మాట్లాడనివ్వకుంటే సభకు మేమెందుకు?
శాసనసభను ఒకరోజు బహిష్కరించిన ప్రతిపక్షాలు
- స్పీకర్ ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్నారని ధ్వజం
- అధికారపక్షం ఇష్టారాజ్యంగా అసెంబ్లీ నడుస్తోందని మండిపాటు
- స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాసిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం
సాక్షి, హైదరాబాద్: అధికారపక్షం కనుసన్నల్లో, ఏకపక్షంగా శాసనసభను నడుపుతూ, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే సభకు రావడం ఎందుకంటూ ప్రతిపక్షాలు శాసన సభను బహిష్కరించాయి. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా ఒక రోజు శాసనసభను బహిష్క రిస్తున్నామంటూ కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీ ఎం పార్టీలు శాసనసభ స్పీకర్ మధుసూదనా చారికి గురువారం లేఖలు రాశాయి. సభలో వివిధ అంశాలపై చర్చ సందర్భంగా ముఖ్య మంత్రి, మంత్రులు, అధికారపక్ష సభ్యులకు మాత్రమే అవకాశం ఇస్తూ ప్రతిపక్షపార్టీల సభ్యులను పట్టించుకోవడంలేదంటూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఎంలు వేర్వేరుగా స్పీకర్‌కు లేఖలు రాశాయి. సీఎల్పీనేత కె.జానారెడ్డి, కాంగ్రెస్ సభ్యులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెం కటరెడ్డి, జి.చిన్నారెడ్డి, డి.కె.అరుణ, పద్మావతి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్ తదితరులు స్పీకర్‌కు లేఖను అందజేశారు. అలాగే టీటీడీపీ నేత ఎ.రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అలాగే.. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కూడా విడిగా తన లేఖలను అందించారు. అనంతరం మీడియా పాయింట్ దగ్గర వేర్వేరుగా మాట్లాడారు.
టీఆర్‌ఎస్ ప్రచారం కోసమే శాసనసభా?: కాంగ్రెస్
టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారానికి శాసనసభను వేదికగా వాడుకుంటూ, సభను టీఆర్‌ఎస్ కార్యాలయంగా మారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కాంగ్రెస్ సభ్యులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్ర మార్క, టి.జీవన్‌రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ ఏకపక్షంగా వ్యవహ రిస్తున్నారని, తమ వాదన వినాలని ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించు కోక పోవడంతోనే సభా కార్యక్రమాలను ఒకరోజు బహిష్కరిస్తున్నామని తెలిపారు. సీఎం శాసనసభలో పచ్చి అబద్ధాలను మాట్లాడు తున్నారని విమర్శించారు. భూనిర్వాసితు లకు పదిరెట్లు నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. భూసేకరణ చట్టం ఆమోదం పొందినట్టుగా చెబుతున్నా రని, దానిపై వాస్తవాలను దాచిపెడుతున్నా రని ఉత్తమ్ విమర్శించారు.
భూసేకరణ బిల్లుకు సవరణో, కొత్త చట్టమో ఎవరికీ తెలియదన్నారు. బిల్లుపై స్పీకర్ దగ్గర కూడా వాస్తవాలు లేకపోవడం దురదృష్టకరమ న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ కార్యదర్శి కలసి సభను తప్పుదోవ పట్టిస్తు న్నారని, ఇది దారుణమని జీవన్‌రెడ్డి విమర్శించారు. సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. 2013 భూసేకరణ చట్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచితంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. పార్ల మెంటు చేసిన చట్టంపై కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడారని అన్నారు. సభా సాంప్రదా యాలను, నిబంధనలను స్పీకర్ పాటించడం లేదన్నారు.
టీఆర్‌ఎస్ కనుసైగల మేరకే..
స్పీకర్‌పై రేవంత్, సండ్ర ధ్వజం
టీఆర్‌ఎస్ పార్టీ కనుసైగల మేరకు నడుచు కుంటూ, శాసనసభ స్పీకర్ తమకు మాట్లాడటానికి మైక్ ఇవ్వకుంటే ఇంకా సభలో తామెందుకు అని టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నిం చారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా సభ నడవడం లేదన్నారు. భూసేకరణ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ అభిప్రాయాలను చెప్పడానికి కూడా మైక్ ఇవ్వలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షపార్టీల అభిప్రాయాలను, వైఖరిని కూడా చెప్పే అవకాశం ఇవ్వకుండా బిల్లును ఆమోదిం చినట్టుగా శాసనసభ స్పీకర్ ప్రకటిస్తే ప్రజా స్వామ్యానికి, శాసనసభకు గౌరవం ఎలా ఉంటుందన్నారు. బాధతోనే శాసనసభకు హాజరుకాకుండా బహిష్కరిస్తున్నామని రేవంత్‌రెడ్డి, సండ్ర తెలిపారు.