సాక్షి, ఖమ్మం: లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి సుమారు 22 రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చింది. దీంతో ఆయా రాజకీయ పక్షాలు వివిధ రూపాల్లో తమ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక ఈసారి కొంత ఆలస్యం కావడంతో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారం సైతం ఆలస్యంగానే ప్రారంభమైంది. మార్చి 18వ తేదీన ఖమ్మం ఎంపీ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి.. అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
అయితే వివిధ రాజకీయ సమీకరణల కారణంగా ప్రధాన రాజకీయ పక్షాలు తమ అభ్యర్థులను ఈసారి దాదాపు ఒకేసారి ప్రకటించాయి. ఆయా పార్టీల అభ్యర్థులు సైతం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అయిన మార్చి 25న నామినేషన్లు దాఖలు చేశారు. సీపీఐ మద్దతుతో పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి బి.వెంకట్ మాత్రం మార్చి 22న నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో సీపీఎం అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు ప్రసంగించడంతో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో తొలి ఎన్నికల ప్రచార సభ ప్రారంభమైనట్లయింది.
మార్చి 26 నుంచి ఉధృతమైన ప్రచారం
ప్రధాన రాజకీయ పక్షాలన్నీ మార్చి 26వ తేదీ నుంచి తమ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఒకవైపు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూనే.. మరోవైపు సమాజాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి సామర్థ్యాలున్న తటస్థులు, సామాజిక సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, మహిళా సంఘాలతో సమావేశాలు, ఇష్టాగోష్టి నిర్వహించడం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖమ్మంలో ఎన్నికల బహిరంగ సభ నిర్వహించగా.. బీజేపీ అభ్యర్థి దేవకి వాసుదేవరావు విజయాన్ని కాంక్షిస్తూ కేంద్ర మంత్రి పురుషోత్తం రూప్లా తదితరులు ఎన్నికల ప్రచారం, బహిరంగ సభల్లోనూ పాల్గొన్నారు.
ఇక కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి విజయాన్ని కాంక్షిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ, సీనియర్ నేత వి.హన్మంతరావు, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు, తెలంగాణ జనసమితి, జనసేన, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం పూర్తి కావడంతో ఇక ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పోలింగ్ తేదీ నాటికి పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుందంటే.. తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్న ప్రధాన రాజకీయ పక్షాలు ఆయా ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి ఖమ్మం నియోజకవర్గంలో జాతీయ స్థాయి నేతలతో బహిరంగ సభలు నిర్వహించలేదు. నియోజకవర్గ స్థాయిలో ప్రచారం వైపే ఆ పార్టీ మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పోలింగ్‌కు ఒకే ఒక్కరోజు గడువు ఉండడంతో నియోజకవర్గాలవారీగా ఆయా రాజకీయ పక్షాలు, పోటీ చేస్తున్న అభ్యర్థులు సమీక్షలు నిర్వహిస్తూ.. ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనే అంశంపై ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment