సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు జాతీయ స్థాయి లో ‘ఈ పంచాయతీ’ పురస్కారం దక్కింది. పంచాయతీరాజ్ దివస్ (ఏప్రిల్ 24)ను పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌లోని మాండ్ల జిల్లా రాంనగర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్ అవార్డును అందుకున్నారు. రాష్ట్రంలోని మరో 8 ఉత్తమ స్థానిక సంస్థలకూ అవార్డులు ప్రదానం చేశారు. కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతుల మీదుగా దీనదయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తికరణ్ పురస్కారాన్ని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ శోభారాణి, సిద్దిపేట మండల పరిషత్ అధ్యక్షుడు యాదయ్య, శ్రీరాంపూర్ మండల పరిషత్ అధ్యక్షుడు సారయ్యగౌడ్ అందుకున్నారు.
గ్రామపంచాయతీ విభాగంలో రాజన్న సిరిసిల్ల మండలం ముష్టిపల్లి సర్పంచ్ బాలయ్య, సిద్దిపేట మండలం ఇర్కోడు సర్పంచ్ వినీత, రంగారెడ్డి జిల్లా ఫారూఖ్‌నగర్ మండలం గంట్లవల్లి సర్పంచ్ లలిత, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల సర్పంచ్ నర్సింగరావు అందుకున్నారు. నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కారాన్ని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి సర్పంచ్ రాజయ్య అందుకున్నారు. 2016–17లో పనితీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రకటించింది.
కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఆన్‌లైన్‌లో పంచాయతీరాజ్ శాఖలోని పలు పథకాల వెబ్‌సైట్లను ఏర్పాటుచేసి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్‌డేట్‌గా చేస్తూ దేశంలోనే తెలంగాణ ఈ పంచాయతీ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. కాగా అవార్డును అందుకున్న కమిషనర్ నీతూప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులను పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు.
తెలంగాణకు ‘ఈ పంచాయతీ’ అవార్డు
Published Wed, Apr 25 2018 12:39 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment