పార్టీ కేడర్‌పై నిఘా.. | All Parties Surveillance For 2019 Elections In Khammam | Sakshi
Sakshi News home page

పార్టీ కేడర్‌పై నిఘా..

Published Fri, Apr 5 2019 10:19 AM | Last Updated on Fri, Apr 5 2019 10:20 AM

All Parties Surveillance For 2019 Elections In Khammam - Sakshi

సాక్షి, బూర్గంపాడు: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అయా రాజకీయపార్టీల తమ కేడర్‌ కదలికలపై నిఘా పెట్టాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు తమ పార్టీలోనే ఉంటు అవతల పార్టీలకు కోవర్టులుగా ఉన్న నాయకులపై నిశితంగా దృష్టి పెట్టారు. అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికలలో అయా పార్టీల కేడర్‌ ఉత్సాహంతో పనిచేసింది. పార్లమెంట్‌ ఎన్నికల గడువు సమీపిస్తున్నప్పటికీ టీడీపీ, కాంగ్రెస్‌ కేడర్‌లలో పెద్దగా స్పందన కనిపించటం లేదు. మండల స్థాయిలో ముఖ్యనాయకులే మొక్కుబడిగా ప్రచారం సాగిస్తున్నారు. పినపాక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ కేడర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు వర్గం కూడా టీఆర్‌ఎస్‌లో చేరింది. ఈ రెండువర్గాల మధ్య సమన్వయం చేయటానికి ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చొరవ తీసుకున్నారు.

అయితే కిందిస్థాయిలో ఈ రెండువర్గాలు కలిసి పనిచేసేందుకు ఒకింత ఇబ్బందికర పరిస్థితులున్నాయి. కొందరు నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో మాత్రం రెండువర్గాలు ఐక్యంగా పనిచేస్తున్నట్లు కనిపించటం లేదు. గ్రామపంచాయతీ ఎన్నికలలో ఈ రెండువర్గాలు పోటాపోటీగా తలపడ్డాయి. కొన్ని గ్రామాలలో గొడవలు జరిగి పోలీస్‌స్టేషన్‌లలో కేసులు పెట్టుకున్నారు. ఇప్పటికీ కేసులలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
 


 

ఈ పరిస్థితులలోనే ఇరువర్గాలు కలిసి పనిచేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రెండునెలల వ్యవధిలోనే కలిసి పనిచేసేందుకు కొందరు నాయకులు సుముఖంగా లేరు. కొందరు నాయకులు కలిసి పనిచేస్తున్నప్పటికీ కొందరు నాయకులు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాలోత్‌ కవిత గెలుపు కోసం పార్టీ ముఖ్యనాయకులు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నా... క్షేత్రస్థాయిలో ఐక్యత కనిపించటం లేదు. ఈ పరిస్థితులను పసిగట్టిన పార్టీ అధి ష్టానం కేడర్‌ కదలికలపై దృష్టి పెట్టింది. కోవర్టులను గుర్తించి వారికి చెక్‌ పెట్టేందుకు నిశితంగా దృష్టి పెట్టారు. 

ఇక కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి కూడా ఇందుకు ఏమాత్రం తీసిపోలేదు. పార్టీలో కొనసాగుతున్న కొందరు నాయకులు టీఆర్‌ఎస్‌  కోవర్టులుగా పనిచేస్తున్నారనే సమాచారంతో పార్టీ ముఖ్యనేతలు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్, టీడీపీ కేడర్‌ను సమన్వయం చేసి మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌ ఉవ్విళ్లూరుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement