Online trading company
-
Sankalp Siddhi Case: ఐదుగురి అరెస్ట్.. ఏపీ, తెలంగాణలో రూ.170 కోట్లు సేకరణ
సాక్షి, విజయవాడ ప్రతినిధి: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘సంకల్ప సిద్ధి’ కేసులో ఐదుగురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సంస్థకు చెందిన ఐదు బ్యాం కు ఖాతాలను, 14 ప్రాంతాల్లోని ఆస్తులను, విలు వైన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా సోమవారం వెల్లడించారు. ‘సంకల్ప సిద్ధి ఈ–కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను గుత్తా వేణుగోపాల్, అతని సోదరుడు గుత్తా కిషో ర్ ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్ ఇంపోర్ట్ అం డ్ ఎక్స్పోర్ట్ పేరుతో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుం చి అనుమతి తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆన్లైన్ వెబ్ పోర్టల్, యాప్‌ను రూపొందిం చారు. ఈ కంపెనీలో కొందరు డైరెక్టర్లను చేర్చుకుని చట్టవిరుద్ధంగా మనీ సర్క్యులేషన్ స్కీం, మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు తెరతీశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు ఒక కో–ఆర్డినేటర్‌ను నియమించుకుని ఐదు ఆకర్షణీయమైన పథకాలతో ప్రజల నుంచి రూ.170 కోట్ల వరకు వసూలు చేశారు. ఈ మొత్తంలో కొంత నగదును డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించారు. గత 15 రోజులుగా విత్‌డ్రాలు నిలిచిపోవడంతో ఐదుగురు ఫిర్యాదు చేశారు. ఐదు ప్రత్యేక బృందాలతో విచా రణ నిర్వహించాం. ఆర్బీఐ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపె నీస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ మోసానికి పాల్పడ్డారని గుర్తించాం.’ అని సీపీ వెల్లడించారు. అరెస్టయినవారు వీరే... ‘ప్రాథమిక విచారణ అనంతరం కంపెనీ సీఎండీలు గుత్తా వేణుగోపాలకృష్ణ (విజయవాడ), గుత్తా కిషోర్ (బళ్లారి, కర్ణాటక), డైరెక్టర్లు గంజాల లక్ష్మి, మావూరి వెంకటనాగలక్ష్మి (విజయవాడ), సయ్యద్ జాకీర్‌హుస్సేన్ (గుంటూరు)ను అరెస్ట్ చేశాం. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. అరెస్ట్ చేసినవారిపై విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. వారి నుంచి రెండు కార్లు, రెండు సెల్ఫోన్లు, 728 గ్రాముల బంగారం, 10.5 కేజీల వెండి, రూ.51 లక్షల నగదు, నాలుగు కంప్యూటర్లు, ఒక ల్యాప్‌టాప్, రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. ఎంత వసూలు చేశారు, ఎంత మేరకు మోసానికి పాల్పడ్డారనేది పూర్తిస్థాయి దర్యాప్తులో తేలుతుంది. ఆ సంస్థ ఆస్తులు, సీజ్ చేసిన బ్యాంకు ఖాతాల్లోని నగదు వివరాలను రాష్ట్ర హోం శాఖకు, న్యాయస్థానానికి తెలియజేస్తాం. న్యాయస్థానం ఆదేశాల మేరకు మోసపోయిన డిపాజిట్‌దారులకు నగదు చెల్లిస్తాం. ఈ మోసంతో గానీ, సంస్థ నిర్వాహకులతో గానీ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఐదో తరగతి మాత్రమే చదివిన గుత్తా వేణుగోపాలకృష్ణ 1998లో క్వాంటమ్ మనీ సర్క్యులేషన్ స్కీంలో చేరాడు. ఆ తర్వాత మరికొన్ని సంస్థలలో చేరి మనీ సర్క్యులేషన్, మల్టీలెవల్ మార్కెటింగ్‌పై అవగాహన పెంచుకుని హైదరాబాద్‌లో సొంతగా ప్లాంట్ ఎన్రిచ్ ఎంటర్‌ప్రైజస్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత విజయవాడ వచ్చి సంకల్ప సిద్ధి ఈ–కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించాడు.’ అని సీపీ రాణా వివరించారు. -
కొంపముంచిన ప్రకటన! 20 రోజులు.. రూ.11.26 లక్షలు
సాక్షి హైదరాబాద్: ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ అందినకాడికి దండుకుంటున్న ఇద్దరు సైబర్ నేరస్తులను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్స్ ఏసీపీ ఎస్. హరినాథ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మల్కజ్‌గిరికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి నోరి సుబ్రమణ్యం లండన్‌కు చెందిన ట్రేడ్ క్లిఫ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ కంపెనీపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను చూశాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ప్రకటన చూసి, ఆకర్షితుడైన అతను గతేడాది ఏప్రిల్ 2న తన పేరు నమోదు చేసుకున్నాడు. దీంతో అతనికి యూజర్ ఐడీ, పాస్వర్డ్ వచ్చింది. ఆ తర్వాత బాధితుడు తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.3,07,800 నగదును అకౌంట్ నంబర్: 020405010053, ఐఎఫ్ఎస్సీ: ఐసీఐసీ0000204కు బదిలీ చేశాడు. తన తల్లి ఖాతాను క్రియేట్ చేసి మరోసారి రూ.3,07,800 నగదును కూడా పంపించాడు. ఇలా 20 రోజుల వ్యవధిలో వివిధ పేర్లతో ఖాతాలు తెరిచి ఆరు లావాదేవీల్లో రూ.8,20,800 సొమ్మును నిందితుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశాడు. ఇదే సమయంలో బాధితుడు సుబ్రమణ్యంకు ట్రేడ్ క్లిఫ్ వెబ్‌సైట్‌ను సృష్టించిన వ్యక్తే క్రిప్టో గ్లోబల్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.క్రిప్టోజీపీఆర్వో.కామ్) వెబ్‌సైట్‌ను కూడా క్రియేట్ చేసినట్లు తెలిసింది. ఈ వెబ్‌సైట్‌ను తన స్నేహితుడు సరూర్‌నగర్‌కు చెందిన ముక్తా నగేష్‌కు సూచించాడు. దీంతో ఈయన మూడు లావాదేవీల్లో అదే ఖాతా నంబర్‌కు రూ.3,06,180 నగదు బదిలీ చేశాడు. అయితే నగదు జమ అయ్యాక అటువైపు నుంచి నిందితుడు స్పందించడం మానేశారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. గతేడాది జూన్ 7న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. మొత్తంగా ఇద్దరు బాధితుల నుంచి రూ.11,26,980 నగదును మోసగాళ్లు కొట్టేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బ్యాంక్ ఖాతా నంబర్లు, ఇతర ఏజెన్సీల నుంచి సాంకేతిక ఆధారాలు సేకరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు అత్తాపూర్, నలంద నగర్లో ఉంటున్న బండ్లమూడి రవి, వేములవాడ రఘులను బుధవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి ల్యాప్‌టాప్, మూడు సెల్ఫోన్లు, మూడు చెక్ బుక్‌లు, పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. లక్నోకు చెందిన అన్నదమ్ములు వీర్ సింగ్, సందీప్‌లతో పరిచయం ఏర్పడ్డాక.. గత కొన్నేళ్లుగా రవి మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట అమాయకులను మోసం చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వేములవాడ రఘుతో స్నేహం ఏర్పడింది. ఇద్దరు కలిసి ట్రేడింగ్ వ్యాపారం పేరిట జనాలను మోసం చేయాలని నిర్ణయించుకున్నారు. మాస్టర్ ట్రేడర్స్, సూపర్ ఆన్లైన్ సర్వీసెస్, ట్రేడ్ క్లిఫ్, వాజిరాక్స్ ట్రేడింగ్ వెబ్సైట్లను సృష్టించారు. ఆయా లావాదేవీలను నిర్వహించేందుకు హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, గోవాలతో బ్యాంక్ ఖాతాలను తెరిచారు. రవి ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై విపరీతమైన ప్రచారం చేసేవాడు. మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్‌ల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని పోస్ట్‌లు చేస్తుండేవాడు. వీటిని నమ్మిన అమాయకుల నుంచి అందినకాడికి దండుకొని వెబ్‌సైట్‌ను మూసేసి... కొత్త వెబ్సైట్ ప్రారంభించేవారు. కాజేసిన సొమ్ములో రవి, రఘు, వీర్‌సింగ్ సమాన వాటాలు పంచుకునేవాళ్లు. సందీప్ సింగ్ ట్రేడింగ్ ఖాతాలను సమకూర్చినందుకు గాను కమీషన్ ఇచ్చేవారు. (చదవండి: ఒక్క ఫోన్ నెంబర్‌తో లూటీ... రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు) -
ఆన్లైన్లో హస్తకళల మార్కెటింగ్
సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ అమెజాన్‌తో పాటు ఇతర ఆన్లైన్ వ్యాపార సంస్థలతో హస్తకళల సంస్థను అనుసంధానిస్తామని వాణిజ్య, పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఆన్లైన్ మార్కెటింగ్ విధానం ద్వారా తెలంగాణ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సాహం, గుర్తింపు లభించేలా చూస్తామన్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థను మంత్రి గురువారం సందర్శించారు. సంస్థ షోరూంలో ఉన్న నిర్మల్ తదితర హస్తకళా ఉత్పత్తులను మంత్రి పరిశీలించారు. ప్రస్తుతం హస్తకళల విక్రయాలు, షోరూంలు రాష్ట్రంలో మూడు నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యాయన్నారు. ఆన్లైన్ విక్రయాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో దళారీల ప్రమేయం లేకుండా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వృత్తి కళాకారులకు ప్రోత్సాహం... హస్తకళలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చేతి వృత్తి కళాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు. హస్తకళలకు గిరాకీ పెంచేందుకు యాదాద్రి, భద్రాచలం, హైటెక్స్, ఐటీ జోన్లలో నూతనంగా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, హస్తకళల ప్రత్యేకతలను ప్రతిబింబించేలా హస్తకళల అభివృద్ధి సంస్థకు ప్రత్యేక లోగో సిద్ధం చేస్తామని మంత్రి అన్నారు. హస్తకళలు, చేతి వృత్తి కళాకారుల కోసం సంస్థ ఎండీ శైలజా రామయ్యర్ చేస్తున్న కృషిని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పది జిల్లాల్లో హస్తకళల అభివృద్ధి ద్వారా చేపడుతున్న శిక్షణ, ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర కార్యకలాపాలను శైలజా రామయ్యర్ పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సంస్థకు నిధుల కేటాయింపు, నిర్మల్ హస్తకళలకు చేయూత తదితర అంశాలపై నివేదిక రూపొందించాల్సిందిగా మంత్రి ఆదేశించారు. లేపాక్షి పేరు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినందున వెంటనే తెలంగాణ హస్తకళలకు సంబంధించిన పేరును నిర్ణయించాలని జూపల్లి సూచించారు. హస్తకళల అభివృద్ధి సంస్థ అధికారులు మసూద్, కిషోర్, నాగేశ్వర్రావు, విజయసారథి తదితరులు మంత్రి వెంట ఉన్నారు.