కౌంటర్ దాఖలు చేయాలని మరోసారి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ జూలై 8కి వాయిదా
సాక్షి, అమరావతి: నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం, నిధుల వృథా, ప్రభుత్వ సంపదకు, సహజ వనరులకు నష్టం కలిగించడం వంటి విషయాల్లో తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా అధీకృత అధికారుల నియామకం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పటి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రఘురామిరెడ్డి రాసిన లేఖను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు వీలుగా నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం, నిధుల వృథా, ప్రభుత్వ సంపదకు, సహజ వనరులకు నష్టం కలిగించడం వంటి విషయాల్లో ఏ సంస్థలోకైనా వెళ్లేందుకు, సోదాలు చేసేందుకు, సమాచారం సేకరించేందుకు, రికార్డులను పరిశీలించేందుకు, జప్తు చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేసేలా గెజిటెడ్ అధికారులందరినీ అధీకృత అధికారులుగా నియమించాలని కోరుతూ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ హోదాలో కొల్లి రఘురామిరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
ఈ లేఖను సవాల్ చేస్తూ టీడీపీ తరఫున నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా గురువారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ చీమలపాటి రవి విచారణ జరిపారు.
న్యాయమూర్తి అసహనం
లోకేశ్ తరఫు న్యాయవాది అఖిల్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. ఈ వ్యవహారంపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం గతంలో చెప్పిందని పేర్కొన్నారు. విధానపరమైన నిర్ణయం తీసుకున్నారా?, తీసుకోబోతున్నారా?, అసలు ఈ వ్యవహారంలో ఏం చేయబోతున్నారో తెలియచేస్తూ కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
దీనిపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం ఏం చెప్పాలో మీరే పేరాల వారీగా కౌంటర్ దాఖలు చేసి ఇవ్వండి. దాన్నే ప్రభుత్వం దాఖలు చేస్తుంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏయే అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలో కోర్టు ఎలా చెబుతుందని ప్రశ్నించారు. కౌంటర్ దాఖలు నిమిత్తం విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment