పర్యాటక రంగానికి ప్రాధాన్యం
వండర్‌లా పార్కు ప్రారంభోత్సవంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, చందూలాల్
మహేశ్వరం: ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యమిస్తూ, ప్రోత్సహిస్తోందని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామం సమీపంలో వండర్‌లా 60 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అమ్యూజ్‌మెంట్ పార్కును పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వారు పార్కులో తిరిగి రైడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వండర్‌లా పార్కు ఆసియాలో 7వ స్థానం, భారతదేశంలో మొదటి స్థానంలో ఉందన్నారు.
దేశంలోనే మొదటిసారిగా రివర్స్ రూపింగ్స్ రోలర్ కోస్టర్‌తో వండర్‌లా హైదరాబాద్ ప్రజలను అలరించనుందన్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఒక మెగావాట్ సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల ఏకైక ఆహ్లాదపార్క్ వండర్‌లా అని పేర్కొన్నారు. దీని పక్కనే సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో భారీ పార్కు రానుందన్నారు. కాగా, ఈ ప్రాంతం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి చందూలాల్ అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, ఐటీ, పీఆర్‌శాఖల మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని భారీ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, పార్కులను తెస్తున్నారని అన్నారు.
వండర్‌లా ఎండీ అరుణ్ కే చిట్టిల పిళ్లై మాట్లాడుతూ.. వండర్‌లా అమ్యూజ్ పార్కుల్లో మొదటిది బెంగళూర్‌లో, రెండోది కొచ్చిలో ఏర్పాటు చేయగా, ప్రస్తుతం మూడో పార్కును హైదరాబాద్ రావిర్యాలలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్నారనడంతో స్థానిక టీఆర్‌ఎస్ నేతలు భారీగా పార్కుకు వచ్చారు. కానీ ఆయన గైర్హాజరు కావడంతో నిరాశ చెందారు. ఇంకా ఈ కార్యక్రమంలో వండర్‌లా వ్యవస్థాపకులు కోచోసెప్ థామస్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రియా అరుణ్, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి, పార్కు ఇన్‌చార్జ్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.