murali mohan rao
-
సామాజిక సమతూకానికే పెద్దపీట!
ఏ ప్రభుత్వాధినేతకైనా మంత్రివర్గ కూర్పు, విస్తరణ, పునర్వ్యవస్థీకరణ అనేది కత్తిమీద సాము వంటిది. ఎంతోమంది ఆశావహులు, అర్హులమని భావించేవారు మంత్రిపదవి అనే పల్లకీ ఒక్కసారైనా ఎక్కాలని ఆశించడం సహజం. కానీ, ముఖ్యమంత్రికి మాత్రం ఎన్నో అవరోధాలూ, పరిమితులూ ఉంటాయి. అర్హులని తెలిసీ ఇవ్వలేని పరిస్థితి తలెత్తుతుంది. సామాజిక వర్గ ప్రాధాన్యతలు లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని సహచరులను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇటీవల సీఎం జగన్మోహన్రెడ్డి తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీక రించారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం మంత్రివర్గ సభ్యుల సంఖ్య ఇరవై ఐదుకు మించరాదు. కానీ ఆశావహులు అంతకు కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నారు. జగన్ ఎన్నుకున్న మంత్రి వర్గంలో బడుగు బలహీన వర్గాల వారికి సింహభాగం పదవులు దక్కాయి. సామజిక న్యాయం, సమతూకం పాటించడంలో జగన్ విజయులు అయ్యారని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. 70 శాతం పదవులు బలహీన వర్గాలవారికి దక్కడం స్వతంత్రం వచ్చాక ఇదే ప్రథమం! ఇక మంత్రివర్గ ప్రమాణస్వీకారం అయ్యాక అసంతృప్తులు బయటపడటం సహజమే. వైసీపీ విషయంలోనూ ఇదే జరిగింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు ఇదంతా టీ కప్పులో తుఫాను లాంటిది. వైసీపీ అన్నా, జగన్మోహన్ రెడ్డి అన్నా అడుగడుగునా విషం కక్కే పచ్చ మీడియాకు ఈ అసంతృప్తుల అలజడి విందుభోజనం లాంటిది. ఇలాంటి సంఘటనలేమీ మొదటి సారిగా జరగడం లేదు. అన్ని పార్టీల విషయంలో చాలాసార్లు జరిగినవే. కానీ, జగన్ మీద బురద చల్లడానికీ, పార్టీ నాయకులను రెచ్చగొట్టడానికీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూసే పచ్చమీడియా ఇలాంటి సంఘటనలు చూసి పండుగ చేసుకుంటోంది. ఏ పార్టీ అయినా కష్టపడే నాయకులను గుర్తిస్తుంది. వారికి న్యాయం చెయ్యాలనే ప్రయత్నిస్తుంది. కానీ అన్ని వేళలా అది సాధ్యం కాదు. టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై మందితో జంబో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ బలం నూటా ఎనభై. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు మంత్రి అయ్యారన్న మాట. ఈ మంత్రివర్గాన్ని చూసి అందరూ హేళన చేశారు. అలాంటి సంద ర్భంలో కూడా కొందరు తమకు పదవులు రాలేదని అలిగారు. అసంతృప్త నాయకులను బుజ్జగించడానికీ, సముదాయించడానికీ అధిష్ఠానం ప్రయత్నాలు చేయడమూ సహజమే. మొన్న మంత్రిపదవులు రాని వారిని బుజ్జగించడానికి సీఎం జగన్ కూడా స్వయంగా రంగంలోకి దిగారు. అలకలు పూనిన వారిని సముదాయించారు. దాంతో రెండు రోజుల్లోనే అసంతృప్తి చల్లారింది. అయితే ఎల్లో మీడియా మాత్రం పార్టీ మీద జగన్‌కు పట్టు లేదనీ, తిరుగుబాటు తప్పదనీ ప్రచారం చేసింది. పనిలో పనిగా చంద్రబాబు కూడా మంత్రిపదవులు రాని వారికి గేలం వేస్తున్నారని వార్తలు వినిపించాయి. (క్లిక్: ‘సోషల్ ల్యాబ్’ పని మొదలైంది) ఎవరైనా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. పార్టీకి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. క్రమశిక్షణ లేని రాజకీయ పార్టీలు మనుగడ సాగించలేవు. అధినేత నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీని ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ప్రజల అభీష్టాన్ని, తమ నాయకుడికి జనంలో ఉన్న విశ్వాస్వాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రత్యర్థులకు ఫలహారం కాకుండా పార్టీలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి. అవకాశాలు ఇవాళ కాకపొతే రేపు వస్తాయి. (క్లిక్: సామాజిక న్యాయంలో ఓ విప్లవం!) - ఇలపావులూరి మురళీ మోహనరావు సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
సమ్మే పరిష్కార మార్గమా? ఆలోచించండి!
మొత్తం మీద ఏపీలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య యుద్ధం మొదలైనట్లే తోస్తున్నది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని, ఉద్యోగ సంఘాలను విమర్శించలేం లేదా సమర్ధించలేం. తమ నిస్సహాయతను ప్రభుత్వం ఉద్యోగ సంఘాల వారికి తెలియజేసింది. ఉద్యోగ సంఘాలవారు తమకు అన్యాయం జరిగిందని అంటున్నారు. గతంలో మనం ఇలాంటి యుద్ధాలను ఎన్నో చూశాము. రేపు వాళ్ళు వాళ్ళు ఒకటైపోతారు. ఇవాళ తిట్టిన నోళ్లే రేపు జై కొడతాయి. ఇదేం కొత్త కాదు. మెరుగైన జీతాల కోసం ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యవచ్చు. సమ్మె చేసి తమ ఆందోళనా తెలియచేయవచ్చు. కానీ ఇటువంటి సమయాల్లో ప్రభుత్వ సారథులు కఠినంగా వ్యవహరిస్తే... కోర్టులు కూడా వారికే అండగా నిలిచిన ఉదాహరణలు చరిత్రలో కనిపిస్తున్నాయి. తమిళనాడు ఉద్యోగులు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగారు. జయలలిత ఆగ్రహించి లక్షా డెబ్భైవేల మంది ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించారు. దీంతో ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం సమ్మె అనేది ఉద్యోగుల హక్కు కాదని, ఉద్యోగులను డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, అయితే మానవీయ కోణంలో చూసి... డిస్మిస్ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని జయలలితకు సూచించింది. ఇక్కడ తమిళనాడు పభుత్వానికి కోర్ట్ సూచించిందే తప్ప దాని నిర్ణయాన్ని తప్పు పట్టి ఆదేశించలేదు. కోర్టు తీర్పుతో చేసేది లేక డిస్మిస్ అయిన ఉద్యోగులు అందరూ ప్రభుత్వానికి మళ్ళీ సమ్మె జోలికి వెళ్లబోమని లిఖిత పూర్వకంగా ఎవరికి వారు హామీ పత్రాలు ఇవ్వడంతో తిరిగి ఉద్యోగంలోకి తీసుకొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లినప్పుడూ వారికి చుక్కెదురైంది. సుమారు యాభైవేలమంది ఆర్టీసీ కార్మికులు రెండు నెలలపాటు సమ్మె చేసినపుడు కేసీఆర్ చాలా దృఢంగా వ్యవహరించారు. ప్రైవేట్ ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. బస్సు సర్వీ సులు ఆగకుండా చూశారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చెయ్యాలని కూడా ఒకదశలో కేసీఆర్ ప్రకటించినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కూడా పాల్గొన్న ఘట్టాలను గుర్తుంచుకుని... అంత తీవ్రచర్యకు పూనుకోలేదు. అలాగని మెత్తబడలేదు. ఆర్టీసీ కార్మికులు హైకోర్టుకు వెళ్లారు. సమ్మె సమస్య, డిమాండ్ల సమస్య లేబర్ కమిషనర్ చూసుకోవాలి తప్ప హైకోర్టు ఏమీ చెయ్యలేదని, లేబర్ కోర్టుకు వెళ్లండని హైకోర్టు స్పష్టం చెయ్యడంతో కార్మికులు డీలాపడి పోయి సమ్మె విరమించారు. ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పట్ల కనికరం చూపి... వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడమే కాకుండా సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లించింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్రెడ్డి ఎంతో ఉదారస్వభావం కలిగిన వ్యక్తి. కరోనా కష్టకాలంలో పేదలు ఆత్మహత్యలకు పాల్పడకుండా వారికి ఆర్థికసాయాలు అందించి ఆదుకున్న సంగతి తెలుసు. ఆర్థికంగా రాష్ట్రం బాగా దెబ్బతిని ఉంది. ఇలాంటి పరి స్థితుల్లో తాము సమ్మెబాట పట్టడం సబబేనా అని ఉద్యోగులు ఆలోచించుకోవాలి. (చదవండి: బీఎస్ఎన్ఎల్కు అన్యాయం...ప్రైవేటులో భాగస్వామ్యం!) ప్రభుత్వం కూడా ఉద్యోగుల న్యాయమైన కోరికలను తప్పకుండా పరిశీలిస్తామని, ఆర్థిక వెసులుబాటు కలిగినపుడు వారికి ప్రయోజనాలు అందిస్తామని చెప్పి ఉద్యోగులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో ఒక భాగం. కరోనా మహమ్మారి వంటి కీలక సమయాల్లో సమ్మెకు దిగితే ప్రజల్లో ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా వారు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. (చదవండి: వారూ, వీరూ ఎదుర్కొనే పీడన ఒక్కటే!) - ఇలపావులూరి మురళీ మోహనరావు సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
ఇంత బతుకూ బతికి...
అవును మరి! ఎక్కడి నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ! ఎక్కడి నందమూరి తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్!! తొమ్మిదినెలల కాలంలోనే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని ఊచకోత కోసి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జననేత ఎన్టీరామారావు. 1994లో రెండోసారి కూడా పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చిన ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరేలా టీడీపీ ఎమ్మెల్యేలను ఉసగొల్పి ఆయన సీఎం పోస్టుకే ఎసరు పెట్టిన చంద్రబాబు చరిత్ర జగద్విదితమే. ఆ తర్వాత చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ఉమ్మడి రాష్ట్ర ప్రజలు 2004 లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం అందించారు. వైఎస్సార్ అయిదేళ్ల పాలనతో సంక్షేమం, అభివృద్ధిని జోడుగుర్రాల్లా పరిగెత్తించడంతో 2009 ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోతామేమో అనే భయం పట్టుకుంది బాబుకు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ హిట్ మీద హిట్ తో అగ్రహీరోగా రాణిస్తున్నారు. చంద్రబాబు మరోసారి గతాన్ని పక్కనబెట్టి జూనియర్ ఎన్టీఆర్ కరిష్మాను పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు. తన తండ్రికి, తమ కుటుంబానికి చంద్రబాబు చేసిన నమ్మకద్రోహాన్ని విస్మరించి జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్రం మొత్తం పర్యటించి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసిపెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. టీడీపీకి అధికారం దక్కలేదు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి గ్లామరస్ హీరో ముందు తన కొడుకు లోకేశ్ నాయుడు వెలవెలబోతాడని అతి స్వల్పకాలంలోనే గ్రహించిన చంద్రబాబు క్రమక్రమంగా జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టసాగారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనల పొత్తు ప్రభావంతో వైసిపి కన్నా కేవలం ఒకటిన్నర శాతం ఎక్కువ ఓట్లతో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అమరావతి అనే ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి రాజధాని నిర్మాణం పేరుతో రాబోయే పాతికేళ్లు తనదే అధికారం అనే ఊహా లోకంలో తేలియాడారు. కానీ 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ దెబ్బకు కనీవినీ ఎరుగని విధంగా కుదేలైంది తెలుగుదేశం. అటు లోకేశ్‌ను చూస్తే మూడేళ్లు మంత్రిగా పనిచేసి, తన కలల రాజధాని ప్రాంతంలోనే ఘోరంగా ఓడిపోయారు. ఆ తరువాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాభవమే. (చదవండి: అబద్ధాలకు చెక్... అభివృద్ధితోనే!) చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక పార్టీకి భవిష్యత్తు లేదని కిందిస్థాయి నాయకులు జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెస్తున్నారు. బాబు సొంత నియోజకవర్గం కుప్పంలో బాబుముందే జూనియర్ రావాలి అంటూ నినాదాలు చెయ్యడమే కాక ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చెయ్యడంతో ఆయన కంగుతిన్నారు. ఆ తరువాత కుప్పం మునిసిపాలిటీల్లో టీడీపీ జెండా ఊడిపోయింది. బాబును 7 సార్లు అసెంబ్లీకి పంపిన కుప్పంలో మొదటిసారిగా టీడీపీ కుప్పకూలిపోయింది. చంద్రబాబుకు డెబ్బై ఏళ్ళు దాటాయి. లోకేష్ ఏమాత్రం ప్రతిభ చూపకపోవడంతో పార్టీలో చాలామందికి ఆయన నాయకత్వంమీద నమ్మకం పోయింది. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ రావాలని, పార్టీ పగ్గాలు చేబట్టాలని స్వరాలు వినిపిస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్యలాంటి సీనియర్ నాయకులు సైతం జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ గొంతులు విప్పుతున్నారు. ఇదే చంద్రబాబుకు కంటగింపుగా ఉంది. (చదవండి: తెలుగుదేశం విలాపం) తన సతీమణికి అవమానం జరిగిందన్న చంద్రబాబు రోదన ఆయన మనసెరిగినవారికి కలిసొచ్చింది. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఫలితమే జూనియర్ మీద విమర్శలు ప్రారంభించారు. మేనత్తకు అవమానం జరిగితే జూనియర్లో ఫైర్ ఎక్కడ అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాతగారు పెట్టిన పార్టీ పట్ల జూనియర్‌కు బాధ్యత లేదా అంటూ నిలదీస్తున్నారు! ఆ ఘట్టం ముగిసిన మూడు రోజులదాకా లోకేశ్ అసలు పెదవి విప్పిన దాఖాలానే లేదు. లోకేశ్లోనే లేని ఫైర్ జూనియర్‌కు ఎలా వస్తుందో అర్థం కాదు. (చదవండి: వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!) ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని చెరపట్టడంలో చంద్రబాబుకు సహకరించిన ఎన్టీఆర్ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్లు, అల్లుళ్ళు.. ఆ తరువాత చంద్రబాబు పాల్పడిన నమ్మకద్రోహానికి ఎలా బలయ్యారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు సహకరించిన తన తండ్రి హరికృష్ణకు, ఆ తర్వాత తన మామ చంద్రబాబు స్వయానా పొడిచిన వెన్నుపోటును జూనియర్ మర్చిపోవడం సాధ్యమేనా? - ఇలపావులూరి మురళీ మోహనరావు వ్యాసకర్త సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
సర్కారీ బడుల్లోనూ నాణ్యత సాధ్యమే!
విద్యారంగం వ్యాపారంగా మారి దాదాపు మూడు దశాబ్దాలు దాటింది. ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ విద్యారంగాన్నే ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను క్రమంగా నిర్వీర్యం చేశాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు మొదట్లో విశాలమైన స్థలంలో హంగు ఆర్భాటాలతో విద్యార్థులను ఆకర్షించి నాణ్యమైన విద్యను అందించడం వాస్తవం. కానీ, ఎప్పుడైతే విద్యాసంస్థల యజమానులు రాజకీయనాయకుల ప్రాపకం కోసం పార్టీలకు మహారాజ పోషకులుగా తయారయ్యారో అప్పటి నుంచి విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం మొదలైంది. (చదవండి: విశాఖపై ఇంత దుష్ప్రచారమా?) కార్పొరేట్ విద్యాసంస్థల దగ్గర లంచాలు తీసుకోవడం అలవాటు చేసుకున్న ప్రభుత్వాలు, పార్టీలు ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరచడం ప్రారంభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే చదువు రాదనే దురభిప్రాయం స్లో పాయి జన్లా తల్లితండ్రుల మెదళ్లలో జొప్పించడంలో ప్రభుత్వాలు, కార్పొరేట్ యాజమాన్యాలు సఫలం అయ్యాయి. విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ పదేళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల యజమానులు వారికి ఆర్థికంగా అండగా నిలబడ్డారంటారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి సర్కారు వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యా రంగంలో వ్యాపించిన జాడ్యాన్ని తొలగించడానికి భారీగా నిధులను వెచ్చించింది. సుమారు 36 వేలకోట్ల రూపాయలు ఖర్చుచేసి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కలుగజేసింది. మినరల్ వాటర్, ఆహ్లాదకరమైన రంగులు, ఖరీదైన ఫర్నిచర్, ఏసీలు, ఫాన్లు, శౌచాలయాలు, అన్నింటినీ మించి నాణ్యమైన మెనూతో భోజనం, పచ్చదనం మొదలైన సదుపాయాలు సమకూర్చింది. గత రెండేళ్లలో సుమారు 6 లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మళ్ళారు. ఇది నిజంగా హర్షణీయం. ఇక్కడే కొందరు రంధ్రాన్వేషకులు బయలు దేరారు. మౌలిక వసతులు కల్పిస్తున్నారు సరే, నాణ్యమైన విద్య ఎలా ఇస్తారు అంటూ నిలదీస్తున్నారు. కార్పొరేట్ రంగంలో నాణ్యమైన విద్య దొరుకుతుందని, ప్రభుత్వ రంగంలో లేదని వీరి అభిప్రాయం అన్నమాట! ప్రభుత్వరంగంలో ఉపాధ్యాయులను నియమించేటపుడు వారికి అనేక కఠిన పరీక్షలు పెడతారు. కార్పొరేట్ పాఠశాలల్లో అలా జరగదు. ఎవరు తక్కువ వేతనానికి పనిచేస్తామంటే వారిని నియమించుకుంటారు. విద్యార్హతలు కూడా కార్పొరేట్ రంగ ఉపాధ్యాయుల కన్నా ప్రభుత్వరంగ ఉపాధ్యాయులకే అధికంగా ఉంటాయి. ప్రభుత్వ కాలేజీలో డిపార్ట్మెంట్ హెడ్ కావాలంటే కచ్చితంగా డాక్టరేట్ చేసి ఉండాలి. ప్రభుత్వ బోధన సిబ్బందిని తక్కువ అంచనా వెయ్యడం అజ్ఞానం కారణంగానే! (చదవండి: అమెరికాకు తగ్గుతున్న భారత విద్యార్థులు.. ఎందుకంటే?) కార్పొరేట్ రంగం వైపు తల్లితండ్రులు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అని ప్రశ్నించుకుంటే అక్కడ లభిస్తున్న మౌలిక సదుపాయాలు, రంగుల హంగులు, ఆటస్థలాలు, పరికరాలు, రవాణా వసతి. అవే వసతులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా కల్పించగలిగితే విద్యార్థులను తప్పకుండా ఆకర్షించవచ్చు. నాణ్యమైన విద్యకు కొరత ఏమీ లేదు. కాకపొతే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ రంగ ఉపాధ్యాయులకు కూడా శిక్షణనివ్వడం అవసరం. ప్రభుత్వ విద్యారంగం మీద కూడా నిరంతర పర్యవేక్షణ ఉండాలి. కలెక్టర్లు, జిల్లా విద్యాధి కారులు విద్యాసంస్థల మీద కన్నువేసి ఉపాధ్యాయుల గైర్హాజరీలు, ఇతర వ్యాపారాల లాంటి వాటిమీద కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వ రంగంలో ఉత్తమ ఫలితాలు రాబడితే రాబోయే పదేళ్లలో కార్పొరేట్ కళాశాలలను కనుమరుగు చేసి తల్లితండ్రుల కష్టార్జితాన్ని మిగల్చవచ్చు. - ఇలపావులూరి మురళీ మోహనరావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు -
వైఎస్సార్ సీపీ బలాన్ని నిరూపించిన చంద్రబాబు
తాను అధికారంలో ఉన్న కాలంలో 2018లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ఊసు కూడా ఎత్తకుండా, ఇప్పుడు అవే ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఒత్తిడి తెచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలను ఎందుకు తెచ్చిపెట్టుకున్నానురా అని తీరికగా విచారిస్తూ ఉండివుంటారు! ఆయన భయం ఆయనది. తన కాలంలో నియమితులైన నిమ్మగడ్డ పదవీకాలం ఈ నెలా ఖరుతో ముగుస్తుంది. ‘మనవాడు’ ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్తే ఎన్నో కొన్ని పంచాయతీలైనా దక్కకపోతాయా అని ఆశ పడ్డారు. తీరా ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక మొత్తం స్థానాల్లో పాతిక శాతం వైసీపీకి ఏకగ్రీవాలు కావడంతో చంద్రబాబు గుండె గుభేలుమంది. ఆ దెబ్బకు ఠారెత్తిపోయి ఏమి మంత్రం ప్రయోగించారో గానీ అకస్మాత్తుగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ గారికి కరోనా భూతం కళ్ళముందు ప్రళ యతాండవం చేసింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేసి చేతులు దులుపుకున్నారు. అయితే మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యమం చేస్తుండటంతో చంద్రబాబులో మళ్ళీ సరికొత్త ఆశలు చిగురించాయి. జగన్ మీద వ్యతిరేకత ప్రబలిందని రంగుల స్వప్నాల్లో విహరించారు. ఎన్నికల కమిషనర్ చంద్ర బాబు సంగీతానికి అనుగుణంగా డ్యాన్సులు చెయ్యడం మొదలైంది. కరోనా పేరు చెప్పి ఎన్నికలను ఎక్కడ ఆపారో, అక్కడినుంచే మళ్ళీ మొదలుపెడతామని కోర్టుకు హామీ ఇచ్చిన సంగతిని నిర్లక్ష్యం చేసి కొత్తగా పంచాయితీ ఎన్ని కలకు నోటిఫికేషన్ ఇచ్చారు. నిజాయితీపరులైన ఉన్నతా ధికారులను అవమానిస్తూ, వారి ఉద్యోగ జీవితాన్ని కూడా సర్వనాశనం చెయ్యడానికి తెగించారు. వారి సర్వీస్ రికా ర్డుల్లో అభిశంసనను నమోదు చెయ్యాలని ఆదేశించారు. వారికి ఉద్యోగ విరమణకు సంబంధించిన ప్రయోజనాలు కూడా రావని బెదిరించారు. తన చిత్తానుసారం కలెక్టర్లను, ఎస్పీలను బదిలీ చేశారు. నిమ్మగడ్డ ఇస్తున్న ఇలాంటి ఆదేశాల వెనుక ఆడించే శక్తి ఏమిటో అందరికీ తెలుసు. తెలుగుదేశం అనుకూల పచ్చ మీడియా అయితే నిమ్మగడ్డ ఈ శతాబ్దపు టీఎన్ శేషన్ అనీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన విక్రమార్కుడనీ, ఆకాశానికి ఎత్తేసింది. పచ్చ విశ్లేషకులను కూర్చోబెట్టుకుని చంద్రబాబు గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోవడంతో జగన్ భయపడిపోతు న్నాడనీ, నిమ్మగడ్డ కీర్తి ఆచంద్రతారార్కం వెలిగిపోతుందనీ భజించడంలో మునిగితేలాయి. కరోనా టీకా కార్యక్రమానికి విఘాతం కలుగుతుందని ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు తల ఊపక తప్పలేదు. నిమ్మగడ్డ ఆదేశాలన్నీ రాజ్యాంగ విరుద్ధమని అందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రభుత్వం సంయమనంతో వ్యవహ రించింది. ‘కేంద్ర ఎన్నికల సంఘానికున్న అధికారాలన్నీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఉంటాయని’ సుప్రీంకోర్టు చేసిన ఒక వ్యాఖ్యను పట్టుకుని ఎన్నికల కోడ్ ముగిసేంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తన చెప్పు కింద తేలులా పడివుండాలని నిమ్మగడ్డ ఆశించారు. ప్రభుత్వం ఏనాడో ప్రకటించిన ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారు. ఇంటిం టికీ రేషన్ సరుకులను అందించే వాహనాల రంగులను మార్చాలన్నారు. చివరకు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చెయ్యాలనీ, ఆయన మీడియా ముందు మాట్లాడకూడదనీ ఆంక్షలు విధించారు. ఇవే ఆంక్షలను ఆ మరునాడు మరొక మంత్రి కొడాలి నానిమీద కూడా విధించారు. ఇల్లిల్లూ తిరిగి ప్రజలకు పింఛన్ అందించే వలంటీర్ల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. విశేషం ఏమిటంటే, ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే వరకు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పులు ఇచ్చిన హైకోర్టు, ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక నిమ్మగడ్డ ఇస్తున్న ఆదేశాలను ఏమాత్రం ఆమోదించలేకపోయింది. నిమ్మగడ్డ నిరంకుశ ఆదేశాలు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి ఆటంకంగా ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయ పడటంతో కథ అడ్డం తిరిగింది. నిమ్మగడ్డ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని కోర్టులు కొట్టేశాయి. మంత్రుల నిర్బంధం నుంచి వలంటీర్ల ఫోన్ల వరకు నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలన్నీ చెల్లని కాసులుగా తేలిపోయాయి. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడమే ఎన్నికల సంఘం విధి తప్ప వారికి అంతులేని అధికారాలేవీ రాజ్యాంగం ప్రకారం లేవని స్పష్టం చేసినట్లయింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతోనే తెలుగుదేశం సత్తా ఏమిటో వెల్లడయింది. పంచాయతీ ఎన్నికలకు కూడా మేనిఫెస్టోను విడుదల చేసి ఎన్నికల చరిత్రను తిరగరాసింది తెలుగుదేశం. ఆ మేనిఫెస్టో రాష్ట్రం మొత్తం చేరిపోయాక తీరి కగా దాన్ని రద్దు చేస్తున్నట్లు నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ మీద తెలుగుదేశం తరపున కాకి వెళ్లి కబురు చేసినా ఆగమేఘాలమీద చర్యలు తీసుకున్న నిమ్మగడ్డ... తెలుగుదేశం మీద వైసీపీ నాయకులు వెళ్లి ఫిర్యాదులు చేసినా నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించారు. అయినప్పటికీ ఎనభై శాతం పంచాయతీలు వైసీపీ పరం కావడంతో తెలుగుదేశం కూసాలు కదిలిపోయి నట్లయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పంచా యతీ ఎన్నికల్లో శృంగ భంగం కాగానే మునిసిపల్ ఎన్నికల్లో అయినా తమ ప్రతాపాన్ని చాటాలని ఎన్ని యుక్తులు పన్నినప్పటికీ వాటిల్లోనూ అధికభాగం ఇప్పటికే వైసీపీ ఖాతాలోకి చేరిపోయాయి. కొన్ని చోట్ల అయితే తెలుగుదేశం పార్టీకి ఒక్క వార్డు కూడా దక్కలేదు. మరీ ఘోరం ఏమి టంటే మొన్నటిదాకా తిరుగు లేని అధికారాన్ని చలాయించిన టీడీపీ తరపున నామినేషన్లు వెయ్యడానికి అభ్యర్థులు కూడా దొరకలేదు! ఇప్పుడు వచ్చిన మునిసిపల్ ఫలితాలను చూశాక చంద్రబాబునాయుడుకు భవిష్యత్ దర్శనం బహు బాగా అయ్యుంటుంది. రాష్ట్రంలోని డెబ్బై అయిదు మునిసి పాలిటీల్లో తెలుగుదేశం పార్టీకి ఒక్కటి కూడా దక్కే అవకాశం కనిపించడం లేదు. అలాగే కార్పొరేషన్లు కూడా! ఈ ఫలితాల వలన తెలుగుదేశం గత రెండేళ్లలో రవ్వంత కూడా పుంజు కోలేదనీ, పైగా ఇంకా అణిగిపోయిందనీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాభవం గత అసెంబ్లీ ఎన్నికలకన్నా మరింతగా పెరిగిందనీ విస్పష్టంగా ప్రజలకు తెలిసిపోయింది. అనవస రంగా వైసీపీ బలం తగ్గలేదని ఎందుకు నిరూపించానా అని చంద్రబాబు ఇప్పుడు అంతర్మథనానికి గురి అవుతుం టారు! ఏం చేస్తాం మరి? చేసుకున్న వారికి చేసుకున్నంత అని పెద్దలు చెప్పారు కదా! ఇలపావులూరి మురళీమోహనరావు వ్యాసకర్త సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
విలాసాలకు కళ్లెం వేసిన కరోనా
ప్రజల మనస్తత్వాలను అంచనా వేయాలంటే ఇకమీదట కరోనాకు ముందు, కరోనాకు తరువాత అని లెక్కేయ్యాల్సి ఉంటుంది. చైనాలో పుట్టి ప్రపంచం మొత్తం విస్తరించి సుమారు ఎనిమిది లక్షలమంది ప్రాణాలను హరించిన కోవిడ్–19 ప్రజలకు కొన్ని విలువైన పాఠాలను నేర్పింది. ముఖ్యంగా అనేకమంది జీవనశైలిలో ఊహించనంత మార్పును తీసుకొచ్చింది. విశ్వవిద్యాలయాలలో కూడా బోధించని అనేక విలువైన ఆర్థిక గుణపాఠాలను నేర్పించింది. మొన్నమొన్నటిదాకా కోటీశ్వరుల నుంచి మధ్యతరగతివారి వరకూ వీకెండ్ అనేది ఒక పెద్ద పండుగ లాంటిది. ఎప్పుడెప్పుడు శనివారం వస్తుందా అని గురువారం నుంచే ఎదురు చూసేవారు. నలుగురు సభ్యులున్న కుటుంబం కూడా శుక్రవారం రాత్రి నిద్రపోకుండా ఎపుడెపుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసేవారు. కానీ, ఈ విలాసాలపై కరోనా భూతం తన పంజా విసిరింది. దీని దెబ్బకు ప్రపంచమే స్తంభించిపోయింది. రెండు దేశాల మధ్య యుద్ధాలో, రాష్ట్రాల్లో ఎక్కడైనా మతకల్లోలాలో, విధ్వంసకాండలు చెలరేగినపుడు కూడా నిర్విరామంగా పనిచేసిన సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, ప్రయాణ సాధనాలు మొత్తం మూసుకునిపోయాయి. ఫలితంగా లక్షలాదిమంది తమ ఉపాధిని కోల్పోయారు. మధ్యతరగతివారి జీవి తాలు మాత్రమే కాదు, ఎగువ మధ్యతరగతివారు కూడా ఒక్కసారి కుదేలైపోయారు. ఆఫీసులు మూతపడిపోవడం, చేయడానికి పనిలేకపోవడం, జీతాల్లో కోతలు పడటం. ఉద్యోగాలు పోవడం, ఉన్న ఉద్యోగాలు కూడా ఎప్పుడు పోతాయో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొనడంతో ఒక్కసారిగా జనజీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. డబ్బు విలువ ఏమిటో ప్రతి ఒక్కరికీ అర్థం అయింది. ఆదాయం కోల్పోయినా, బ్యాంకులకు ఈ నెలసరి వాయిదాలు కట్టక తప్పదు కదా! ఇప్పటివరకు ఏదో దాచుకున్న డబ్బుతో ఎలాగో నెట్టుకుంటూ వచ్చారు. కానీ, ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే అప్పుడు కర్తవ్యం ఏమిటి అనే స్పృహ ప్రతి ఒక్కరిలో భయాన్ని కలిగిస్తున్నది. కరోనా నివారణకు రాబోయే డిసెంబర్ వరకూ వ్యాక్సిన్ లేదా నివారణ లభించే సూచనలు కనిపించకపోవడంతో ఉద్యోగులు, వ్యాపారులతో పాటు చిరు ఆదాయాలమీద జీవించేవారు కూడా పొదుపు మంత్రం పఠిస్తున్నారు. ముఖ్యంగా అన్ని విలాసాలకు కత్తెర వేసుకుంటున్నారు. పెద్ద పెద్ద మాల్స్ తెరిచి నెలరోజులు దాటినప్పటికీ, అక్కడ వినియోగదారులు చాలా పలుచగా కనిపిస్తున్నారు. అత్యంత అవసరం అయితే తప్ప విందులు విహారాలకు వెళ్లడం లేదు. పుట్టినరోజు లని, పెళ్లిరోజులని బంధుమిత్రులని పిలిచి పెద్ద ఎత్తున పార్టీలు ఇవ్వడం ప్రస్తుతానికి ఆగిపోయింది. వివిధ రాష్ట్రాల మధ్యన రాకపోకలు అనుమతించబడినప్పటికీ, ఊరు విడిచి వెళ్ళడానికి సాహసించడం లేదు. ఒకప్పుడు ఆన్లైన్లో ఎడాపెడా ఆర్డర్స్ ఇచ్చినవారు కూడా, ఈ వస్తువు మనకు అవసరమా కాదా? అని ముందుగా ప్రశ్నించుకుంటున్నారు. గత ఆరు నెలలుగా కరోనా వలన తాము ఎంత పొదుపు చెయ్యగలిగామో లెక్కలు వేసుకుంటున్నారు మరికొం దరు. నెలకు నాలుగు సినిమాలు, నాలుగుసార్లు రెస్టారెంట్స్‌కు వెళ్లడం, నెలకొకటైనా దూరప్రయాణం, పూర్తిగా అరికట్టబడిన కొనుగోళ్లు లాంటివాటి వలన మధ్యతరగతి జీవులకు నెలకు కనీసం పదివేల రూపాయలైనా మిగిలి ఉంటాయి. ప్రతి చిన్న సుస్తీకి ఆసుపత్రికి వెళ్లడం తగ్గించడం వలన వేలరూపాయలు పొదుపయింది. అప్పటివరకు డాక్టర్లు చెప్పినా కూడా వినకుండా మద్యపానం, ధూమపానం చేసినవారు కరోనా పుణ్యమా అని భయంతో కొంత, అవి అందుబాటులో లేకపోవడంతో కొంత ఆ అలవాట్లను మానేశారు. మానవాళికి కరోనా చేసిన అతి పెద్ద మేలు ఇది. అలాగే నగరం మధ్యలో నెలకు పదిహేను వేలు, ఇరవై వేలు అద్దె చెల్లించి ఖరీదైన అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నవారు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి నగర శివార్లకు వెళ్లిపోయారు. నగరంలో జీవించలేము అనుకునేవారు సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. ఫలితంగా నగరాల్లో ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక భవిష్యత్తులో మళ్ళీ పూర్వవైభవం వచ్చినా, మధ్యతరగతి జీవులు విలాసాల జోలికి వెళ్ళడానికి సాహసించడం కష్టమే. ముఖ్యంగా వచ్చిన దానిలో భవిష్యత్తు కోసం కొంచెం దాచుకోవాలి అనే పెద్ద పాఠం కరోనా మహమ్మారి మానవులకు నేర్పిందని చెప్పుకోవాలి. దేన్నైనా పాజిటివ్ కోణంలోనుంచి పరి శీలిస్తే కొన్నైనా మంచి గుణాలు కనిపించకపోవు! ఇలపావులూరి మురళీ మోహనరావు వ్యాసకర్త సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
సాక్షి సీనియర్ జర్నలిస్టు మురళీమోహన్రావు హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్: సాక్షి సీనియర్ జర్నలిస్టు పులిపాక మురళీ మోహన్‌రావు(57) ఆదివారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ అత్తాపూర్‌లో నివాసముంటున్న ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే ఆయన మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన మురళీమోహన్రావు గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పనిచేశారు. ప్రస్తుతం సాక్షి దినపత్రికలో రీజియన్ డెస్క్‌లో చీఫ్ సబ్ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నారు. మురళీమోహన్‌రావుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆయన మరణవార్త తెలియగానే సాక్షి సిబ్బందిలో విషాదం నెలకొంది. సాక్షి ఎడిటర్ వర్దెల్లి మురళీతోపాటు సహచర ఉద్యోగులు, సిబ్బంది కేర్ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మురళీమోహన్రావు హఠాన్మరణం పట్ల జర్నలిస్టు సంఘాలు ప్రగాఢ సంతాపం తెలిపాయి. అత్తాపూర్‌లోని సంగం స్మశాన వాటికలో సోమవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.