సర్కారు భూములు స్వాహా | Billions worth of lands in the hands of TDP leaders | Sakshi
Sakshi News home page

సర్కారు భూములు స్వాహా

Published Sat, Jun 23 2018 2:42 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

Billions worth of lands in the hands of TDP leaders - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలనలో లక్షల కోట్ల విలువైన లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు రెక్కలొచ్చి ఎగిరిపోయాయి. సాక్షాత్తూ అధికార పార్టీ నాయకులే రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, సర్కారు భూములను స్వాహా చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను బినామీ పేర్లతో మింగేస్తున్నారు. ఖాళీ భూములు కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతు న్నారు. డీకేటీ పట్టాలు ఇవ్వని భూములను కూడా ఎప్పుడో 1954కు ముందే ఇచ్చినట్లు దొంగ పట్టాలు సృష్టిస్తున్నారు. పాత రికార్డులను మార్చేసి, కొత్త రికార్డులు తయారు చేస్తున్నారు. పదవీ విరమణ చేసిన అధికారులను వాడుకుని, పాత తేదీలతో సంతకాలు చేయించి బినామీలు, బంధువుల పేర్లతో గుట్టుగా సర్కారు భూములు కొట్టేస్తున్నారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రెవెన్యూ శాఖ వెబ్‌సైట్‌ వెబ్‌ల్యాండ్‌లో రాత్రికి రాత్రే పేర్లు మారిపోతున్నాయి. అసైన్డ్‌ భూముల అనుభవదారులుగా అసైనీల బదులు ఇతరుల పేర్లు దర్శనమిస్తున్నాయి.

గ్రామకంఠాలను అమ్ముకున్నారు 
శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా అన్ని జిల్లాల్లోనూ సర్కారు భూములు పరాధీనమైపోయాయి. రూ.లక్షల కోట్ల విలువైన లక్షలాది ఎకరాలను సొంత ఖాతాల్లో వేసుకున్నారు. విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం వంటి నగరాల్లో ప్రజల ఉమ్మడి అవసరాల కోసం బ్రిటిష్‌ వారు కేటాయించిన గ్రామకంఠం భూములను సైతం అధికార పార్టీ నాయకులు ఆక్రమించి, అమ్ముకుని రూ.వందల కోట్లు వెనకేసుకున్నారు. తిరుపతిలో ఓ ప్రజాప్రతినిధి కుటుంబం రూ.1,000 కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూములను రికార్డులు మార్చేసి సొంతం చేసుకుంది. రాష్ట్ర పారిశ్రామిక రాజధాని విశాఖపట్నం నడిబొడ్డున దసపల్లా హిల్స్‌లో అత్యంత విలువైన సర్కారు భూమిని నకిలీ పత్రాలతో అధికార పార్టీ నేతలు ఆక్రమించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. 

పీఓటీ చట్టాన్ని తుంగలో తొక్కి...
బదలాయింపు నిషేధ(పీఓటీ) చట్టాన్ని తుంగలో తొక్కి పేదలకు చెందిన అసైన్డ్‌ భూములను అధికార పార్టీ నేతలు పట్టా భూములుగా మార్చుకున్నారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో అంచనాలకు అందని స్థాయిలో భూకుంభకోణాలు జరిగాయి. ఒక్క విశాఖ జిల్లాలోనే రికార్డుల మార్పిడి, ట్యాంపరింగ్‌ ద్వారా రూ.లక్ష కోట్ల విలువైన భూకుంభకోణం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని అప్పట్లో స్వయంగా విశాఖ జిల్లా కలెక్టరే ధ్రువీకరించారు. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే ప్రభుత్వ పెద్దల బండారం బయటపడుతుందనే భయంతో హడావుడిగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌)ను నియమించి, తూతూమంత్రంగా దర్యాప్తును ముగించి సర్దుబాటు చేశారనే ఆరోపణలున్నాయి. రాయలసీమకు చెందిన ఇద్దరు మంత్రులు, ఒక ముఖ్యనేత అనంతపురం–బెంగళూరు జాతీయ రహదారి మార్గంలో అత్యంత విలువైన 1,000 ఎకరాల ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో కొట్టేశారు. 1,400 ఎకరాల అసైన్డ్‌ భూములను అగ్రిమెంట్ల రూపంలో దూరపు బంధువుల (బినామీలు) పేర్లతో నామమాత్రపు ధరతో కొనుగోలు చేసి, వెబ్‌ల్యాండ్‌లో తమ పేర్లు ఎక్కించుకున్నారు. వైఎస్సార్‌ జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి ఏకంగా 300 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, బినామీల పేర్లతో రికార్డులు మార్పించేశాడు. చుట్టూ ఫెన్సింగ్‌ వేసి తోటలు పెంచుతున్నాడు. ఇదే జిల్లాలో ఒక అధికారి రికార్డులు ట్యాంపరింగ్‌ చేసి ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను ఆక్రమించుకుని చుట్టూ కోటలా ఎలక్ట్రిక్‌ ఫెన్సింగ్‌ వేయించుకున్నాడు. ఆయన అండతోనే ఒక ప్రజాప్రతినిధి బంధువుల పేర్లతో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను సొంతం చేసుకున్నాడు. అందువల్లే ఆ అధికారి సస్పెన్షన్‌ను ఎత్తివేయించి పోస్టింగ్‌ ఇప్పించారనే విమర్శలు ఉన్నాయి. 

అసైన్డ్‌ భూములతో బేరం 
ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములను అసైనీలు సాగు చేసుకోవాలే తప్ప విక్రయించడానికి వీల్లేదు. అయితే, అధికార పార్టీ నాయకులు అసైన్డ్‌ భూములను కారుచౌకగా పీఓటీ చట్టానికి విరుద్ధంగా కొనుగోలు చేశారు. ఆ భూములను భూసమీకరణలో ప్రభుత్వానికి ఇచ్చారు. పరిహారం కింద ప్రభుత్వం నుంచి అత్యంత విలువైన ఫ్లాట్లు పొందారు. విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) పరిధిలో ఒక మంత్రి బినామీ పేర్లతో కొనుగోలు చేసిన అసైన్డ్‌ భూములను వుడాకు అప్పగించారు. పరిహారం కింద రూ.600 కోట్ల విలువైన స్థలాలను చట్టబద్ధంగా సొంతం చేసుకునేందుకు పావులు కదిపారు. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. 

‘గీతం’కు అనుచిత ప్రయోజనం 
విశాఖ జిల్లాలోని రుషికొండలో ప్రభుత్వ సంస్థలకు 55 ఎకరాలు కేటాయిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు గత ఏడాది ఏప్రిల్‌ 5న ఏకంగా జీవోఎంఎస్‌ నంబరు 165ను జారీ చేసింది. రూ.వందల కోట్ల విలువైన ఈ భూమిని ముఖ్యమంత్రి సమీప బంధువు, విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తికి చెందిన సంస్థకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ భూమి ఎంవీవీఎస్‌ మూర్తికి చెందిన ‘గీతం’ సంస్థ ఆక్రమణలోనే ఉండడం గమనార్హం. 

అక్రమార్కులకే పరిహారం 
రాజధాని అమరావతి పరిధిలోని రెండు గ్రామాల్లో భూసమీకరణ కింద తీసుకున్న అసైన్డ్‌ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ రెవెన్యూ శాఖ గతనెల 18వ తేదీన జీవో జారీ చేయడం అక్రమాలకు పరాకాష్టగా చెప్పొచ్చు. రాజధాని నిర్మాణం లేదా ఇతర అవసరాలకు భూసమీకరణ కింద ప్రభుత్వం ఈ భూములను తీసుకున్నప్పటికీ వాస్తవ అసైనీలకే పరిహారం, ప్లాట్లు, కౌలు, ప్యాకేజీలు ఇవ్వాలి. ఇందుకు భిన్నంగా అక్రమంగా వీటిని పొందిన వారికే ఆయా ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది. ఈ భూములన్నీ రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల బినామీలవి కావడం వల్లే ప్రభుత్వం ఈ జీవో ఇచ్చిందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. 

అడ్డగోలుగా భూసంతర్పణలు 
టీడీపీ ముఖ్యనేతల బంధువులకు, బాగా కావాల్సిన వారికి ప్రభుత్వం విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టింది. 
- ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ మిత్రుడు శ్రీధర్‌కు చెందిన ఈ–సెంట్రిక్‌ సొల్యూషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విశాఖపట్నంలో రూ.338 కోట్ల విలువైన 50 ఎకరాలను రూ.25 కోట్లకే అప్పగిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. 
- తిరుపతిలో కలిసిపోయిన కరకంబాడిలో (కడప–తిరుపతి రహదారికి ఆనుకుని) రూ.50 కోట్ల విలువైన 25 ఎకరాలను కేవలం రూ.4.88 కోట్లకే మంత్రి గల్లా అరుణకుమారి కుటుంబానికి చెందిన మంగళ్‌ ఇండస్ట్రీస్‌కు కట్టబెడుతూ 2015 నవంబరు 12న ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో గల్లా అరుణకుమారి మంత్రిగా ఉన్నప్పుడు ఈ భూమి కోసం ప్రయత్నించారు. అయితే, అప్పుడు కాని పని టీడీపీ అధికారంలోకి రాగానే జరిగిపోయింది. 
- కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వీబీసీ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌కు రూ.478.93 కోట్ల విలువైన 478.93 ఎకరాల భూమిని కేవలం రూ.4.78 కోట్లకే ప్రభుత్వం రాసిచ్చేసింది. వీబీసీ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ సంస్థ సీఎం చంద్రబాబు బంధువైన మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి కుటుంబానిది కావడం గమనార్హం. 
- రాజధాని అమరావతి ప్రాంతంలో వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (విట్‌)కు 200 ఎకరాలు, మాతా అమృతానందమయి విశ్వవిద్యాలయానికి 200 ఎకరాలు, ఎస్‌ఆర్‌ యూనివర్సిటీకి 200 ఎకరాలు, ఇండో యూకే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌కు 150 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ ఎకరా ధర రూ.5 కోట్లు పలుకుతుండగా, ప్రభుత్వం మాత్రం ఎకరా రూ. 50 లక్షల చొప్పున ఇచ్చేయడం గమనార్హం. విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసే విద్యా, వైద్య సంస్థలకు నామమాత్రపు ధరకు భూములు ఎందుకు కట్టబెట్టారనే ప్రశ్నకు సర్కారు వద్ద సమాధానం లేదు. అనధికారిక వాటాలు ఉన్నందువల్లే ప్రభుత్వ పెద్దలు అప్పనంగా భూములు కట్టబెట్టారనేది బహిరంగ రహస్యమే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement