కోటి వెలుగులు
♦ విద్యుద్దీపాలతో ముస్తాబైన ప్రభుత్వ కార్యాలయాలు
♦ నేడు సరూర్‌నగర్ స్టేడియంలో జిల్లాస్థాయి వేడుకలు
♦ ముఖ్య అతిథిగా పాల్గొననున్న మంత్రి మహేందర్‌రెడ్డి
కలల తెలంగాణ సాకారమైన రోజు.. కోటి ఆశలు నెరవేరిన రోజు. తెలంగాణ స్వయం పాలన వైపు అడుగులేసిన రోజు. ఏళ్ల పోరాట ఫలితంగా రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఆవిర్భవించిన తెలంగాణ.. పునర్నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో నేడు రాష్ట్ర ప్రభుత్వం అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. జిల్లాస్థాయిలో వేడుకలను కన్నులపండువగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు రూ.30లక్షలు కేటాయించింది. ఈక్రమంలో జిల్లా యంత్రాంగం సరూర్‌నగర్ స్టేడియంలో జిల్లాస్థాయి వేడుకల ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తోంది. ఉదయం 9గంటలకు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సాస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కార్యాలయాలు ధగధగ
అవతరణ వేడుకల్లో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీపాలతో ముస్తాబయ్యాయి. కలెక్టర్ కార్యాలయంతోపాటు జిల్లా పరిషత్, రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయాలు.. ఇతర జిల్లా కార్యాలయాలు కూడా విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉద్యోగులకు వివిధ కేటగిరీల్లో ఆటపోటీలు నిర్వహించారు. గెలుపొందిన బృందాలకు అవతరణ వేడుకల్లో బహుమతులు ప్రదానం చేయనున్నారు. ప్రభుత్వ శాఖల్లో అత్యుత్తమ సేవలందించిన వారితోపాటు ఇతర రంగాల్లోనూ స్వచ్ఛంధ సేవలు చేసిన వారికి కూడా జిల్లా యంత్రాంగం అవార్డులు అందించనుంది.