చర్లలో టీఆర్‌ఎస్ నాయకుల ఎన్నికల ప్రచారం
సాక్షి, చర్ల: భద్రాచలం నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. తమ అభ్యర్థిని గెలిపించాలంటే తమ అభ్యర్థినే గెలిపించాలంటూ రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. ఓ పక్క ఎండలు మండిస్తుండగా, మరో పక్క నేతలు ఎండను లెక్క చేయకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రస్తుతం కొనసాగిస్తున్న కల్యాణలక్ష్మి, మిషిన్ భగీరధ, మిషిన్ కాకతీయ, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, వ్యవసాయానికి పంట సాయం, ఆసరా పించన్లు తదితర సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తోంది.
బీజేపీ కేంద్రంలో అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ పంపిణీ, పంటసాయం, ప్రదానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనా పథకం, ప్రదానమంత్రి సురక్షా యోజనా పథకం, దీన్ ధయాల్ ఉపాద్యాయ గ్రామ జ్యోతి యోజనా తదితర పథకాలను వివరిస్తూ బీజేపీ నాయకులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో పంట రుణాలను రద్దు చేస్తామని ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ తదితర పథకాల గురించి ప్రచారం చేస్తూ ఉంటే వామపక్షాలు మాత్రం స్థానిక సమస్యలపై ఇప్పటి వరకు చేసిన పోరాటాలు, భవిష్యత్తులో చేపట్టబోయే పోరాటాల గురించి వివరిస్తూ గ్రామాల్లోకి దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న పార్టీలు ఓటర్లను పలు విధాలుగా ప్రసన్నం చేసుకునేందుకు ఈ క్రమంలో ప్రలోబాలకు గురి చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment