అవును మరి! ఎక్కడి నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ! ఎక్కడి నందమూరి తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్!! తొమ్మిదినెలల కాలంలోనే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని ఊచకోత కోసి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జననేత ఎన్టీరామారావు. 1994లో రెండోసారి కూడా పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చిన ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరేలా టీడీపీ ఎమ్మెల్యేలను ఉసగొల్పి ఆయన సీఎం పోస్టుకే ఎసరు పెట్టిన చంద్రబాబు చరిత్ర జగద్విదితమే.
ఆ తర్వాత చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ఉమ్మడి రాష్ట్ర ప్రజలు 2004 లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం అందించారు. వైఎస్సార్ అయిదేళ్ల పాలనతో సంక్షేమం, అభివృద్ధిని జోడుగుర్రాల్లా పరిగెత్తించడంతో 2009 ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోతామేమో అనే భయం పట్టుకుంది బాబుకు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ హిట్ మీద హిట్ తో అగ్రహీరోగా రాణిస్తున్నారు. చంద్రబాబు మరోసారి గతాన్ని పక్కనబెట్టి జూనియర్ ఎన్టీఆర్ కరిష్మాను పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు. తన తండ్రికి, తమ కుటుంబానికి చంద్రబాబు చేసిన నమ్మకద్రోహాన్ని విస్మరించి జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్రం మొత్తం పర్యటించి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసిపెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. టీడీపీకి అధికారం దక్కలేదు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి గ్లామరస్ హీరో ముందు తన కొడుకు లోకేశ్ నాయుడు వెలవెలబోతాడని అతి స్వల్పకాలంలోనే గ్రహించిన చంద్రబాబు క్రమక్రమంగా జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టసాగారు.
2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనల పొత్తు ప్రభావంతో వైసిపి కన్నా కేవలం ఒకటిన్నర శాతం ఎక్కువ ఓట్లతో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అమరావతి అనే ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి రాజధాని నిర్మాణం పేరుతో రాబోయే పాతికేళ్లు తనదే అధికారం అనే ఊహా లోకంలో తేలియాడారు. కానీ 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ దెబ్బకు కనీవినీ ఎరుగని విధంగా కుదేలైంది తెలుగుదేశం. అటు లోకేశ్‌ను చూస్తే మూడేళ్లు మంత్రిగా పనిచేసి, తన కలల రాజధాని ప్రాంతంలోనే ఘోరంగా ఓడిపోయారు. ఆ తరువాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాభవమే. (చదవండి: అబద్ధాలకు చెక్... అభివృద్ధితోనే!)
చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక పార్టీకి భవిష్యత్తు లేదని కిందిస్థాయి నాయకులు జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెస్తున్నారు. బాబు సొంత నియోజకవర్గం కుప్పంలో బాబుముందే జూనియర్ రావాలి అంటూ నినాదాలు చెయ్యడమే కాక ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చెయ్యడంతో ఆయన కంగుతిన్నారు. ఆ తరువాత కుప్పం మునిసిపాలిటీల్లో టీడీపీ జెండా ఊడిపోయింది. బాబును 7 సార్లు అసెంబ్లీకి పంపిన కుప్పంలో మొదటిసారిగా టీడీపీ కుప్పకూలిపోయింది.
చంద్రబాబుకు డెబ్బై ఏళ్ళు దాటాయి. లోకేష్ ఏమాత్రం ప్రతిభ చూపకపోవడంతో పార్టీలో చాలామందికి ఆయన నాయకత్వంమీద నమ్మకం పోయింది. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ రావాలని, పార్టీ పగ్గాలు చేబట్టాలని స్వరాలు వినిపిస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్యలాంటి సీనియర్ నాయకులు సైతం జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ గొంతులు విప్పుతున్నారు. ఇదే చంద్రబాబుకు కంటగింపుగా ఉంది. (చదవండి: తెలుగుదేశం విలాపం)
తన సతీమణికి అవమానం జరిగిందన్న చంద్రబాబు రోదన ఆయన మనసెరిగినవారికి కలిసొచ్చింది. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఫలితమే జూనియర్ మీద విమర్శలు ప్రారంభించారు. మేనత్తకు అవమానం జరిగితే జూనియర్‌లో ఫైర్ ఎక్కడ అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాతగారు పెట్టిన పార్టీ పట్ల జూనియర్‌కు బాధ్యత లేదా అంటూ నిలదీస్తున్నారు! ఆ ఘట్టం ముగిసిన మూడు రోజులదాకా లోకేశ్ అసలు పెదవి విప్పిన దాఖాలానే లేదు. లోకేశ్‌లోనే లేని ఫైర్ జూనియర్‌కు ఎలా వస్తుందో అర్థం కాదు. (చదవండి: వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!)
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని చెరపట్టడంలో చంద్రబాబుకు సహకరించిన ఎన్టీఆర్ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్లు, అల్లుళ్ళు.. ఆ తరువాత చంద్రబాబు పాల్పడిన నమ్మకద్రోహానికి ఎలా బలయ్యారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు సహకరించిన తన తండ్రి హరికృష్ణకు, ఆ తర్వాత తన మామ చంద్రబాబు స్వయానా పొడిచిన వెన్నుపోటును జూనియర్ మర్చిపోవడం సాధ్యమేనా?
- ఇలపావులూరి మురళీ మోహనరావు
వ్యాసకర్త సీనియర్ రాజకీయ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment