ఆన్‌లైన్‌లో హస్తకళల మార్కెటింగ్
సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ అమెజాన్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ వ్యాపార సంస్థలతో హస్తకళల సంస్థను అనుసంధానిస్తామని వాణిజ్య, పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానం ద్వారా తెలంగాణ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సాహం, గుర్తింపు లభించేలా చూస్తామన్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థను మంత్రి గురువారం సందర్శించారు. సంస్థ షోరూంలో ఉన్న నిర్మల్ తదితర హస్తకళా ఉత్పత్తులను మంత్రి పరిశీలించారు.
ప్రస్తుతం హస్తకళల విక్రయాలు, షోరూంలు రాష్ట్రంలో మూడు నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యాయన్నారు. ఆన్‌లైన్ విక్రయాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో దళారీల ప్రమేయం లేకుండా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
వృత్తి కళాకారులకు ప్రోత్సాహం...
హస్తకళలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చేతి వృత్తి కళాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు. హస్తకళలకు గిరాకీ పెంచేందుకు యాదాద్రి, భద్రాచలం, హైటెక్స్, ఐటీ జోన్లలో నూతనంగా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, హస్తకళల ప్రత్యేకతలను ప్రతిబింబించేలా హస్తకళల అభివృద్ధి సంస్థకు ప్రత్యేక లోగో సిద్ధం చేస్తామని మంత్రి అన్నారు. హస్తకళలు, చేతి వృత్తి కళాకారుల కోసం సంస్థ ఎండీ శైలజా రామయ్యర్ చేస్తున్న కృషిని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పది జిల్లాల్లో హస్తకళల అభివృద్ధి ద్వారా చేపడుతున్న శిక్షణ, ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర కార్యకలాపాలను శైలజా రామయ్యర్ పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సంస్థకు నిధుల కేటాయింపు, నిర్మల్ హస్తకళలకు చేయూత తదితర అంశాలపై నివేదిక రూపొందించాల్సిందిగా మంత్రి ఆదేశించారు. లేపాక్షి పేరు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినందున వెంటనే తెలంగాణ హస్తకళలకు సంబంధించిన పేరును నిర్ణయించాలని జూపల్లి సూచించారు. హస్తకళల అభివృద్ధి సంస్థ అధికారులు మసూద్, కిషోర్, నాగేశ్వర్‌రావు, విజయసారథి తదితరులు మంత్రి వెంట ఉన్నారు.