‘రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా’
‘రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా’
Published Mon, Feb 13 2017 4:34 PM | Last Updated on Fri, Mar 22 2019 3:19 PM
హైదరాబాద్: ముడుపుల కోసమే మంత్రి జూపల్లి కృష్ణారావు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పంపు హౌస్ డిజైన్ మారుస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్ట్ కాంట్రాక్టు దక్కించుకున్న నవయుగ కంపెనీకి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు పంప్‌హౌస్ డిజైన్ మార్చవద్దని నివేదించినప్పటికీ నాలుగో కమిటీ వేసి డిజైన్ మారుస్తున్నారని తెలిపారు. ఈ మార్పు వల్ల సర్కారుపై అదనంగా వెయ్యి కోట్లు భారం పడుతుందని చెప్పారు.
ఆ కంపెనీ నుంచి మంత్రి జూపల్లి కి రూ. 50 కోట్లు ముడుపులు ముట్టాయని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. పంప్ హౌస్ డిజైన్ మార్పు సరికాదన్న నిపుణుల కమిటీ రిపోర్టులపై మంత్రి జూపల్లి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆ రిపోర్టులు తప్పని మంత్రి రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని తెలిపారు. బహిరంగ చర్చ తేదీని, వేదికను మంత్రి జూపల్లే ఖరారు చేయాలని అన్నారు.
Advertisement