అవార్డును ప్రదానం చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
సాక్షి, హైదరాబాద్: నగరీకరణతో రోజురోజుకూ కాలుష్యం తీవ్రంగా పెరుగుతోందని, దానిని తగ్గించేందుకు పర్యావరణహిత చర్యలు చేపట్టాలని ‘66వ నేషనల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’సదస్సు అభిప్రాయపడింది. ముఖ్యంగా వాతావరణ మార్పులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అందుకు తగిన విధానాలు రూపొందించాలని సూచించింది. నగరంలోని ఓ హోటల్‌లో రెండు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించారు. నగరాల్లో ప్రజల జీవనం మెరుగ్గా ఉండేందుకు, కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు నీటి వనరుల్ని రక్షించుకోవాలని, ప్రజారవాణాను ప్రోత్సహించాలని సూచించింది. ఇందుకుగానూ పలు సిఫార్సులు చేసింది.
దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలి..: వాతావరణ మార్పుల్ని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు, భూవినియోగం, పబ్లిక్ స్థలాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని, నీరు, విద్యుత్ తదితరమైన వాటిని రీసైకిల్ చేయడంపై దృష్టి సారించాలని ఈ సదస్సు సూచించింది. ప్రజా రవాణా వాహనాలు గ్రీన్‌ఫ్యూయల్స్‌ను వినియోగించేలా చేయాలని పేర్కొంది. ఏవైనా విపత్తులు సంభవిస్తే ఎక్కువగా నష్టపోయేది పేదలే కనుక వారిని రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
ఇందుకుగానూ విపత్తులకు అవకాశం లేకుండా మాస్టర్‌ప్లాన్లలో తగిన మార్పులు చేయాలని సూచించింది. దీర్ఘకాలిక పర్యావరణ పరిరక్షణకు ప్రణాళికలు రూపొందించాలని సిఫార్సు చేసింది. నగరాల్లో చెరువులు, సరస్సులు పరిరక్షించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, కబ్జాల పాలైన చెరువులకు పునరుజ్జీవం కలిగించేందుకు టీడీఆర్ వంటివి అమలు చేయాలని సూచించింది. 70 శాతం విద్యుత్‌ను వినియోగిస్తున్న నగరాల నుంచి 80 శాతం గ్రీన్‌హౌస్ వాయువులు వెలువడుతున్నాయని, ఈ పరిస్థితిని నివారించేందుకు నగర స్థాయిలో వాతావరణ మార్పులకు సంబంధించిన విధానాలు రూపొందించాలని పేర్కొంది. అవసరాన్ని బట్టి కొత్త బైలాస్ రూపొందించాలని సూచించింది. ఈ సదస్సుకు 22 రాష్ట్రాల నుంచి 400 మందికిపైగా టౌన్, కంట్రీప్లానర్లు, ప్రొఫెసర్లు హాజరయ్యారని రాష్ట్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్, ఇండియా(ఐటీపీఐ) అధ్యక్షుడు ఎస్.దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సదస్సులో అర్థవంతమైన చర్చలు జరిగాయని, ఈ సదస్సు సిఫార్సులు ఉపకరించగలవన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
పర్యావరణహిత డిజైన్లు రూపొందించాలి
తెలంగాణ ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అంకితభావంతో పనిచేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం జరిగిన టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లోనూ పర్యావరణహిత ప్రణాళికతో కూడిన డిజైన్లు రూపొందించాలని సూచించారు. భావితరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని, ఇందులో భాగంగానే ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రాన్ని గ్రీన్ స్టేట్‌గా మారుస్తోందన్నారు. కార్యక్రమంలో భాగంగా వీఎన్ ప్రసాద్ నేషనల్ బెస్ట్ థీసిస్ అవార్డును మహత్ అగర్వాల్, ప్రొఫెసర్ డాక్టర్ డీఎస్ మేష్రం నేషనల్ బెస్ట్ థీసిస్ అవార్డును శశాంక్ వర్మ, ఫయాజుద్దీన్ మెమోరియల్ అవార్డును అజయ్ అందుకున్నారు.
– మంత్రి జూపల్లి కృష్ణారావు
Comments
Please login to add a commentAdd a comment