‘ఫీజుల’పై స్వీయ నియంత్రణ పాటించండి
- ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు మంత్రి కేటీఆర్ సూచన
- మంత్రి మహేందర్ రెడ్డితో కలసి హైదరాబాద్‌లో కైరో గ్లోబల్ స్కూల్‌ను ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు చదువుకునే దశ నుంచి చదువు కొనే దిశగా విద్యారంగం పయని స్తోందని... విద్య అనగానే వ్యాపార మన్న భావన కలిగించే దుస్థితి నెలకొందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తరుణంలో విద్య ప్రాధాన్యతను గుర్తించి ప్రపంచస్థాయి బోధనా పద్ధతులతో విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసర ముందన్నారు. విద్యా ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా, సేవా దృక్పథాన్ని వీడకుండా, విద్య–వ్యాపారాల మధ్య సమతూకం, సమన్వ యం పాటిస్తూ ఫీజుల విషయంలో స్వీయ నియం త్రణ పాటించాలని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు కేటీఆర్ సూచించారు.
పాఠశాలలు, విద్యాలయాల ఏర్పాటు వ్యయం బాగా పెరిగిందని, మంచి ఉపాధ్యాయులు కావాలంటే మంచి జీతభత్యాలు కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. విద్యాసంస్థల ఏర్పాటు, బోధన కత్తి మీద సాములా మారిందన్న విషయాన్ని అందరూ అంగీకరించక తప్పదన్నారు. హైదరా బాద్‌లోని చిత్రపురి కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన కైరో గ్లోబల్ స్కూల్‌ను రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య కేవలం విజ్ఞానాన్నే కాకుండా ఉన్నత జీవన ప్రమాణాలనూ అందించేలా ఉండాలన్నారు. ఎప్పటికీ మంచి ప్రమాణాలతో విద్యను అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ బడి బాటను ప్రారంభించిన రోజే కైరో స్కూల్‌ని ప్రారంభించడం సంతోషకరమన్నారు.
ప్రైవేటును ప్రోత్సహిస్తూనే ప్రభుత్వ విద్య బలోపేతం...
కేవలం ప్రభుత్వమే మొత్తం విద్యా వ్యవస్థను నడపగలిగినా ఇప్పటికే ఏర్పడిన అనేక ప్రైవేటు విద్యా సంస్థలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు రంగంలో విద్యను ప్రోత్సహిస్తూనే అందుకు దీటుగా ప్రభుత్వ రంగంలో విద్యను అందిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ప్రభుత్వ విద్యను నడిపిస్తోందన్నారు. సర్కారు 500కుపైగా గురుకుల పాఠశాలలు ప్రారంభించి అందరికీ విద్య అందిస్తోందన్నారు. చిత్ర రంగం విచిత్రమై నదని, ఇక్కడ బళ్లు ఓడలు... ఓడలు బళ్లవడం సాధారణమన్నారు.
చిత్ర సీమలో పని చేసే వాళ్ల జీవితాలూ ఒడిదుడుకులతో ఉంటాయన్నారు. చిత్రపురి కాలనీలోనే కైరో గ్లోబల్ స్కూల్‌ను పెట్టినందున కాలనీ వాసులకు ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని యాజమాన్యాన్ని మంత్రి కోరారు. దీనిపై స్పందించిన స్కూల్ చైర్మన్ వెంకట్‌రెడ్డి 50 శాతం రాయితీ హామీని చిత్రపురి హౌసింగ్ సొసైటీకి ఇచ్చామన్నారు. కార్యక్రమం లో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, సినీ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.