ఇక షీ క్యాబ్స్ పరుగులు
10 వాహనాలను ప్రారంభించిన మంత్రి మహేందర్‌రెడ్డి
త్వరలో వంద షీ క్యాబ్‌లు...
మహిళల భద్రతే సర్కార్ లక్ష్యం
హైదరాబాద్: అదిగో ఇదిగో అంటూ ఏడాది పాటు ఊరించిన షీ క్యాబ్స్ ఎట్టకేలకు రోడ్డెక్కాయి. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణా కమిషనర్ కార్యాలయంలో మంగళవారం మంత్రి మహేందర్‌రెడ్డి షీ క్యాబ్స్‌ను లాంఛనంగా ప్రారంభించారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని, మహిళలకు సురక్షితమైన, నమ్మకమైన రవాణా సదుపాయాన్ని అందజేసే లక్ష్యంతోనే షీ క్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన చెప్పారు. దశల వారీగా 100 షీ క్యాబ్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. షీ క్యాబ్స్‌పై ప్రభుత్వం 35 శాతం సబ్సిడీ అందజేస్తోందన్నారు. మొదటి విడతగా 10 క్యాబ్‌లను ప్రవేశపెట్టామని, త్వరలో మరో 8 అందుబాటులోకి రానున్నట్లు రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు. ఫిక్కీ సంస్థలో మహిళా డ్రైవర్లకు ఉచిత శిక్షణనిస్తున్నారని, డ్రైవింగ్‌లో అత్యుత్తమ శిక్షణ పొందిన మహిళా డ్రైవర్లను ప్రతి నెలా 20 మంది చొప్పున ఎంపిక చేసి షీ క్యాబ్స్ అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, పోలీస్ ఉన్నతాధికారులు స్వాతిలఖ్రా, సౌమ్యామిశ్రా, స్త్రీశిశు సంక్షేమ శాఖ డెరైక్టర్ విజయేందిర, ఫిక్కీ సంస్థ నిర్వాహకులు జ్యోత్స్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం
జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన షీ క్యాబ్స్‌ను పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానం చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. క్యాబ్‌ల కదలికలు ఎప్పటికప్పుడు ఈ కేంద్రంలో నమోదవుతాయన్నారు. సీవీ ఆనంద్ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, షీటీమ్స్ సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తున్నాయన్నారు. స్వాతీలఖ్రా మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌ల నుంచి రాకపోకలు సాగించే ఒంటరి మహిళలకు క్యాబ్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు.