ప్రభుత్వ శాఖల్లో ఇంటర్న్‌షిప్
- టాస్క్ సమావేశంలో మంత్రి కేటీఆర్
- జర్మనీ తరహా ప్రాక్టీస్ స్కూల్ విధానం పాటించాలి
- పరిశ్రమల్లో ఏడాది ఇంటర్న్‌షిప్‌కు అవకాశమివ్వాలి
- ఇంజనీరింగ్ కళాశాలలకు సూచన
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతోపాటు కళాశాలలు కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు ప్రభుత్వం సహకారమందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని చాలా కళాశాలలు అత్యుత్తమ ప్రమాణాల కోసం ప్రయత్నిస్తున్నాయని, కానీ కొన్ని కళాశాలల వ్యాపార దృక్పథం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్లు, విద్యా సంస్థల చైర్‌పర్సన్లు, పరిశ్రమల ప్రతినిధులతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కళాశాలల యాజమాన్యాలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పరిమాణం కంటే ప్రమాణాలకు ప్రాధాన్యం ఇస్తోందని, అందుకే నాణ్యత ప్రమాణాలు పాటించని కళాశాలలపై గట్టి చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశానికి యువతరమే గొప్ప బలమని, ప్రపంచంలో ఏ దేశానికీ లేనంత యువశక్తి మనదేశంలో ఉందన్నారు. ఏటా భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ చేసి బయటకొస్తున్న విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ లోపం ఉంటోందని పరిశ్రమల వర్గాలు తెలిపాయని మంత్రి చెప్పారు. ఇంజనీరింగ్ విద్యలో విశ్వఖ్యాతి గడించిన జర్మనీ దేశ ప్రాక్టీస్ స్కూల్ విధానం తరహాలో ఇక్కడి ఇంజనీరింగ్ విద్యార్థులను పరిశ్రమలో కనీసం ఓ ఏడాది ఇంటర్న్‌షిప్ ఇస్తే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ఈ దిశగా కళాశాలల యాజమాన్యాలు ఆలోచించాలని సూచించారు.
వరంగల్, నిజామాబాద్‌లలో టాస్క్ కేంద్రాలు
డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన శిక్షణ కోసం టాస్క్ ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. గ్రామీణ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో వినూత్న కార్యక్రమాలను టాస్క్ చేపట్టిందని, ఇప్పటికే ఎంతో మందిని ఉద్యోగులుగా తీర్చిది ద్దిందని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో టాస్క్ ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంత ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. విద్యార్థులకు టాస్క్ శిక్షణ ఉపయోగపడేలా ఇంజనీరింగ్, ఫార్మసీ, వృత్తివిద్యా కళాశాలలు సహకరించాలని కోరారు.