‘స్థానిక’ ఎమ్మెల్సీ పోరు నేడే | 'Native' MLC war today | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎమ్మెల్సీ పోరు నేడే

Published Sun, Dec 27 2015 4:56 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

‘స్థానిక’ ఎమ్మెల్సీ పోరు నేడే - Sakshi

‘స్థానిక’ ఎమ్మెల్సీ పోరు నేడే

4 జిల్లాల్లోని ఆరు స్థానాల్లో ఎన్నికలు
 
 సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 3,869 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ జరిగే రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సాయుధ బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోటాపోటీ క్యాంపులు నిర్వహించిన ప్రధాన పార్టీలు తమ ఓటర్లను శనివారం సాయంత్రానికి జిల్లాల సరిహద్దుల్లోకి తెచ్చాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ కోసం నేరుగా పోలింగ్ స్టేషన్ల వద్దకే వారిని తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా ఐదు జిల్లాల్లోని ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమై అధికార టీఆర్‌ఎస్ ఖాతాలో చేరాయి.

 నల్లగొండలో రసవత్తర రాజకీయం
 స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలను ఏకపక్షం చేసేందుకు అధికార టీఆర్‌ఎస్ చేసిన ప్రయత్నం కొన్ని జిల్లాల్లో సాగలేదు. కరీంనగర్, వరంగల్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆరు స్థానాలలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను సైతం ఎన్నికల బరి నుంచి ఉపసంహరించుకొనేలా చేయడంలో టీఆర్‌ఎస్ వ్యూహం ఫలించింది. మిగతా నాలుగు జిల్లాల్లో ఏదో ఒక పార్టీ బలంగా ఉండడంతో పోటీ అనివార్యమైంది. నల్లగొండలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ రె ండు పార్టీల అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు వ్యూహ ప్రతివ్యూహాలతో తలపడుతున్నారు.

ఈ స్థానం కోసం ఇప్పటికే రూ. 100 కోట్లకుపైగా వెచ్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్‌కు స్థానికంగా బలం ఉండటంతోపాటు ప్రతిపక్ష నేత జానారెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఎన్నికను మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి తరఫున మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కూడా ప్రచారం చేశారు.

 మూడు జిల్లాలపై టీఆర్‌ఎస్ ధీమా!
 రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు టీఆర్‌ఎస్ తరఫున మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి, సుంకరి రాజు పోటీ పడుతుండగా కాంగ్రెస్ తరఫున ఎ. చంద్రశేఖర్, టీడీపీ నుంచి బుక్క వేణుగోపాల్ పోటీ పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్, టీడీపీకి కొన్ని నియోజకవర్గాల్లో బలం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీలు ఉనికి కోల్పోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, టీడీపీ బలమైన అభ్యర్థులను పోటీలో నిలిపాయి. టీఆర్‌ఎస్ నుంచి ఎస్. జగదీశ్వర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి బరిలో నిలవగా కాంగ్రెస్ నుంచి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కె. దామోదర్‌రెడ్డి, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీలకు ఒక్కో సీటు గెలుచుకునే బలం ఉన్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరడంతో పరిస్థితి మారింది. దీంతో గెలుపుపై అధికార పార్టీ  ధీమాగా ఉంది. ఖమ్మంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బాలసాని లక్ష్మీనారాయణ, సీపీఐ అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వర్‌రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి లింగాల కమల్‌రాజుతోపాటు మరో ఇద్దరు స్వతంత్రులు పోటీ పడుతున్నారు. ఇక్కడ సీపీఎంతోపాటు టీడీపీ, కాంగ్రెస్, ఇతర వామపక్ష పార్టీలు సీపీఐ అభ్యర్థికే మద్దతిస్తుండటం గమనార్హం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement