35 లక్షల మందికి పింఛన‍్లు: జూపల్లి
Published Tue, Mar 21 2017 12:21 PM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM
హైదరాబాద్ : రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు ఇస్తున్నామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ 35 లక్షల మందికి పైగా పింఛన్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం మానవీయకోణంలో ముందుకెళ్తున్నామని చెప్పారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఏప్రిల్ నుంచి ఒంటరి మహిళలకు పింఛన్లు చెల్లిస్తామని ప్రకటించారు.
వికలాంగుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ బోర్డులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 9.33 లక్షల మంది వికలాంగుల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీరిలో 6.37 లక్షల మంది అర్హులుగా నిర్ధారించామని.. వీరందరికీ పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో తపాలా సేవల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. కొత్తగా వచ్చిన దరఖాస్తులనూ పరిగణనలోకి తీసుకుని పింఛన్లు చెల్లిస్తున్నామని తెలిపారు.
Advertisement