సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేశ్వరంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ–క్లాస్ రూంలో ఉన్న విద్యార్థులతో సంభాషించారు. మన్‌సాన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న రోగికి హైదరాబాద్‌లో ఉన్న డాక్టర్ టీ–ఫైబర్ ద్వారా అందించిన టెలీ మెడిసిన్ సేవలను పరిశీలించారు. తుమ్మలూరు గ్రామంలో నెలకొల్పిన అత్యాధునిక కియోస్క్ ద్వారా గ్రామస్తులకు వ్యవసాయ సమాచారం అందించడాన్ని పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టి–ఫైబర్ ప్రాజెక్టు తీసుకురానున్న టెక్నాలజీ ఫలితాలు, వాటి ద్వారా ప్రజలకు అందే సేవలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ‘కంగ్రాట్స్.. కీప్ ఇట్ అప్’అంటూ మంత్రి కేటీఆర్‌ను రవిశంకర్ అభినందించారు. మహేశ్వరం మండలంలోని నాలుగు గ్రామాల్లోని ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను సచివాలయం, ప్రగతి భవన్, రాజ్‌భవన్, స్టేట్ డాటా సెంటర్లకు అనుసంధానం చేశారు. తెలంగాణ టి–ఫైబర్ ద్వారా ఎలాంటి సేవలు, సౌకర్యాలు అందుతాయో ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి చూపించారు. ప్రతి గృహానికి ఒక జీబీపీఎస్ ఇంటర్నెట్ సేవలు అందించే సామర్థ్యం ఈ నెట్‌వర్క్‌కు ఉందని కేటీఆర్ వివరించారు.
ఫైబర్ గ్రిడ్ ద్వారా కలిగే ప్రయోజనాలను వీక్షించిన మంత్రులు, అక్కడే ఏర్పాటు చేసిన ఇతర సేవలను ఫైబర్ గ్రిడ్ ఎండీ సుజయ్ కారంపురిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో భాగంగా మంత్రి కేటీఆర్ పలువురితో సమావేశమయ్యారు. ఉదయం ‘రీ థింకింగ్ గవర్నెన్స్ ఇన్ డిజిటల్ ఎకానమీ’అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు దేశాల ఐటీ మంత్రులతో కలసి పాల్గొన్నారు. నాస్కామ్ మాజీ చైర్మన్ బీవీఅర్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌తోపాటు, బంగ్లాదేశ్ ఐటీ మంత్రి జునైద్ అహ్మద్ పాలక్‌తోపాటు హరీన్ ఫెర్నాండో( శ్రీలంక), వాహన్ మార్టీరోస్యన్(ఆర్మేనియా), ఆబ్దుర్ రహీమ్(నైజీరీయా) పాల్గొన్నారు.
కంగ్రాట్స్.. కీప్ ఇట్ అప్!
Published Tue, Feb 20 2018 1:20 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment