
'పదవులు రాకుంటే వాళ్లదీ ఇదే దారి'
హైదరాబాద్: టీఆర్ఎస్లో చేరాల్సిందిగా తాము ఎవరినీ బలవంతం చేయలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొంతమంది నేతలు వచ్చినా పార్టీలోకి తీసుకోబోమని చెప్పారు. మాజీ మంత్రి డీకే అరుణకు తెలంగాణను దోచుకున్న చరిత్ర ఉందని విమర్శించారు. టీఆర్ఎస్ను విమర్శించే నైతిక హక్కు ఆమెకు లేదని జూపల్లి అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, డీకే అరుణ సోదరుడు రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీకే అరుణ.. టీఆర్ఎస్, రామ్మోహన్ రెడ్డిలపై చేసిన విమర్శలపై జూపల్లి స్పందించారు. పీసీసీ లేదా సీఎల్పీ పదవి వస్తుందని కాంగ్రెస్లో కొందరు ఉన్నారని, ఆ ఆశ నెరవేరకుంటే వారిదీ ఇదేదారని అన్నారు. టీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. అప్పుడు డీకే అరుణ, జానారెడ్డి ఎక్కడకు పోయారని మండిపడ్డారు.