ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ సామాజిక అంశాలను విస్మరించి చర్చ కొనసాగించడం ఎంత వరకు సమంజసమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు ప్రశ్నించారు.
నకిరేకల్ : ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ సామాజిక అంశాలను విస్మరించి చర్చ కొనసాగించడం ఎంత వరకు సమంజసమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు ప్రశ్నించారు. నకిరేకల్‌లోని నర్రా రాఘవరెడ్డి స్మారక భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధిఫై సుదీర్ఘంగా చర్చ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతాంగం పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ఎద్దేవా చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఇటీవల కాలం నుంచి తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన మహాజన పాదయాత్రలో వందలాది గ్రామాల మీదుగా 2వేల కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగిందని తెలిపారు.
ఈ పాదయాత్రలో ప్రజలు తమ సమస్యలపై ఆవేదన, ఆందోళనలను వెలిబుచ్చారన్నారు. పెద్దనోట్ల రద్దుతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు బోళ్ల నర్సింహారెడ్డి, కందాళ ప్రమీళ, బచ్చుపల్లి నర్సింహారావు, వంటెపాక వెంకటేశ్వర్లు, సాకుంట్ల నర్సింహ, ఎస్‌కే అమీర్‌పాషా, ఏర్పుల తాజేశ్వర్, లఘుశెట్టి శ్రీను, కనుకుంట్ల సుదీర్‌రెడ్డి, తీగల వెంకన్న, ఆర్. ఇందిర, దుర్గం మేగాత్ర, కందుకూరి రాంబాబు తదితరులు ఉన్నారు.