్వడంలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి కోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కూడా పార్టీ ఎన్నికల సం ఘం దృష్టికి తీసుకెళ్లిందన్నారు. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ కంపెనీ.. కాంగ్రెస్ పార్టీకి సన్నిహిత సంస్థ అని శ్రవణ్ వెల్లడించారు. ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే నేషనల్ హెరాల్డ్‌తో పాటు హిందీ, ఉర్దూ దినపత్రికలను కూడా కాంగ్రెస్ నడిపిన విషయాన్ని ప్రస్తావించారు. నిబంధనల ఉల్లంఘన జరగకున్నా మోదీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్న వైనాన్ని వివరించారు. కార్యక్రమంలో పార్టీ శాసన సభా పక్షం నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే జె.గీతారెడ్డి, మాజీ ఎంపీలు వివేక్, అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి దానం నాగేందర్‌తోపాటు డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. -
అడుగడుగునా ఖాకీలే!
శ్రీకాకుళం క్రైం: ఆమె ప్రజాప్రతినిధి. పాలకొండ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే. ఆమె వాహనాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. కారణం.. కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ చేపట్టిన మహాధర్నాలో పాల్గొనేందుకు ఆమె వెళుతుండటమే. ప్రభుత్వ విధానాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టడం పార్టీలు, ప్రజల ప్రజాస్వామిక హక్కు. అందులో పాల్గొన్న ఆయా పార్టీల నాయకుల బాధ్యత. కానీ టీడీపీ ప్రభుత్వంలో ఆ హక్కులను కాలరాస్తున్నారని సాక్షాత్తు ఎమ్మెల్యేను అడ్డుకోవడమే నిరూపిస్తోంది. ఈ అనుభవం ఒక్క కళావతిదే కాదు.. మహాధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు చాలామంది ఇదే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తూ వైఎస్ఆర్ సీపీ చేపట్టిన మహాధర్నాను విఫలం చేయాలని కుట్ర పన్నిన ప్రభుత్వం, టీడీపీ పెద్దలు.. దానికి పోలీసులను పావులను వినియోగించున్నారు. శాంతియుతంగా చేపట్టిన మహాధర్నాను ఎన్నడూ లేని రీతిలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మహాధర్నాలో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయమే జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ట్రాక్టర్లు, లారీలు, ఆటోల్లో బయలుదేరారు. అయితే శ్రీకాకుళంతోపాటు జిల్లాలోని మిగిలిన ప్రాంతాల ప్రధాన మార్గాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఎక్కడికక్కడ వాహనాలను ఆపి తనిఖీల పేరుతో నిలిపివేశారు. శ్రీకాకుళం పట్టణంలో కూడా పలు ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు కాపు కాసి మహాధర్నాకు వెళ్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రధానంగా కలెక్టరేట్‌కు వెళ్లే 80 అడుగుల రోడ్డులో కాపు కాసి, మహా ధర్నకు వచ్చే వాహనాల్లో కొన్నింటిని నిలిపివేశారు. కార్లలో వెళ్తున్న నాయకులను కూడా అడ్డుకునేందుకు కొన్ని చోట్ల పోలీసులు ప్రయత్నించారు. పాలకొండ, పాతపట్నం ఎమ్మెల్యేల వాహనాలను అడ్డుకున్నా వారు ప్రతిఘటించి.. హెచ్చరించడంతో విడిచిపెట్టారు. కలెక్టరేటు మార్గంలో ఎక్కడ చూసినా లాఠీలు, తుపాకులు ధరించిన పోలీసులే కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందారు. కాగా ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్న మహాధర్నాను అడ్డుకోవటంలో పోలీసు యంత్రాంగం అత్యుత్సాహం కనబరిచిందన్న ఆరోపణలను శ్రీకాకుళం డిఎస్పీ కె.భార్గవరావ్ నాయుడు ఖండించారు. మహాధర్నాకు వచ్చే వారిని ఎక్కడ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. -
పోరు హోరు
సాక్షి, నెల్లూరు: వేర్పాటువాదానికి వ్యతిరేకంగా సింహపురిలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. చినుకు..చినుకు కలిసి మహాసముద్రమైనట్టు సమైక్య పోరు రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి గెజిటెడ్ ఆఫీసర్లు నిరవధిక సమ్మెకు దిగుతుండటంతో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించనుంది. మరోవైపు శుక్రవారం జిల్లా నలుమూలాల నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. సమైక్య ఉద్యమంలో 24వ రోజూ అదే హోరు, అదే జోరు కనిపించింది. రాజీవ్ విద్యామిషన్ స్టేట్‌ప్రాజెక్ట్ డెరైక్టర్ ఉషారాణి హైదరాబాద్ నుంచి నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌ను కలెక్టరేట్లో ఏపీ ఎన్జీఓ నాయకులు అడ్డుకున్నారు. కాన్ఫరెన్స్ హాలులోనికి చొచ్చుకెళ్లి ఆర్వీఎం అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంటే కాన్ఫరెన్స్ ఎలా నిర్వహిస్తారని లైవ్‌లో ఉన్న ఉషారాణిని నాయకులు ప్రశ్నించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో దీక్షలో ఉన్నవారికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మకూరు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, గాంధీ బొమ్మ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా అయ్యప్పగుడి నుంచి వేదాయపాళెం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం రాస్తారోకో చేశారు. డైకస్‌రోడ్డు సెంటర్లో మాజీ కార్పొరేటర్ ఆనం జయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్ హైస్కూలు మైదానంలో మానవహారం నిర్వహించారు. విద్యుత్, వాణిజ్యపన్నుల శాఖ అధికారుల దీక్షలు కొనసాగాయి. నిరవధిక సమ్మెకు సంబంధించిన నోటీసును కలెక్టర్ శ్రీకాంత్‌కు గెజిటెడ్ అధికారులు అందజేశారు. కావలిలోని పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ, ఏరియా వైద్యశాల వద్ద సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఆర్టీసీ సెంటర్లో ఉద్యోగ జేఏసీ, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాలు, ఆ ర్డీఓ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ, మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వేర్వేరుగా రిలే దీక్షలు చేపట్టారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్, వైద్యులు ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి బైక్ ర్యాలీ చేశారు. బోగోలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. గూడూరులోని టవర్‌క్లాక్ కూడలిలో విద్యార్థి జేఏసీ చేస్తున్న నిరాహారదీక్షలకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మద్దతు పలికారు. రాజావీధిలో స్థానిక మహిళలు రోడ్డుపై వంటావార్పు చేశారు. విద్యార్థులు, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు శరీరానికి వేపమండలు కట్టుకుని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఉద్యమానికి వాకాడు ఆర్టీసీ డిపో మేనేజర్ సహకరించడం లేదంటూ విద్యార్థులు సెల్‌టవర్ ఎక్కారు. వైఎస్సార్సీపీ సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముత్తుకూరులో భారీ ర్యాలీ, బస్టాండ్ సెంటర్లో వంటావా ర్పు చేశారు. ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు మనుబోలు వద్ద జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. వెంకటాచలంలోని సర్వేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఉపాధ్యాయులు మానహారం నిర్వహించారు. పొదలకూరులో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. సూళ్లూరుపేటలో ఆటో కార్మికులు, విద్యార్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. వారికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య సంఘీభావం తెలిపారు. నాయుడుపేటలో యువకులు చే పట్టిన ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో, అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. తడలోనూ రిలేనిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన ఐటీఐ విద్యార్థులకు కిలివేటి సంజీవయ్య మద్దతు ప్రకటించారు. అక్కంపేట వాసులు రాస్తారోకో నిర్వహించి, కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఇందూరు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రిలేదీక్షలు చేపట్టారు. వెంకటగిరిలో జేఏసీ, టీడీపీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఉదయగిరిలో ఆర్టీసీ డిపో ఎదుట ఎన్ఎంయూ కార్యకర్తలు ఆసనాలతో నిరసన తెలిపారు. పంచాయతీ బస్టాండ్ ఆవరణలో తిరుమలాపురం పంచాయతీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. కొండాపురంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. వింజమూరు మండలంలోని చాకలికొండలో ఆర్కే హైస్కూల్ విద్యార్థులు, గ్రామస్తులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.