శ్రీకాకుళం క్రైం: ఆమె ప్రజాప్రతినిధి. పాలకొండ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే. ఆమె వాహనాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. కారణం.. కలెక్టరేట్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన మహాధర్నాలో పాల్గొనేందుకు ఆమె వెళుతుండటమే. ప్రభుత్వ విధానాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టడం పార్టీలు, ప్రజల ప్రజాస్వామిక హక్కు. అందులో పాల్గొన్న ఆయా పార్టీల నాయకుల బాధ్యత. కానీ టీడీపీ ప్రభుత్వంలో ఆ హక్కులను కాలరాస్తున్నారని సాక్షాత్తు ఎమ్మెల్యేను అడ్డుకోవడమే నిరూపిస్తోంది. ఈ అనుభవం ఒక్క కళావతిదే కాదు.. మహాధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు చాలామంది ఇదే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తూ వైఎస్‌ఆర్ సీపీ చేపట్టిన మహాధర్నాను విఫలం చేయాలని కుట్ర పన్నిన ప్రభుత్వం, టీడీపీ పెద్దలు.. దానికి పోలీసులను పావులను వినియోగించున్నారు. శాంతియుతంగా చేపట్టిన మహాధర్నాను ఎన్నడూ లేని రీతిలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మహాధర్నాలో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయమే జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు ట్రాక్టర్లు, లారీలు, ఆటోల్లో బయలుదేరారు. అయితే శ్రీకాకుళంతోపాటు జిల్లాలోని మిగిలిన ప్రాంతాల ప్రధాన మార్గాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.
ఎక్కడికక్కడ వాహనాలను ఆపి తనిఖీల పేరుతో నిలిపివేశారు. శ్రీకాకుళం పట్టణంలో కూడా పలు ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు కాపు కాసి మహాధర్నాకు వెళ్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రధానంగా కలెక్టరేట్‌కు వెళ్లే 80 అడుగుల రోడ్డులో కాపు కాసి, మహా ధర్నకు వచ్చే వాహనాల్లో కొన్నింటిని నిలిపివేశారు. కార్లలో వెళ్తున్న నాయకులను కూడా అడ్డుకునేందుకు కొన్ని చోట్ల పోలీసులు ప్రయత్నించారు. పాలకొండ, పాతపట్నం ఎమ్మెల్యేల వాహనాలను అడ్డుకున్నా వారు ప్రతిఘటించి.. హెచ్చరించడంతో విడిచిపెట్టారు. కలెక్టరేటు మార్గంలో ఎక్కడ చూసినా లాఠీలు, తుపాకులు ధరించిన పోలీసులే కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందారు. కాగా ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతున్న మహాధర్నాను అడ్డుకోవటంలో పోలీసు యంత్రాంగం అత్యుత్సాహం కనబరిచిందన్న ఆరోపణలను శ్రీకాకుళం డిఎస్పీ కె.భార్గవరావ్ నాయుడు ఖండించారు. మహాధర్నాకు వచ్చే వారిని ఎక్కడ అడ్డుకోలేదని స్పష్టం చేశారు.
అడుగడుగునా ఖాకీలే!
Published Sat, Dec 6 2014 3:46 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement